‘వందేమాతరం’లానే ఈ సినిమాకూ స్పందన వస్తుంది!

సాయికిరణ్ అడివి దర్శకత్వంలో ఆది సాయికుమార్ కథానాయకుడిగా… ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా చేసిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్,టెక్నీషియన్స్ నిర్మాత‌లు. ‘ఎయిర్ టెల్’ మోడ‌ల్ శ‌షా చెట్రి, కార్తీక్ రాజు, పార్వ‌తీశం, నిత్యా న‌రేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు ర‌మేశ్‌  ప్రధాన తారాగణం. 18న సినిమా విడుదల కానున్న సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ..డా.రాజశేఖర్, జీవిత , దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత రాజ్ కందుకూరి, అడివి శేష్ అతిథులుగా హాజరయ్యారు.
 
డా. రాజశేఖర్ మాట్లాడుతూ… “సాయి కుమార్ గారు మైసూర్ లో ఉండడం వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన తరఫున నేను వచ్చాను. ఆది వండర్ ఫుల్ ఆర్టిస్ట్. చాలా కష్టపడతాడు. ‌ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు. యంగ్ హీరోలందరూ కలిసి డబ్బులు పెట్టి ఈ సినిమా చేశారు. ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది” అన్నారు. ‌
 
అడివి శేష్ మాట్లాడుతూ… “అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమాకు పని చేసిన వాళ్ళు అందరూ నాకు ఫ్యామిలీతో సమానం. ఈ సినిమాకు ఒక క్రెడిబిలిటీ, రెస్పెక్ట్ వచ్చాయి ” అన్నారు.
 
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… ” సైనికుల పోరాటాలు, మరణాల గురించి పేపర్లలో చదివి ఊరుకోవడం కాదు అంతకు మించి ఆలోచించాలని ఇందులోని దేశభక్తి గీతం కలిగించింది‌. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది గెటప్ చాలా బాగుంది. ఇప్పటివరకు అతడిని లవర్ బాయ్ గా, యాక్షన్ హీరోగా చూ‌‌శాం. కానీ, ఆర్మీ అధికారిగా చాలా బాగా చేశాడు” అన్నారు. ‌
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ… “ఈ ఫంక్షన్ కి నేను అతిథిగా కాదు, అది కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఆది చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో అతడికి మంచి హిట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రైటర్ గా అబ్బూరి రవి గారు తెలుసు. యాక్టర్ గా ఆయనేంటో ఈ సినిమాలో చూస్తాం. సాయి కిరణ్ గారి సినిమాలు అన్నీ బాగుంటాయి” అన్నారు.
 
దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ… “కశ్మీర్ లో 1990లలో కశ్మీర్ పండిట్లకు ఏం జరిగిందో చాలామందికి తెలియదు.రచయిత అబ్బూరి రవి గారు చాలా పరిశోధన చేశారు. నేను, ఆయన కశ్మీర్ పండిట్లను కలిసి… ఏం జరిగింది? అని పరిశోధన చేశాం. ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్ కి రావడానికి కారణం అబ్బూరి రవి గారు. ఘాజీ బాబా పాత్రలో నటించమని ఆయన్ని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది.నా జేబులో 3500 రూపాయలు ఉన్నప్పుడు, ఆరు కోట్ల సినిమా తీయాలని అనుకున్నప్పుడు… అబ్బూరి రవి గారు ఇచ్చిన ధైర్యం మరువలేనిది. ఆది నటిస్తాడో? లేదో? అనుకున్నాను. తను సినిమా చేయడానికిి ముఖ్య కారణం సాయి కుమార్ గారు. ఆయనకూ థాంక్స్. ‘వందేమాతరం’ అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో… ఈ సినిమాకు థియేటర్లలో రియాక్షన్ అలా ఉంటుంది” అన్నారు. ‌
 
అబ్బూరి రవి గారు మాట్లాడుతూ… “కశ్మీర్ అనగానే పాకిస్తాన్, ఎల్ ఓ సి, తీవ్రవాదుల రావడం, గొడవల గురించి తెలుస్తాయి. కానీ కాశ్మీర్ పండిట్లను కలిసినప్పుడు ..కన్నీళ్లు ఆపుకోవడం కష్టమయ్యే అంత కష్టాలు వాళ్ళకి ఉన్నాయని తెలిసింది. ఈ కథలో విలన్ ఘాజీ బాబా ఎలా ఉండాలంటే… ‘కళ్ళ ముందు చావు ఉన్న కళ్ళల్లో భయం ఉండకూడదు’ అని అనుకున్నాం‌. ఆ పాత్రలో నటించా‌. రైటర్ ని… ఎలా చేశానో దర్శకుడు సాయి కిరణ్ అడివి, ప్రేక్షకులే చెప్పాలి. నటుడిగా వేదికపై నిలబడడం కొత్తగా ఉంది. ఆర్టిస్ట్ కావడం అనేది చాలా కష్టమైన విషయం ” అన్నారు.
 
ఆది సాయికుమార్ మాట్లాడుతూ… “కశ్మీర్ ప్రతికూల పరిస్థితులు, వాతావరణం మధ్యలో కథలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. నిజంగా… కశ్మీర్ కి వెళ్లి, ఎన్.ఎస్.జి కమాండో డ్రెస్ వేసుకుని షూటింగ్ చేయడం చాలా గర్వంగా అనిపించింది. అక్కడ కొంత మంది ఆర్మీ అధికారులను కలిశాను. వాళ్లు చేస్తున్న త్యాగాలను కళ్లారా చూశాను.సాయి కిరణ్ గారు కథ చెప్పి… ‘ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ పాత్రకు నిన్ను అనుకుంటున్నాన’ని చెప్తే నమ్మలేదు.కానీ సాయికిరణ్ నన్ను నమ్మారు. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. 18న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఎవరి కోసమో కాదు… సాయికిరణ్ అడివి కోసం. ఈమధ్య నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. నాకు ఈ సక్సెస్ ఇంపార్టెంట్‌. ” అన్నారు.