కాలం ఏం రాసిపెడితే దాన్ని ధైర్యంగా స్వీకరిస్తా !

“నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్‌. కానీ నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి, ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉండగలనని అనుకోలేదు” అంటూ తన విడాకులపై ఇటీవల తొలిసారిగా స్పందించింది సామ్‌.

నాగ చైతన్యతో విడాకుల తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్‌, వచ‍్చిన నెగెటివ్‌ కామెంట్స్‌ తర్వాత.. ‘తన జీవితంలో ఎదురైన సమస్యల నుంచి బయటపడేందుకు తనకు సమయం ఇవ్వాలని’ కోరింది సామ్‌. ఇటీవల స్పందించిన సమంత తన వ్యక్తిగత జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో 2021 సంవత్సరం ఎంతో కష్టంగా గడిచిందని తెలిపింది. దీంతో తన భవిష్యత్తుపై తనకు ఆశలు లేవని చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత తనపై జరిగిన ట్రోలింగ్‌ గురించి స్పందించింది.

” నటిగా కష్టపడి నా కెరీర్‌ నిర్మించుకున్నాను. కానీ నా వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా 2021లో నా కలలన్నీ చెదిరిపోయాయి. నేనెంతో కృంగిపోయాను. ఇక సోషల్‌ మీడియా అనేది నటీనటులను తమ అభిమానులకు దగ్గర చేస్తుంది. దీని వల్ల  నెటిజన్స్‌ నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నాను. ప్రస్తుతం వారు నా జీవితంలో భాగమయ్యారు. కానీ మరికొంత మంది మాత్రం ట్రోల్‌ చేస్తు.. అసభ్యకరమైన కామెంట్స్‌ చేస్తున్నారు. వారందరినీ నేను కోరేది ఒక్కటే. నేను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్ చేయను. కానీ మీకు నా అభిప్రాయాలు నచ్చకపోతే దాన్ని చెప్పడానికి ఒక విధానం ఉంటుంది. ఈ ఏడాది నా కలలన్ని శిథిలమై పోయాయి. అందుకే వచ్చే సంవత్సరంపై ఆశలు పెట్టుకోలేదు. కాలం నా కోసం ఏది రాసిపెడితే దాన్ని ధైర్యంగా స్వీకరిస్తా” అంటూ ఆవేదనతో తెలిపింది సమంత.

మాజీ ప్రియుడు, హీరో సిద్దార్థ ఘాటైన కామెంట్ !… సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ పై సమంత ఇటీవల ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కు సమంత మాజీ ప్రియుడు తమిళ హీరో సిద్దార్థ ఘాటైన రిప్లై ఇచ్చారు… “ఇప్పటి ప్రమాదరకరమైన సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి.. వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ తనంతట తనే జరగదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవడం ముఖ్యం. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానండి”. అంటూ సూటిగా వ్యాఖ్యలు చేశారు. దీంతో సమంతని ఉద్దేశించే సిద్దార్థ ఈ వ్యాఖ్యలు చేశారని.. సామ్ పెంచిపోషించిన అభిమానులే ఆమెని ట్రోల్ చేశారనే అర్ధం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారని చర్చించుకుంటున్నారు.