జులై 14న ‘శమంతకమణి’

భవ్య క్రియేషన్స్ పతా కంపై రూపొందుతున్న చిత్రం ‘శమం తకమణి’. నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆది సాయికుమార్, డా.రాజేంద్రప్రసాద్, ఇంద్రజ, చాందిని చౌదరి, సుమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

నారా రోహిత్ మాట్లాడుతూ- “డిఫరెంట్ మూవీ ఇది. నా క్యారెక్టర్‌ను చాలా బాగా డిజైన్ చేశారు. తక్కువ రోజుల్లోనే తెరకెక్కించారు. బాణం, సోలో చిత్రాల తర్వాత మణిశర్మ సంగీతంలో ఈ సినిమా చేస్తున్నా. తప్పకుండా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది”అని అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ- “ఇందులో ప్రతి పాత్ర బావుంటుంది. అందుకే నాకు ఏ పాత్ర సరిపోతుందో దాన్నే ఇవ్వమని దర్శకుడికి చెప్పాను. ఇది రెగ్యులర్ ఫార్ములాలో ఉండదు. చాలా కొత్తగా ఉండే స్క్రిప్ట్ ఇది. నేను ఇందులో తల్లిని కోల్పోయిన వ్యక్తిగా నటిస్తున్నాను. నలుగురు హీరోలతో సినిమా చేయడమంటే ఇబ్బందే అని అనుకుంటున్న తరుణంలో దాని సుసాధ్యం చేసిన ఘనత ఈ టీమ్‌ది”అని చెప్పారు.

ఆది మాట్లాడుతూ- “ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు, కెమెరామన్ అందరూ చక్కగా కుదరడంతో చాలా త్వరగా సినిమా పూర్తయింది. మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. మణిశర్మ సంగీతంలో నేను నటిస్తున్న రెండో చిత్రమిది. కార్తిక్ అనే పాత్రలో నటిస్తున్నాను”అని అన్నారు.

ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ- “దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చక్కని కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. నటీనటులందరూ చక్కగా నటించారు. జూలై 14న చిత్రాన్ని విడుదల చేస్తాం”అని చెప్పారు.

దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ “నేను రాసుకున్న మొదటి కథ ఇది. నలుగురు హీరోలు నాకు చాలా సహకరించారు. షూటింగ్ వేగంగా పూర్తవడానికి సమీర్‌రెడ్డి కెమెరాపనితనం కూడా తోడైంది. ఆనందప్రసాద్ చాలా పాజిటివ్‌గా ఉండే నిర్మాత”అని అన్నారు.