`సంతోషం` సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డుల వేడుక !

`సంతోషం` 15వ వార్షికోత్స‌వాలు…సంతోషం సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ అవార్డుల ప్ర‌దానోత్స‌వం శనివారం సాయంత్రం హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అంగ‌రంగ వైభ‌వంగా ఆట‌, పాట‌ల న‌డుమ  సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. ఉత్త‌మ న‌టుడిగా నాగ చైత‌న్య (ప్రేమ‌మ్) కు గా ఎంపిక‌య్యారు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా `స‌రైనోడు` చిత్రానికి గాను బోయ‌పాటి శ్రీను, స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ చేతుల మీదుగా అవార్డు అంద‌కున్నారు. ఉత్త‌మ న‌టిగా స‌మంత క‌థానాయిక‌గా న‌టించిన `అ..ఆ` చిత్రానికి ద‌క్కింది. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా స‌రైనోడు చిత్రానికి బోయ‌పాటి శ్రీను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌పీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఇక ఉత్త‌మ చిత్రం అవార్డును జాతీయ అవార్డుతో సంచ‌ల‌నం సృష్టించిన `పెళ్ళిచూపులు` చిత్రం కైవసం చేసుకుంది. ఆ చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి బోయ‌పాటి శ్రీను చేతుల మీదుగా సంతోషం అవార్డు అందుకున్నారు.  దాస‌రి నారాయ‌ణ‌రావు స్మార‌క అవార్డు..అల్లు రామ‌లింగ‌య్య స్మార‌క అవార్డుల‌తో పాటు ఇత‌ర భాష‌ల‌కు చెందిన న‌టీన‌టుల‌ను సంతోషం అవార్డుల‌తో ఘ‌నంగా స‌త్క‌రించారు. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్స్ మ‌న్నారా చోప్రా, రిచా ప‌న‌య్ , అన‌సూయ స్పెష‌ల్ పెర్పామెన్స్ తో వేడుక‌కు మ‌రింత శోభ తీసుకొచ్చారు.
అవార్డుల ప్ర‌దానోత్స‌వం అనంత‌రం హీరో నాగ‌చైత‌న్య మాట్లాడుతూ, ` 15 ఏళ్ల‌గా సంతోషం వార్షికోత్స‌వాల‌ను క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ప్ర‌తీ ఏడాది సంతోషం వార్షికోత్స‌వాలు ఎక్క‌డా త‌గ్గ‌కుండా సురేష్ గారు ఎంతో గొప్ప‌గా చేస్తున్నారు.  అందుకు చాలా సంతోషంగా ఉంది. నాకీ అవార్డు ద‌క్కిందంటే కార‌ణం నేను కాదు.. ‘ప్రేమ‌మ్’ సినిమానే. మ‌ల‌యాళం వెర్ష‌న్ న‌న్ను…సినిమా చూసిన ఆడియ‌న్స్ ను ఎంతో ఇన‌స్పైర్ చేసింది. క్రిటిక్స్ కూడా ఎంతో ఎంక‌రేజ్ చేశారు.  అందుకే ఈ అవార్డు వ‌చ్చింది. అలాగే స‌మంత ఇంటినిండా అవార్డులే ఉంటాయి. ఆ ఖాతాలో  ఇప్పుడు సంతోషం అవార్డు కూడా చేరింది. ఈ వార్డుల‌తో స‌త్క‌రించిన సంతోషం సురేష్ గారికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.
ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ..` `సంతోషం`15 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకుని 16వ ఏడాదిలోకి అడుగు పెట్ట‌డం చాలా సంతోషం గా ఉంది. ఇలాగే సురేష్ గారు మ‌రిన్ని వార్షికోత్స‌వాలు జ‌ర‌పాలి. ‘స‌రైనోడు’ చిత్రానికి ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా నాకు అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది. అదీ శుక్ర‌వారం విడుద‌లైన నా ‘జ‌య జాన‌కి నాయ‌క’ స‌క్సెస్ టైమ్ లో ‘సంతోషం’ తో స‌త్క‌రించ‌డం మ‌రింత సంతోషాన్నిస్తుంది. అందుకు సురేష్ గారికి మ‌నస్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా. ఎల్ల‌కాలం సంతోషం చ‌ల్ల‌గా ఉండాలి` అని అన్నారు.
తెలంగాణరాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ మాట్లాడుతూ, ` పెద్ద‌లు రామానాయుడు,కృష్ణ‌, ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి దిగ్గ‌జాల కృషి వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ చెన్నై నుంచి హైద‌రాబాద్ కు త‌ర‌లి రావ‌డం జ‌రిగింది. వాళ్ల కృషి ఎన్న‌టికీ మ‌రువ‌లేనిది. ఇక తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ రోజురోజుకి అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంది.  ఈరోజు తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ అంటే ప్ర‌పంచం మొత్తం తెలిసింది. దానికి కార‌ణం ‘బాహుబ‌లి’ సినిమా. ఇలాంటి సినిమాలు మ‌రిన్ని రావాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. కొత్త సినిమాలు..కొత్త వాళ్లు స‌క్సెస్ అవుతున్నారు. అందువ‌ల్ల ఉపాధి కూడా పెరుగుతుంది. ఇది ఇండ‌స్ట్రీకి శుభ సూచికం. తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం నుంచి సినిమా ఇండ‌స్ట్రీకి ఎప్ప‌టికీ స‌హకారం ఉంటుంది. ప‌రిశ్ర‌మ‌ని  మ‌రింత అభివృద్ధి చేయాల‌ని ప్ర‌భుత్వం ఆలోచ‌న‌లు చేస్తుంది. అప్పుడ‌ప్పుడు సినిమా ఇండ‌స్ట్రీలో స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. వాటిని సినిమా పెద్ద‌ల‌తో కూర్చుని స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి  మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటాం. ఇక అవార్డుల విష‌యానికి వ‌స్తే సురేష్ కొండేటి చిన్న‌వాడైనా పెద్ద సాహ‌సాలు చేస్తుంటాడు. జ‌ర్న‌లిస్ట్ స్థాయి నుంచి ఈ రేంజ్ కు వ‌చ్చాడంటే అత‌ను ఏ స్థాయిలో క‌ష్ట‌ప‌డ్డాడో అర్ధ‌మ‌వుతుంది. 15 ఏళ్ల‌గా సంతోషం అవార్డుల ప్ర‌దానోత్స‌వం చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. దానికి ఎంతో స‌పోర్ట్ ఉండాలి. కానీ అన్నీ తానే అయి చేసుకోవ‌డం మ‌రో గొప్ప విష‌యం. ఇలాంటి అవార్డు ఫంక్ష‌న్ల‌కు అవార్డులు తీసుకునే హీరోలే కాకుండా మిగ‌తా వారు కూడా త‌ప్ప‌కుండా హ‌జ‌ర‌వ్వాలి. ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్న‌ప్పుడు ఇండ‌స్ట్రీ అంతా త‌ర‌లి రావాలి.  భ‌విష్య‌త్తులో ప్ర‌భుత్వం నుంచి అన్ని విధాలుగా స‌హ‌కారం అందే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటాం` అని అన్నారు.
ఏపీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు మాట్లాడుతూ, ` 15 ఏళ్ల పాటు ప‌త్రిక‌ను న‌డ‌ప‌డ‌మే క‌ష్టం. కానీ ఇన్నేళ్ల‌గా  అవార్డుల‌ను ఇంత గ్రాండ్ నిర్వ‌హించ‌డం ఒక్క సురేష్ కే చెల్లింది. ఇలాంటి వేడుల‌కు అవార్డుల తీసుకునే వాళ్లే కాకుండా మిగ‌తా వారుకూడా రావాలి. అలాగే  వైజాగ్ లో కూడా ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అభివృద్ది ప‌రిచే దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తున్నాం. అక్క‌డ అంద‌మైన లోకేష‌న్స్ ఉన్నాయి. 20 శాతం సినిమా షూటింగ్ లు అక్క‌డ కూడా చేయ‌లని ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌ను కోరుతున్నా. సింగిల్ విండో లో అనుమ‌తులు ఇస్తాం` అని అన్నారు.
ఎంపీ ముర‌ళీ మోహ‌న్ మాట్లాడుతూ, ` ఒక సినిమా ప‌త్రిక 15 ఏళ్ల పాటు న‌టీనటుల‌ను గౌర‌విస్తూ అవార్డుల‌ను అందించ‌డం ఎంతో గొప్ప విష‌యం. దేశంలో ఫిలిం ఫేర్ త‌ర్వాత సౌత్ లో ఇంత గ్రాండ్ గా అవార్డులందించేది ఒక్క సంతోషం మాత్ర‌మే. దాస‌రి గారి పేరిట అవార్డులు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తొలి ఏడాదే దాస‌రి స్మార‌క న‌టుడు అవార్డు నాకు రావ‌డం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
 ర‌చ‌యిత  ప‌రుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ,` కె.వి రెడ్డిగారి అవార్డు ఎంత పాపులర్ అయిందో సురేష్ అందించే దాసరి స్మార‌క అవార్డు అంత పాపుల‌ర్ అవ్వాలి. దాస‌రి పేరిట సురేష్ ఈ ఏడాది మాకు అందించ‌డం చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు.
నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ, ` సురేష్ వ‌న్ మేన్ ఆర్మీ. అత‌నొక్క‌డే అన్ని ప‌నులు చేసుకుంటాడు. అదే అత‌నిలో గొప్ప‌త‌నం. క‌సి, ప‌ట్టుద‌ల‌, దీక్ష  ఉన్న మా పాల‌కొల్లు కుర్రాడే సురేష్. ఇలాగే మ‌రిన్ని అవార్డు ఫంక్ష‌న్ల‌ను గ్రాండ్ గా చేయాల‌ని కోరుకుంటున్నా. దాస‌రి గారు గ‌త ఏడాది ఇదే వేదిక‌పై మ‌న‌తో పాటు ఉన్నారు. కానీ ఈరోజు మ‌న మ‌ధ్య‌న లేరు. ఆయ‌న పేరిటి సురేష్ దాస‌రి స్మార‌క అవార్డును నెల‌కొల్ప‌డం సంతోషంగా ఉంది. దాసరి పేరిట ఏర్పాటు చేసిన మొద‌టి అవార్డు ఇదే.  దాసరి గారి ద‌ర్శ‌క‌త్వంలో మా గీతా ఆర్స్ట్ బ్యాన‌ర్ తొలుత సినిమాలు చేసింది. ఆయ‌న మాకు మంచి విజ‌యాల‌ను అందించారు. తొలి ఏడాదే దాస‌రి స్మార‌క నిర్మాత అవార్డు నేను అందుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్ర‌తి ఏడాది సురేష్ నాన్న‌గారి పేరిటి స్థాపించిన అల్లు రామ‌లింగ‌య్య అవార్డును కూడా అంద‌జేస్తున్నారు. ఈ ఏడాది ఉత్త‌మ క‌మెడీయన్ గా స‌ప్త‌గిరిని ఎంపిక చేసి నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వ‌డం చాలా సంతోషాన్నిస్తుంది` అని అన్నారు.
అల‌నాటి న‌టి రోజా ర‌మ‌ణి మాట్లాడుతూ, ` సురేష్ 15 ఏళ్ల‌గా అలుపెర‌గ‌కుండా ఈ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. నేటి త‌రంతో పాటు నాటి త‌రం న‌టీన‌టుల‌ను కూడా గుర్తుంచుకుని అవార్డుల‌ను అంద‌జేస్తున్నందుకు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు. నటిగా నా కెరీర్ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సంతోషం ‘లైఫ్ టైమ్ అచీమెంట్  అవార్డు’తో స‌త్క‌రించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా 50 ఏళ్ల సినిమా జ‌ర్నీ చాలా సంతోషంగా సాగిపోయింది. ఇటీవ‌లే నా భ‌ర్త చ‌క్ర‌పాణికి ఒరిస్సా గ‌వ‌ర్న‌మెంట్ అవార్డు అందించింది. అది గ‌డిచి మూడు నెల‌లు కూడా కాక‌ముందే నాకు సంతోషం అవార్డు వ‌చ్చింది. నాతో పాటు నా కుమారుడు త‌రుణ్ ని కూడా తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రిస్తున్నందుకు  నా కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.
న‌టుడు స‌ప్త‌గిరి మాట్లాడుతూ, ` “సామర్ధ్యం ఉన్న‌వాడు..త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోవ‌డ‌మే.. కష్టం ఏరోజు వృద్ధా కాదు..ఏదో ఒక్క రోజు దానికి తగ్గ ఫ‌లితం క‌చ్చితంగా వస్తుంది..నీకు ద‌క్కాల్సిన‌వ‌న్నీ ద‌క్కుతాయ‌”ని పెద్దాయ‌న మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్లే నాకు జ‌రుగుతుంది. ఈరోజు అల్లు రామ‌లింగ‌య్య గారి అవార్డు అందుకోవ‌డం జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఈ అవార్డు కోసం 400 కిలో మీట‌ర్లు జ‌ర్నీ చేసి వ‌చ్చాను. ప్ర‌స్తుతం  `స‌ప్త‌గిరి ఎల్ ఎల్ బి` షూటింగ్ మ‌హరాస్ట్రలో జ‌రుగుతుంది. ఈ అవార్డు కోస‌మే షూటింగ్ ను నిలిపేసి మా చిత్ర నిర్మాత ర‌వి కిర‌ణ్ గారు, నేను క‌లిసి వ‌చ్చాం ` అని అన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ` 15 ఏళ్ల పాటు సంతోషం వార్షికోత్స‌వాలు చేయ‌డం  చాలా గొప్ప విష‌యం. ప్ర‌తీ ఏడాది సంతోషం స్కేల్ పెరుగుతుందే గానీ.. త‌గ్గ‌లేదు. పెళ్ళి చూపులుకు సంతోషం అవార్డు అందించిన సురేష్ గారికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.
నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ, `సురేష్ కొండేటి ఓపిక‌ను మెచ్చుకోవాలి. ఒక‌టి రెండు మామూలు ఫంక్ష‌న్లు చేయ‌డానికి చాలా ఇబ్బందులు ప‌డ‌తాం. కానీ సురేష్ 15 ఏళ్ల నుంచి వార్షికోత్స‌వాల‌ను.. అవార్డుల‌ను ఇంత గ్రాండ్ గా చేయ‌డం చాలా గొప్ప విష‌యం. అందుకు ఆయ‌న్ను మెచ్చుకోవాలి. సంతోషం మ‌రింత ముందుకు వెళ్లాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని అన్నారు.
మా అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ, ` సురేష్ ప్ర‌తీ ఏడాది ఎంతో గొప్ప‌గా అవార్డుల‌ను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే `మా` కుటుంబ స‌భ్యుల‌ను కూడా ఆర్ధికంగా ఆదుకున్నారు. ఈరోజు కొంత మంది `మా` బాధిత కుటుంబాల‌కు చెక్ ల‌ను అందించ‌డం జ‌రిగింది అని అన్నారు.
మా జన‌ర‌ల్  సెక్ర‌ట‌రీ న‌రేష్ మాట్లాడుతూ, ` సంతోషం అవార్డులు టాలీవుడ్ కి, సౌత్ ఇండియాకి ఎంతో గ‌ర్వ‌కార‌ణం. సురేష్ జ‌ర్న‌లిస్ట్ గా ప్రారంభ‌మై అహ‌ర్నిశలు శ్ర‌మించి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయ‌నొక ఆజాత శ‌త్రువు. సంతోషం 15 ఏళ్లు పూర్తిచేసుకుంది.  25 ఏళ్ల‌తో గోల్డెన్ జూబ్లీ పూర్తిచేయాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
ఈ  వేడుక‌ల్లో  హీరోలు విజ‌య్ ఆంటోనీ, ఆది పినిశెట్టి, శిరీష్‌, ఆనంద్ కృష్ణ‌న్, స‌న్య‌క్త్  హెగ్దే, భార‌తీ విష్ణు వ‌ర్ద‌న్, చ‌క్ర‌పాణి, రోష‌న్, ఆర్మాన్ మాలిక్, ర‌మేష్ ప్ర‌సాద్, విద్య‌ల్లేఖ రామ‌న్, మ‌ల్కాపురం శివ‌కుమార్, మ‌న్నారా చోప్రా, అన‌సూయ‌, ‘వీడెవ‌డు’ సినిమాటీమ్ తాతినేని సత్య‌, శివ, ర‌వి కిర‌ణ్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.
`సంతోషం` 15 వ వార్షికోత్స‌వం… సంతోషం అవార్డుల‌ పూర్తి వివ‌రాలు:
ఉత్త‌మ న‌టుడు :  నాగ‌చైత‌న్య ( ప్రేమ‌మ్)
ఉత్త‌మ న‌టి: స‌మంత ( అ..ఆ)
స్పెష‌ల్ జ్యూరీ అవార్డు: మ‌న్నారా చోప్రా
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు :  బోయ‌పాటి శ్రీను ( స‌రైనోడు)
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు (డెబ్యూ) : త‌రుణ్ భాస్క‌ర్ ( పెళ్ళి చూపులు)
ఉత్త‌మ మూవీ:  పెళ్ళి చూపులు
ఉత్త‌మ నిర్మాత :  రాజ్ కందుకూరి
ఉత్త‌మ క‌మెడీయన్ ( ఫీమేల్) :  విద్యుల్లేక రామ‌న్ (స‌రైనోడు)
క్రిటిక్స్ ఉత్త‌మ డెబ్యూ డైరెక్టర్ :  బెల్లం రామ‌కృష్ణారెడ్డి ( దృశ్య‌కావ్యం)
ఉత్త‌మ జ‌ర్న‌లిస్ట్ :  భాగ్య‌ల‌క్ష్మి ( ఆంధ్ర‌జ్యోతి)
ఉత్త‌మ వీడియో జ‌ర్న‌లిస్ట్ : క‌రుణాక‌ర్  ( జెమినీ టీవీ)
ఉత్త‌మ హీరో (డ‌బ్యూ) :  రోష‌న్ ( నిర్మాలా కాన్వెంట్)
ఉత్త‌మ విల‌న్ : ఆది పినిశెట్టి ( స‌రైనోడు)
ఉత్త‌మ స‌హాయ న‌టుడు : శ‌్రీకాంత్ ( స‌రైనోడు)
ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడు : ఆర్మాన్ మాలిక్
ఉత్త‌మ న‌టుడు ( తమిళ్) :  శిరీష్ ( మెట్రో)
ఉత్త‌మ డైరెక్ట‌ర్ ( త‌మిళ్ ) : ఆనంద్ కృష్ణ‌న్
ఉత్త‌మ న‌టి (క‌న్న‌డం) : స‌న్య‌క్త్ హెగ్దే
`సంతోషం` లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుల వివ‌రాలు:
భారతీ విష్ణు వ‌ర్ద‌న్, 50 ఏళ్ల సినీ కెరీర్ పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా రోజా ర‌మ‌ణి ఎంపిక‌య్యారు
అలాగే దివంగ‌త దాస‌రి నారాయ‌ణ‌రావు పేరు మీదుగా ఈ ఏడాది నుంచే దాస‌రి స్మారక అవార్డుల‌ను కూడా సంతోషం అధినేత సురేష్  అందిస్తున్నారు. దీనిలో భాగంగా మొత్తం నాలుగు  విభాగాల్లో దాస‌రి స్మారక అవార్డుల‌ను అందించారు. వాటి వివ‌రాలు..
దాస‌రి స్మార‌క నిర్మాత : అల్లు అర‌వింద్
దాస‌రి స్మార‌క న‌టుడు:  ముర‌ళీ మోహ‌న్
దాస‌రి స్మార‌క ర‌చ‌యిత‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ( వెంక‌టేశ్వ‌ర‌రావు, గోపాల‌కృష్ణ‌)
దాస‌రి స్మార‌క జ‌ర్న‌లిస్ట్ : ప‌సుపులేటి రామారావు
ప్ర‌తీ ఏడాది అందించే  అల్లు రామ‌లింగ‌య్య స్మార‌క అవార్డును ఈ ఏడాది  క‌మెడీయ‌న్ స‌ప్త‌గిరి అందుకున్నారు. అలాగే ఉత్త‌మ అనువాద  చిత్ర క‌థానాయ‌కుడిగా విజ‌య్ ఆంటోని `చిచ్చ‌గాడు `  చిత్రానికి గాను సంతోషం అవార్డును అందుకున్నారు.

అలాగే ఇదే వేదిక‌పై `మా` టీమ్ లోని బాధిత కుటుంబ‌ సభ్యులు అల్ల‌రి సుభాషిణి, శోభ‌ల‌కు నగ‌దును అందించారు. చిరంజీవి అనే ఆర్టిస్ట్  కుటుంబానికి 40,000 వేల రూపాయ‌లను అందించ‌డం జ‌రిగింది.