ఆస్కార్‌ ‘ఫారెస్ట్‌ గంప్‌’ రీమేక్‌ లో అమిర్‌ ఖాన్‌

ఆరు విభాగాల్లో ఆస్కార్‌ పురస్కారాలను సాధించిన పెట్టిన అమెరికన్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’. 1994లో ఆస్కార్లలో సగం ఈ చిత్రానివే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్‌ హీరో అమిర్‌ ఖాన్‌ తెలిపారు. ఆయన హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. ‘లాల్‌ సింగ్‌ చంద’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అద్విత్‌ చందన్‌ దర్శకత్వం వహించనున్నారు. అమిర్‌ తన 54వ పుట్టిన రోజును పురస్కరించుకుని తన అభిమానులకు ఈ తీపి వార్త చెప్పారు.

ఈ సందర్భంగా అమిర్‌ ఖాన్‌ మాట్లాడుతూ… ‘నా అభిమానులు, మీడియా కోసం ఓ ప్రకటన చేస్తున్నా. నేను చేయబోయే తర్వాత చిత్రం ఖరారు అయింది. దాని పేరు ‘లాల్‌ సింగ్‌ చంద’. అమెరికన్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ను హిందీలో రీమేక్‌ చేస్తున్నాం. వియోకామ్‌ 18, అమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ల్లో తెరకెక్కనుంది. అద్విత్‌ చందన్‌ దర్శకత్వం వహించబోతున్నారు. పారామౌంట్‌ పిక్చర్స్‌ నుంచి మేము హక్కులు కొన్నాం. ఈ సినిమాలో పాత్ర కోసం 20 కిలోలు తగ్గాల్సి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రిపరేషన్‌ ప్రారంభించాను.సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ మొదలు కానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ఈ చిత్రాన్ని నేను నిత్యం ఇష్టపడుతుంటాను. ఇదొక అద్భుతమైన కథ. ఫీల్‌ గుడ్‌ మూవీ. ఇది కుటుంబ కథా చిత్రం కూడా’ అని అమిర్‌ ఖాన్‌ చెప్పారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమిర్‌ భార్య కిరణ్‌ రావ్‌ మాట్లాడుతూ… ‘దంగల్‌ చిత్రం కోసం ఏవిధంగా అయితే డైట్‌ పాటించారో దానికి మించి ఈ చిత్రం కోసం అమలు చేస్తున్నారు. వారం రోజుల క్రితమే ఈ ప్రిపరేషన్‌ ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని కిలోలు తగ్గారు కూడా. అదొక రుచికరమైన, ఆరోగ్యకరమైన డైట్‌. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈ డైట్‌ని అనుసరించాలనుకుంటారు” అని అన్నారు.
1986లో విన్‌స్టోన్‌ గ్రూమ్‌ నవల ఆధారంగా ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రాన్ని రూపొందించారు. రాబర్ట్‌ జెమెక్కీస్‌ దర్శకత్వం వహించారు. ఎరిక్‌ రోత్‌ కథను అందించారు. టామ్‌ హ్యాంక్స్‌ హీరోగా చేశారు. రాబిన్‌ రైట్‌, గరే సినీస్‌, మైకెల్తీ విలియసన్‌, సల్లీ ఫీల్డ్‌ తదితరులు నటించారు. ఈ చిత్రం 1994లో ఆరు విభాగాల్లో ఆస్కార్లు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ వంటి విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్లు గెలుచుకుంది.