వినోదాత్మక కథలకు మరింత ఆదరణ పెరిగింది !

” ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల ఇప్పుడు మంచి ప్రాంతీయ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా  సినిమా ప్రేక్షకులు  చూసే అవకాశం కలుగుతోంది. మంచి కథలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఆసక్తిగా సాగే వినోదాత్మక కథలకు వ్యూయర్స్‌ నుంచి ఎప్పుడూ మంచి స్పందన ఉంటుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల ఇలాంటి కథలకు మరింత ఆదరణ పెరిగింది’’ అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అంటోంది… ‘‘ కొంతకాలం క్రితం ప్రాంతీయ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ కొంత వరకే పరిమితం అయ్యేది. అయితే , పాన్‌ ఇండియన్‌ మూవీ బిజినెస్‌ విషయంలో ‘బాహుబలి’ అన్ని కోణాల్లో కొత్త దారులను చూపించింది. ఇప్పుడు సినిమాల మధ్య ఉన్న భాషా పరమైన హద్దులూ చెరిగిపోయాయి. మంచి కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో షో లేదా వెబ్‌సిరీస్‌లు చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఆ స్టోరీ నన్ను ఎగ్జైట్‌ చేయడంతో పాటు, నా పాత్ర కథను నడిపించేలా ఉండాలి’’ అని రకుల్‌ ప్రీత్‌ చెప్పింది.

అమన్‌ తో కలిసి ‘స్టారింగ్‌యూ’… రకుల్‌ ప్రీత్‌సింగ్‌ బిజినెస్‌ విమన్‌గా కొత్త కెరీర్‌ ప్రారంభించింది. డిజిటల్‌ టెక్నాలజీని వాడుకుంటూ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారికి అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఓ వేదిక ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి ముంబై, హైదరాబాద్‌, చెన్నై నగరాలకు సినిమా అవకాశాల కోసం వచ్చే వారికి ‘ఆడిషనింగ్‌’ ప్రక్రియలో అవకాశం అంత సులభంగా దొరకడం లేదు. దీంతో చాలా మందికి సిల్వర్‌ స్క్రీన్‌ ఆశలు ఉన్నా, అవి అడియాశలుగానే మిగిలిపోతున్నాయి. ఇలాంటి వారి కోసం ‘స్టారింగ్‌యూ’ స్టార్టప్‌తో ముందుకు వచ్చింది రకుల్‌.

తమ్ముడు అమన్‌ ప్రీత్‌సింగ్‌తో కలిసి ‘స్టారింగ్‌యూ’ అనే వెబ్‌సైట్‌/యాప్‌ని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ప్రారంభించింది. ‘సినిమా ఇండస్ట్రీలోకి రావాలి’ అనుకునే వారికి ఇదో డిజిటల్‌ వేదికగా పని చేయనుంది. మూవీ సెక్టార్‌కి సంబంధించి 24 క్రాఫ్ట్‌లలో అనుభవం ఉన్న వారు ఈ యాప్‌ ద్వారా తమ డ్రీమ్స్‌ నెరవేర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఈ మేరకు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమకు చెందిన ప్రముఖ స్టూడియోలు, నిర్మాణ సంస్థలతో ‘స్టారింగ్‌యూ’ ఒప్పందం చేసుకుంది.
సీనియర్‌ యాక్టర్‌ సునీల్‌షెట్టి సైతం ఇదే తరహా బిజినెస్‌ ప్రారంభించారు.

ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు… తెలుగులో రకుల్ టాప్ హీరోయిన్ గా వెలిగింది.  ఆ తర్వాత క్రమంగా ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అందుకే రకుల్ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. రెండేళ్లుగా ఆమె చేస్తూన్న హిందీ సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రకుల్‌ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 హిందీ చిత్రాల్లో రకుల్ నటిస్తోంది. ఇవన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆయుష్మాన్ ఖురానా ‘డాక్టర్ జీ’, అజయ్ దేవగన్ , సిద్ధార్ద్ మల్హోత్రా  మల్టీస్టారర్ ‘థ్యాంక్ గాడ్’, అమితాబ్, అజయ్ దేవగన్ మల్టీస్టారర్ ‘రన్ వే 34’, జాన్ అబ్రహం యాక్షన్ మూవీ ‘ఎటాక్’, అక్షయ్ కుమార్ తో ‘మిషన్ సిండ్రెల్లా’, ‘ఛత్రివాలి’ చిత్రాల్లో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.

” 2022 బాగుంటుందని ఆశిస్తున్నా. నేను నటించిన 7 సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటిలో 6 హిందీ చిత్రాలే. ఆ సినిమాలన్నింటిని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను. ప్రతీ చిత్రం కొత్త జోనర్‌లో తెరకెక్కింది. ‘ఛత్రీవాలీ’లో కండోమ్‌ టెస్టర్‌ పాత్రను పోషించగా.. ‘రన్‌ వే-34’లో ఫైలెట్‌గా కనిపిస్తాను. అలాగే ‘అటాక్‌’ సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కాగా, ‘డాక్టర్‌ జీ’లో గైనకాలజిస్ట్‌ రోల్‌ చేస్తున్నాను. గత రెండేళ్లుగా ఈ సినిమాల షూటింగ్‌ జరిగింది. థియేటర్లలో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడూ విడుదల అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అని రకుల్ చెబుతోంది.