కంప్లీట్‌ మిస్ ఫైర్… ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్ర సమీక్ష

సినీ వినోదం రేటింగ్ : 2/5

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్, ఆర్ టి టీం వర్క్ పతాకాలపై శరత్‌ మండవ దర్శకత్వంలో  సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధ… 1995 నేపథ్యంలో నడిచే కథ ఇది. రామారావు (రవితేజ) నీతి, నిజాయితీ కలిగిన తహశీల్దార్‌. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేసేందుకు గొప్ప మార్గమని నమ్ముతాడు. శ్రీకాకుళంలో భూములు కోల్పోయిన రైతుల పక్షాన నిలిచి వారికి సరైన పరిహారం అందేలా చూస్తాడు. అనంతరం ఆయన చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్‌కు బదిలీపై వస్తాడు. అక్కడ ఓ సందర్భంలో తన మాజీ ప్రేయసి మాలిక (రజీషా విజయన్‌) కలుసుకుంటాడు. ఆమె భర్త ఏడాదికాలంగా కనిపించకుండా పోయాడని తెలుస్తుంది. ఈ మిస్సింగ్‌ కేసును ఛేదించే బాధ్యతను తీసుకుంటాడు రామారావు. ఈ క్రమంలో మాలిక భర్తతో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో ఇరవై మంది ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదని తెలుసుకుంటాడు. ఈ మిస్సింగ్‌ కేసులను పరిశోధించే క్రమంలో రామారావుకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అంతమంది మిస్సింగ్‌ వెనక ఎర్రచందనం మాఫియా ప్రమేయం ఏమిటి? ఈ కేసును రామారావు ఎలా ఛేదించాడు?    దోషులెవరన్నది మనం సినిమాలో చూడాలి…

విశ్లేషణ…  ఎర్రచందనం మాఫియా..అందుకు సహకరించే పోలీస్‌ నెట్‌వర్క్‌ నేపథ్యంలో ఈ కథను అల్లుకున్నారు. దీనికి మర్డర్‌ మిస్టరీ ఎలిమెంట్‌ను జత చేసి ఇన్వెస్టిగేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా కథను నడిపించారు. ప్రజల పక్షాన నిలిచే ప్రభుత్వ ఉద్యోగిగా రామారావు పాత్రను పరిచయం చేసిన తీరును చూసి..ఆయన పోరాటం ఏ సామాజిక సమస్యలపైనో ఉంటుందని అనిపిస్తుంది. రామారావు మాజీ ప్రేయసి మాలిక తన భర్త మిస్సింగ్‌ గురించి చెప్పడంతో కథ మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి వరుస మిస్సింగ్‌ల వెనకున్న నెట్‌వర్క్‌ను ఛేదించానికి రామారావు చేసే ప్రయత్నాలు ఉంటాయి. అయితే ఇవేవీ  ఉత్కంఠ గా చెప్పలేకపోయారు. రవితేజ వంటి మాస్‌ హీరోతో ఓ ఇన్వెస్టిగేటివ్‌ మూవీ చేయాలనే ప్రయత్నం కొత్తగా అనిపించినప్పటికీ.. ఆయన శైలి కమర్షియల్‌ అంశాలు మిస్‌ కావడం మైనస్ అనిపిస్తుంది. అయితే ఫైట్లు మాత్రం అభిమానుల్ని ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. క్లెమాక్స్‌ కూడా ఏ మాత్రం ఉత్కంఠగా లేదు.  ఇక  ఈ సినిమాకి రెండో పార్ట్ ఉంటుందని చివర్లో చెప్పకనే చెప్పేశారు. రెండో పార్ట్ కోసమే అన్నట్టుగా రామారావు ఆన్ డ్యూటీని తెగ సాగదీసినట్టు అనిపిస్తుంది.ఇక క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది? అని థియేటర్లో కూర్చున్న జనాలు అనుకునే పరిస్థితి వస్తుంది.కథ, కథనాలు సాగతీతగా అనిపిస్తాయి.

నటీనటులు…  రామారావు పాత్రలో రవితేజ  మెప్పించేస్తాడు. ఎమోషన్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో రవితేజ తనదైన మార్క్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. అయితే సీమ యాస ప్రయత్నించి భంగపడ్డాడు. కొన్నిచోట్ల రవితేజలో వయసు వల్ల వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడి సీఐ మురళి పాత్రలో కనిపించారు. ఆయన కామెడీ టైమింగ్‌, పర్‌ఫార్మెన్స్‌ బాగున్నాయి. అయితే కథలో అంతగా ప్రాధాన్యతలేని క్యారెక్టర్‌ కావడం మైనస్‌. ఇక హీరోయిన్లిద్దరివీ అంత పెద్ద పాత్రలేమీ కాదు. ఓ సీన్, ఓ సాంగ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ రజిష, దివ్యాన్షలు కనిపించినంత సేపు తెరపై ఆకట్టుకుంటారు. నరేష్, పవిత్రలు స్క్రీన్‌పై కనిపిస్తే ఈలలు, గోలలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. వారి పాత్రలకు అంత ఇంపార్టెన్స్ లేకపోయినా.. థియేటర్లో మాత్రం ఇంపాక్ట్ చూపించారు.మిగతా పాత్రల్లో నాజర్‌, తనికెళ్ల భరణి తమదైన నటనతో మెప్పించారు. రాహుల్‌ రామకృష్ణ, అరవింద్‌కృష్ణ నెగెటివ్‌ రోల్స్‌లో కనిపించారు. సమ్మెట గాంధీ, జాన్ విజయ్ చక్కగా నటించేశారు.

సాంకేతికం…  సామ్‌ సీఎస్‌ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. సిధ్‌శ్రీరామ్‌ ఆలపించిన ఓ పాట, స్పెయిన్‌ నేపథ్యంతో తెరకెక్కించిన ఓ పాట మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటాయి. కథలోని ఎమోషన్స్‌ను ఎలివేట్‌ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగా కుదిరింది. సత్యన్‌ సూర్యన్‌ కెమెరా పనితనం మెప్పిస్తుంది. ముఖ్యంగా పాటల్లో విజువల్స్‌ను బాగా చూపించారు. ఎడిటింగ్ లో ఎన్నో సీన్లకు కత్తెర వేయాల్సింది. మాటలు అక్కడక్కడా పేలినట్టు అనిపిస్తాయి  – రాజేష్