ఇవాళ ఊరంతా నాకోసం తరలి వస్తోంది !

స్టార్‌ ఇమేజ్‌ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. దేన్నైనా ఎక్కువ పట్టించుకుంటేనే తిప్పలు. స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందనే విషయం మాత్రం అర్థమవుతోంది. కొన్నిసార్లు, కొన్నిచోట్లకు చాలా జనం వస్తుంటారు. వాళ్లను చూడగానే ‘వామ్మో.. వీళ్లందరూ మనకోసం వచ్చారా’ అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆ ఫీలింగ్ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం… అని అంటోంది అందాల నటి కీర్తి సురేష్.  నా కోసం ఇంత జనం వస్తారని ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆశపడ్డ మాట వాస్తవం. చిన్నప్పటి నుంచే ‘ఎవరైనా సరే… వెనక్కి తిరిగి నా వైపు చూడాలి’ అని అనుకునేదాన్ని. కేరళకు అమ్మతో వెళ్లినప్పుడు చాలా మంది మమ్మల్ని ఆపి అమ్మ (నటి మేనక) ఆటోగ్రాఫ్‌ తీసుకునేవారు. ‘ఎవరైనా నన్ను కూడా అడగొచ్చు’ కదా అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడందరూ సెల్ఫీలు అడుగుతున్నారు.
 
నా చిన్నతనంలో మా నాన్న (మలయాళ నిర్మాత సురేశ్‌) ప్రొడ్యూస్‌ చేసిన చాలా సినిమాల్లో నేను చిన్న చిన్న రోల్స్‌ చేశాను. ఒకసారి నేను ఒకటో తరగతి చదివేటప్పుడు మా నాన్న నిర్మించిన ఓ సినిమాలో ఓ పాటలో అలా వచ్చిపోయే షాట్‌చేశా.ఇవాళ ఆ పాటను నేను చూసినా.. నన్ను నేను కూడా పట్టించుకోను. గుర్తు కూడా పట్టలేను. కానీ ఆ రోజు నా మానసిక పరిస్థితి వేరు. కుక్కపిల్ల కారులో నుంచి బయటికి చూస్తుంది కదా… అలాంటి అనుభవం అన్నమాట. ఆ రోజు నేను థియేటర్లో కూర్చుని ఇంటర్వెల్‌లో నన్నెవరైనా గుర్తుపడుతున్నారా? వచ్చి పలకరిస్తారా? ‘తెరమీద ఉన్న అమ్మాయి.. అదుగో అక్కడ కూర్చుని ఉంది అని చెప్పుకొంటారా..’ అని ఆశగా ఎదురుచూశా. ఆ క్షణాలను మర్చిపోలేను. ఎందుకో అప్పటి నుంచే ఎవరైనా నా వైపు తలతిప్పి చూస్తే ఓ హ్యాపీ ఫీలింగ్‌. ఆ ఆశ ఇప్పటికీ నా మనసులో అలా ఉండిపోయింది. ఇవాళ ఊరంతా నాకోసం తరలి వస్తోంది. వాళ్లని చూడగానే ఏదో ఆత్మసంతృప్తి కలుగుతుంటుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. అదంతా దేవుడి దయ. నటిగా నేను ఏ ఆఫీసుల చుట్టూ తిరగలేదు. ‘నాకు ఇలాంటి పాత్ర ఇవ్వండి’ అని ఎవరినీ అవకాశం అడగలేదు. అదంతా భగవత్‌కృప వల్లే జరుగుతోంది.
నెలన్నరగా బ్రేక్‌ తీసుకున్నా !
ఆ మాట నిజమే. నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇటీవల వరకు నేను పెద్దగా బ్రేక్‌ తీసుకోలేదు. ఇప్పుడే… ఈ మధ్యనే నెలన్నరగా బ్రేక్‌ తీసుకున్నా. ఇంకో నెల రోజులు ఈ గ్యాప్‌ను కంటిన్యూ చేస్తా. ఆ తర్వాత ఓ మలయాళం సినిమా సైన్‌ చేశా. ‘కున్యాలి మరక్కా’ అని పేరు పెట్టారు. ప్రియదర్శన్‌గారు, మోహన్‌లాల్‌గారితో చేస్తున్నా.
ఇప్పుడు దొరికిన గ్యాప్‌లో స్క్రిప్ట్‌లు వింటున్నా. తెలుగు నుంచి ఓ వైపు విమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు వస్తున్నాయి. మరోవైపు కమర్షియల్‌ చిత్రాలు కూడా వస్తున్నాయి. ఏవి ఎంపిక చేసుకోవాలి… వాటి రెండింటికీ మధ్య ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలి.. అని ఆలోచిస్తున్నా. జనవరి తర్వాత ఇంత ఫ్రీగా కూర్చుని ఆలోచించుకునే తీరిక ఉండదు.