నిజాయితీతో పని చేస్తున్నానా? లేదా? అన్నది ముఖ్యం !

ఆస్కార్‌ విజేత, మ్యూజిక్‌ మాస్ట్రో ఏఆర్‌ రెహమాన్‌… “సుదీర్ఘ కాలం పాటు తాను సినిమా ఇండ్రస్టీలో మ్యూజిక్‌ రంగంలో విజయం సాధించడానికి, నిలదొక్కుకోవడానికి కారణం విమర్శేనని, అదే తాను వెళుతున్న మార్గంలో తప్పొప్పులను సరిచూసుకునేలా చేసిందని ఆస్కార్‌ విజేత, మ్యూజిక్‌ మాస్ట్రో ఏఆర్‌ రెహమాన్‌ అన్నారు. సమీక్షలు తనపై సానుకూల ప్రభావం చూపుతాయే కానీ వ్యతిరేకత భావం ఉండదని పేర్కొన్నారు.
”కొన్నిసార్లు విమర్శలను మంచిగా తీసుకోవచ్చు. అందులో కొన్ని విషపూరితమైనవి, కొన్ని అందమైనవి ఉంటాయి. అవి విమర్శించే వారి కోణాన్ని బట్టి ఉంటుంది. ఆ విమర్శలే నేను ఈ రోజు వరకూ బతికి ఉండడానికి కారణం. అవి లేకపోతే నేను ఉండకపోదును. విమర్శలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి” అని తెలిపారు.
”కొన్ని సార్లు విమర్శకులే మీకు ఉపాధ్యాయులవుతారు. కానీ ఆ విమర్శలో కొంత అయితే బాగోదు. ట్విట్టర్‌ వంటివి ప్రతిదీ ఈ రోజు మనముందే ఉంచుతున్నాయి. కొన్ని సార్లు ట్విట్టర్‌లో వచ్చే కామెంట్స్‌ చూడను. మనకి మనం ఏదో గొప్పగా క్రియేట్‌ చేసేయక్కర్లేదు. నీ జోన్‌లో నువ్వు ఉండాలి. నీ పనిని ఉత్తమంగా చేయాలి” అని అన్నారు రెహమాన్‌.నిజాయితీ గల పనికే ప్రాధాన్యమివ్వాలన్నారు.
” నిజాయితీయే నన్ను ఈ సుదీర్ఘ కాలం పనిచేసేలా చేసింది.  నేను పనిలో నిజాయితీగా ఉన్నట్టు అయితేనే సరిగా చేసినట్టు. అలా కాకుండా నేను ఏం చేసినా అది సరైంది కాదు. నిజాయితీగా చేసినా వైఫల్యం చెందిందనుకోండి ..దాన్ని స్పోర్టీవ్‌గా తీసుకుంటా. నిజాయితీతో చేస్తున్నానా? లేదా? నా నిజాయితీ అన్నది ముఖ్యం” అని తెలిపారు. ప్రేక్షకులకు ఏం కావాలో? ఏం కోరుకుంటున్నారో అది అందించడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు రెహమాన్‌. సంగీతం ట్రెండింగ్‌కి బంధీ కాకూడదని సూచించారు. ట్రెండ్స్‌ అనేవి వస్తుంటాయి.. పోతుంటాయన్నారు.