ఆసక్తికరంగా ఆకట్టుకునే ….కార్తికేయ 2 చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3.25/5

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ,అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై చందు మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ…  కార్తికేయ (నిఖిల్ సిద్ధార్థ్‌) ఎంబీబీఎస్ పూర్తి చేసి స్నేహితులు ప్ర‌వీణ్, స‌త్య‌ల‌తో క‌లిసి డాక్ట‌ర్‌గా కొన‌సాగుతుంటాడు. సైన్స్‌ను న‌మ్ముతూ త‌న‌కు ఎదురైన స‌వాళ్ల‌కు స‌మాధానాల‌ను వెతుకుతూ  మంచి పేరు సంపాదిస్తాడు. కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌ల్లితో క‌లిసి మొక్కు తీర్చుకోవ‌టానికి ద్వార‌కా న‌గ‌రానికి వ‌స్తాడు కార్తికేయ‌. అక్క‌డ అత‌ని మేన‌మామ (శ్రీనివాస్ రెడ్డి) కూడా ఉంటాడు. వీరి క‌థ ఇలా సాగుతుండ‌గా.. మ‌రో వైపు గ్రీక్ దేశానికి వెళ్లిన ఆర్కియాల‌జిస్ట్ రావు అక్క‌డ కృష్ణుడు ఈ మాన‌వాళికి మంచి చేయ‌డానికి ఓ అపూర్వ‌మైన వ‌స్తువును ఎక్క‌డో దాచి ఉంచాడ‌నే విష‌యాన్ని తెలుసుకుంటాడు. అత‌న్ని డాక్ట‌ర్ శాంత‌న్ (ఆదిత్య మీన‌న్) మనుషులు వెంబడిస్తుంటారు. వారి నుంచి త‌ప్పించుకుని రావు ద్వార‌కా చేరుకుంటాడు. అత‌ను కార్తికేయ‌ను క‌లుసుకుని ఏదో చెప్ప‌టానికి ప్ర‌య‌త్నిస్తాడు. కానీ ఎవ‌రో అత‌న్ని కిడ్నాప్ చేస్తారు. రావును చంపాడ‌నే నేరం కింద ద్వార‌క పోలీసులు కార్తికేయ‌ను అరెస్ట్ చేస్తే.. ముగ్ధ (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌) అత‌న్ని కాపాడుతుంది. అయితే ఓ అభీరుడు కార్తికేయ‌ను చంపాల‌నుకుంటాడు. త‌ను స‌మ‌స్య‌కు ప‌రిష్కారం వెతికే వ్య‌క్తిగా తనను రావు ఎన్నుకున్నాడ‌ని త‌ర్వాత ముగ్ధ ద్వారా కార్తికేయ‌కు తెలుస్తుంది. అస‌లు రావు తెలుసుకున్న అపూర్వ‌మైన వ‌స్తువుకు సంబంధించిన నిజం ఏంటి? ఆ రహస్యాన్ని కార్తికేయ ఎలా ఛేదించాడు.. మాన‌వాళికి ఎదురు కాబోయే ముప్పుకి సంబంధించి శ్రీకృష్ణ ప‌ర‌మాత్ముడు ఏం చెప్పాడు.. సైంటిస్ట్ పాథ‌క్ ఎవ‌రు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమాలో  చూడాలి …

విశ్లేషణ…  దైవత్వం, శాస్త్రీయ దృక్పథం రెండు వేరు.ఈ  విరుద్ధమైన అంశాల్ని సమతూకంగా దర్శకుడు చందు మొండేటి చర్చించిన విధానం ఆకట్టుకుంటుంది. దైవం..దైవ‌త్వం.. మాన‌వాళికి మేలు చేయ‌టానికి దేవుడు ఓ ప్ర‌తినిధిని ఎన్నుకోవ‌టం వంటి దృశ్యాలతో సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. శ్రీకృష్ణుడు అవతారం చాలించాక ద్వారాకా నగరం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. దాని రహస్యం దాగి ఉన్న  ఒక గ్రంధం గ్రీస్ దేశంలోని ఒక లైబ్రరీలో ఉంటుంది. ప్రముఖ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ గుప్త దాని రహస్యం తెలుసుకొని .. ఇండియా బైలుదేరతాడు. డాక్టర్ కార్తికేయ దైవికంగా ద్వారక వెళ్ళడం. దీంతో ఎలాంటి సబంధం లేని, భగవంతుడి మీద అసలు నమ్మకమే లేని అతడు.. ఆ రహస్యాన్ని తెలుసుకోడానికి బైలు దేరడం..ఆ ప్రయత్నంలో ఎన్నో అనుభవాల్ని చవిచూడడం..ఈ క్రమం ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టిపడేస్తుంది.
దర్శకుడు చందు మొండేటి తను అనుకున్న పాయింట్ ను నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నించాడు . చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ అంతా.. కార్తికేయ.. అతడ్ని ఈ మహాకార్యానికి పురిగొలిపే  సంఘటనలతో నడిపించిన దర్శకుడు.. అనూహ్యమైన, అద్భుతమైన ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సెకండఫ్ పై  ఆసక్తిని కలగచేశాడు.  సెకండాఫ్‌లో కార్తికేయ పాత్రతో  అడుగడుగునా ఉత్కంఠను రేపుతూ సన్నివేశాలు  సాగుతాయి. విజువల్ గా సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళి.. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. మరో పక్క అబేరులు అనే శ్రీకృష్ణ భక్త బృందం తో వచ్చే సన్నివేశాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి.సెకండాఫ్ కాస్త సాగ‌దీత‌గా అనిపించ‌టం మిన‌హా సినిమా ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. క్లైమాక్స్ సీన్ సినిమాకే హైలైట్‌. ద్వారక, గ్రీస్, హిమాచల్ ప్రదేశ్ ..ఇలా దేశ విదేశీ లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ లొకేషన్లు అన్నీ సినిమాకు అందాన్ని, గ్రాండియర్ ను తీసుకొచ్చాయి.

నటీనటులు…  కార్తికేయగా నిఖిల్ నటన మరోసారి మెప్పించింది. ఎక్కడా క్యారెక్టర్ గీత దాటకుండా సెటిల్డ్ పర్మార్మెన్స్ చేశాడు నిఖిల్. ఆ పాత్రకు కావాల్సిన భావోద్వేగాలు, ఆర్థ్రత అతని అభినయంలో కనిపించాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోకి సాయం చేసే పాత్ర‌లో క‌నిపించింది. త‌న పాత్ర‌లో ఒద్దికగా ఒదిగిపోయింది. నెగటివ్ రోల్ చేసిన ఆదిత్య మీన‌న్‌.. హీరో త‌ల్లిగా చేసిన తుల‌సి, హీరో స్నేహితులు ప్ర‌వీణ్‌, స‌త్య‌, హీరో మేన‌మామ‌గా చేసిన శ్రీనివాస్ రెడ్డి ఇలా అంద‌రూ చ‌క్క‌గా వారి  పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. అనుప‌మ్ ఖేర్ కీల‌క పాత్ర‌లో కొద్దిసేపే క‌నిపించినా మంచి ఇంపాక్ట్ చూపించే రోల్‌లో ఆయ‌న మెప్పించారు. శ్రీకృష్ణుడు గొప్ప‌తనాన్ని పొగుడుతూ ఆయ‌న చెప్పిన డైలాగ్స్ ఆక‌ట్టుకుంటాయి.మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని అనుపమ్ ఖేర్ ధన్వంతరి పాత్ర ద్వారా చెప్పించాడు దర్శకుడు చందూ.

సాంకేతికం… కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ చ‌క్క‌గా ఉంది. సినిమాటోగ్రఫీ కథనం వెళ్లిన ప్రతి లొకేషన్ ను అందంగా చూపించింది. కాలభైరవ సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి– రాజేష్