అభ్యుదయ రచయిత ఎంవిఎస్‌ హరనాథరావు మరిలేరు !

నాటకరంగం మీదుగా వెండితెరకు వెళ్లిన అభ్యుదయ రచయిత ఎంవిఎస్‌ హరనాథరావు. పదునైన సంభాషణలతో ప్రగతిశీలభావాలు పలికించిన సృజనశీలి. సమాజ ప్రగతికి దోహదపడే కథలను, సంభాషణలనూ సమకూర్చిన రచయిత. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం ఒంగోలులో తుదిశ్వాస విడిచారు.ఆయన 1948 జులై 27వ తేదీన ఒంగోలులో జన్మించారు. స్కూల్లో మాస్టారి ప్రోత్సాహంతో ఐదేళ్ల వయసులోనే రంగస్థల ప్రదర్శన ఇచ్చారు. తల్లి సత్యవతి సంగీత ఉపాధ్యాయిని. దీంతో సహజం గానే సంగీత జ్ఞానం అబ్చింది. ఇక చిన్నప్పటినుంచి పుస్తకాలు చదవడం ఇష్టమైన అలవాటు. విద్యార్థిగా ఉండగానే స్కూలు మ్యాగజైన్‌ కోసం కథ రాశారు.

డిగ్రీ చదువు అయ్యాక పూర్తిగా నాటకాల్లో కూరుకుపోయారు. నాటకాలు రాయడం, ప్రదర్శిం చటం, వివిధ పరిషత్తుల్లో పాల్గొనటం- విస్తారంగా చేశారు. ఒంగోలులో ఉన్న అభ్యుదయ కళాకారులతో, ప్రజానాట్యమండలితో కలిసి పనిచేశారు. అభ్యుదయ దర్శకుడు టి.కృష్ణ, మాదాల రంగారావు, వెంకటేశ్వరరావు, పోకూరి రామారావు వంటి వారు ఒక బృందంగా ఏర్పడి- నాటక ప్రదర్శనల్లో అనేక ప్రయోగాలు చేశారు. వారు ఏర్పాటు చేసిన స్నేహ సమాఖ్య, తదనంతర కాలంలో అభినయ సమాజం పేరిట వందలాది నాటకాలూ ప్రదర్శించారు. హరనాధరావు రచించిన ‘జగన్నాధ రథచక్రాలు’ నాటకం అప్పట్లో పెద్ద సంచలనం. దేవుడి అస్తిత్వంపై చర్చ దాని ఇతివృత్తం. దానిలో హరనాధ్‌ తండ్రిగా, టి.కృష్ణ కొడుకుగా నటించి అలరించారు. ‘బూచి’ పేరిట నాలుగు పాత్రలతో తయారుచేసిన నాటకం మరొక ప్రయోగాత్మక రచన, ప్రదర్శన. సాహిత్య పాత్రలైన మధురవాణి, గిరీశం (కన్యాశుల్కం); మురారి (కీర్తిశేషులు నాటకం), రాజేశ్వరి (చలం మైదానం); ఎంకి, నాయుడుబావలతో రూపొందించిన ‘లేడిపంజా’ ఇంకొక ప్రయోగాత్మక నాటకం. అప్పట్లోనే అది వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. తేరేనామ్‌, జనారణ్యం, అంతం కాదిది ఆరంభం వంటి నాటికలూ హరనాధరావుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

జగన్నాధ రథచక్రాలు నాటకం మద్రాసులో ప్రదర్శించినప్పుడు సినీరంగం నుంచి ఆహ్వానం లభించింది. మాదాల రంగారావు ‘ముద్దమందారం’ సినిమాకు హరనాధరావు రాసిన ‘లేడి చంపిన పులి నెత్తురు’ కథ ఆధారం. మహాకవి శ్రీశ్రీ కవిత్వంలోని ఒక చరణం స్ఫూర్తితో ఈ కథ రాశారు. ఇది 1977లో ఆంధ్రజ్యోతి వీక్లీ నిర్వహించిన దీపావళి కథల పోటీలో రెండో బహుమతి పొందింది. ఆయన రాసిన ‘అరణ్య రోదన’, ‘4 వారాల మనిషి’ నవలలు తరువాతి కాలంలో సినిమాలుగా వచ్చాయి. అభ్యుదయ దర్శకుడు టి.కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటికీ (ఒక్క ‘వందేమాతరం’ సినిమాకు తప్ప) హరనాధరావే సంభాషణలు సమకూర్చారు. ఆయన సంభాషణలు, కథా సమకూర్చిన సినిమాలన్నీ సామాజిక దురాగతాలను, దౌర్జన్యాలను బలంగా ప్రశ్నించేవే! ‘ప్రతిఘటన’ చిత్రంలో అన్యా యానికి గురైన కథానాయిక విజయశాంతి ధైర్యంగా ప్రతినాయకులను ఎదుర్కొంటుంది. ఇప్పటికీ దేశం లో ఎక్కడైనా మహిళలపై దురన్యాయం జరిగితే- ఈ సినిమాలోని పాట ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వి నీతి పర్వంలో …’ గుర్తుకొస్తుంది. శోభన్‌బాబు నటిం చిన ప్రయోగాత్మక చిత్రం ‘దేవాలయం’లో హరనాధ రావు సమకూర్చిన సంభాషణలు, సంవాదాలూ ఆలోచింపచేసేవిగా ఉంటాయి. ‘అమ్మాయి కాపురం’ లో కథానాయిక గృహహింసను ఎదుర్కొన్న తీరూ, ప్రతిఘటన ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ ఉత్తేజభరితంగా నిలిచి ఉంటుంది.

ఎంఎస్‌ రెడ్డి తీసిన ‘రామాయణం’ చిత్రానికి ఆయనే సంభాషణలు రాశారు. ‘వెంకటేశ్వర మహత్యం’ సినిమాకు ఆరుద్ర సరళంగా, వ్యవహరి కంగా రాసిన మాటల శైలినే పిల్లల రామాయణంలో తాను అనుసరించానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. హరనాధరావు సినిమాల్లో స్త్రీపాత్రలు బలంగా, ప్రతిఘటనా స్వరంగా ఉంటాయి. దాదాపు 150 సినిమాలకు ఆయన కథ, సంభాషణలు సమకూర్చారు. చిరంజీవి నటించిన రాక్షసుడు సినిమాలో చిన్న పాత్రతో మొదలై అడపాదడపా 20 సినిమాల్లో నటించారు కూడా. సినీరంగానికి వెళ్లినా నాటకాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. ఏ కొద్దిపాటి విరామం దొరికినా నాటకాలు రాయడం, ప్రదర్శించటం చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో అయినా, నాటకాల్లో అయినా హరనాధరావు మౌఢ్యాన్ని, మూర్ఖత్వాన్ని, దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. సమిష్టిని, సంఘబలాన్ని, అభ్యుదయాన్ని బలంగా ఆకాంక్షించారు. ఆయన రూపొందించిన ఇతివృత్తాలన్నీ అభ్యుదయ ప్రేరకాలే! ఆయన మృతి తెలుగు సినిమాకు తీరని వెలితే!

సినీ రచయితల సంఘం సంతాపం

హరనాథరావు మృతిపట్ల తెలుగు సినీ రచయితల సంఘం, చిత్ర పరిశ్రమ ప్రగాఢ సాను భూతిని తెలిపింది. సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, మాదాల రవి, వందేమాతరం శ్రీనివాసరావు, తమ్మారెడ్డి భర ద్వాజ, పోకూరి బాబూరావు తదితరులు మంచి రచయితను కోల్పోయామనే బాధను వ్యక్తం చేశారు.

ఎంతగానో బాధించింది : గోపీచంద్‌

 కథా రచయితగా, సంభాషణల రచయితగా తెలుగు సినిమాకి ఎం.వి.ఎస్‌.హరనాధరావు గారు అందించిన విశేషమైన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. హరనాధరావుగారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మా నాన్నగారికి మాత్రమే కాక నాకు కూడా ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉండేది. నేను ‘బాబారు’ అని పిలుచుకొనే వ్యక్తి నేడు మా మధ్య లేడు.. అనే విషయాన్ని జీర్ణించు కోలేకపోతున్నాం.