వినోదాత్మకంగా…. ‘గీత గోవిందం’ చిత్ర సమీక్ష

                                                 సినీ వినోదం రేటింగ్ : 3/5

జిఎ2 పిక్చ‌ర్స్ బ్యానర్ పై ప‌రుశురామ్‌ రచన దర్శకత్వం లో,అల్లు అర‌వింద్‌ స‌మ‌ర్ప‌ణ‌ లో.. బ‌న్నివాసు ఈ చిత్రాన్ని నిర్మించారు
కధలోకి వెళ్తే…
విజ‌య్ గోవిందం(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఇంజ‌నీరింగ్ కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. అమ్మ చిన్న‌ప్పుడే చ‌నిపోవ‌డంతో.. కాబోయే భార్య‌ను ప్రేమ‌గా చూసుకోవాల‌ని విజ‌య్ గోవిందం అనుకుంటాడు. గుడిలో ఓ అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. గోవింద్ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఊరికి వెళ్ల‌డానికి బ‌స్సు ఎక్కిన గోవింద్‌కి బ‌స్సులో త‌ను గుడిలో చూసిన అమ్మాయి తార‌స‌ప‌డుతుంది. ఆ అమ్మాయి పేరు గీత‌(ర‌ష్మిక మండ‌న్న) అనుకోకుండా గీత‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ లిప్ లాక్ పెట్టేస్తాడు. విజ‌య్‌ని త‌ప్పుగా అర్థం చేసుకున్న గీత విష‌యాన్ని అన్న‌కు చెప్పేస్తుంది. గీత అన్న‌య్యే త‌న చెల్లెలికు కాబోయే భ‌ర్త అని త‌ర్వాత గోవిందంకు తెలుస్తుంది. అప్పుడు గోవిందం ఏం చేస్తాడు? గీత విజ‌య్ గురించి అన్న ద‌గ్గ‌ర చెప్పేస్తుందా? గోవిందం తన ప్రేమలోని సిన్సియారిటీని ఎలా నిరూపించుకున్నాడు ? గీత, గోవిందంను ప్రేమిస్తుందా ? ప్రేమిస్తే వారి ప్రేమకు వచ్చే సమస్య ఏంటి ? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే….
విశ్లేషణ…
క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా… స‌న్నివేశాల ప‌రంగా భావోద్వేగాలను మేళవించి డైరెక్ట‌ర్ ప‌రుశురాం సినిమాను చాలా చ‌క్క‌గా నడిపించాడు. స‌న్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్ష‌కుడికి అర్థ‌మైపోయినా.. వాటిని దర్శకుడు ఆసక్తికరంగా మలిచాడు. ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని అందించాడు. విజయ్‌ దేవరకొండను అర్జున్‌ రెడ్డి ఇమేజ్‌ నుంచి బయటకు తీసుకువచ్చి డిఫరెంట్‌ స్టైల్‌లో చూపించటంలో సక్సెస్‌ అయ్యాడు. దర్శకుడిగానే కాదు రచయితగాను మంచి మార్కులు సాధించాడు. కావాలని కామెడీ సీన్స్‌ను ఇరికించకుండా ప్రధాన పాత్రలతోనే మంచి కామెడీ పండించాడు.
 
తొలి భాగం ఎంటర్‌టైనింగ్‌గా నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త స్లో అయ్యాడు. ఎమోషనల్‌ సీన్స్‌ కాస్త సాగదీసినట్టుగా అనిపించాయి. కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించినట్లు అనిపిస్తుంది. హీరోయిన్‌.. హీరోని ఇబ్బంది పెట్టే సీన్స్ సినిమాటిక్‌గా అనిపిస్తాయి.
 
నటీనటులు…
‘అర్జున్‌ రెడ్డి’ సినిమాలో తన యాటిట్యూడ్‌తో యువ ప్రేక్షకులను అలరించిన విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో పూర్తి భిన్నంగా కనిపించాడు. హీరోయిన్‌ చుట్టూ భయస్తుడిలా తిరిగే పాత్రలో విజయ్ నటన చాలా బాగుంది. తన డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో ప్రతీ సీన్‌లోనూ ఎంటర్‌టైన్ చేయటంలో విజయ్ సక్సెస్‌ అయ్యాడు. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లో సెంటిమెంట్‌ పండించాడు. ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రష్మిక గీత పాత్రలో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని వేరియేషన్స్‌ చూపించింది.అయితే, భావోద్వేగ సన్నివేశాల్లో ర‌ష్మిక ఇంకా బాగా చేసుండాల్సింది.చాలా రోజుల తరువాత సుబ్బరాజుకు మంచి పాత్ర దక్కింది. ఇతర పాత్రల్లో వెన్నెల కిషోర్, రాహుల్‌ రామకృష్ణ, నాగబాబు, గిరిబాబు, అన్నపూర్ణ తమ పరిధి మేరకు బాగా చేసారు. చిన్న పాత్రలకి కూడా పాపులర్ హీరోయిన్స్ ను గెస్ట్ అపీరియన్స్ గా పెట్టడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్స్ అయ్యింది.
 
సాంకేతిక నిపుణులు…
ఇక గోపీసుంద‌ర్ అందించిన పాటల్లో “ఇంకేం ఇంకేం కావాలే”.. పాట ప్రేక్ష‌కుల‌ను బాగా ఆకట్టుకుంటుంది. నేప‌థ్య సంగీతం బావుంది. హీరోయిన్ హీరోల మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు.మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది -రాజేష్