ఏదీ బయటకు చెప్పను.. చేసి చూపిస్తాను!

‘నేను ప్రజలకు సేవ చేసేందుకు ‘సత్యమేవ జయతే’, ‘పాని’ ఫౌండేషన్లున్నాయి. ప్రజలకు నేను ఏది చెప్పాలనుకున్నా దాన్ని.. సినిమాల ద్వారానే చెబుతా. ఏదీ బయటకు చెప్పను, చేసి చూపిస్తాను’ ..అని అమిర్‌ ఖాన్‌ అన్నారు. ఆ మధ్య ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అమిర్‌ ఖాన్‌ ప్రస్తుతం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రంలో నటిస్తున్నారు. హలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కి రీమేక్‌.
అమిర్‌ సామాజిక మాద్యమాలకు దూరంగా ఉంటారు. సినీ వేడుకల్లోనూ పెద్దగా కనిపించరు. తనపై వచ్చే విమర్శలకు అంతగా స్పందించరు. ఈ విషయాలపై అమీర్ స్పందిస్తూ…
“సోషల్‌ మీడియాలో నేను ఎక్కువగా ఉండననేది నిజమే. ఎందుకంటే ఎక్కువగా సినిమాలతోనే బిజీగా ఉంటా. నా ప్రపంచంలో సగం సమయం మాత్రమే నేను ఉంటాను. ఆ కాస్త సమయాన్ని కూడా సోషల్‌ మీడియాకు కేటాయించాలనుకోను. ప్రజలకు ఏది చెప్పాలనుకున్నా, సినిమాల ద్వారానే చెబుతా. ప్రజలకు సేవ చేసేందుకు ‘సత్యమేవ జయతే’, ‘పాని’ ఫౌండేషన్లున్నాయి. నేను ఏదీ చెప్పను, చేసి చూపిస్తా. నా సినిమాలు విడుదలైనప్పుడు సామాజిక మాద్యమాల్లో పెట్టే పోస్టులు…అభిమానులు పెట్టే ప్రతి కామెంట్‌ చదువుతా. ఎందుకంటే నా సినిమాల గురించి అభిమానులు ఏమనుకుంటారో తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. కావాలని నాపై కొందరు కక్షపూరితంగా విమర్శలు చేస్తే అందుకు నేను బాధపడను. నిజాయితీగా విమర్శిస్తే వాటిని స్వాగతిస్తా. విమర్శల నుంచి నటుడిగా ఎంతో నేర్చుకునేందుకు వీలుంటుంది’ అని అన్నారు. అమిర్‌ ఖాన్‌ నటిస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్దా’ చిత్రం క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
అక్షయ్‌కు ఆమీర్‌ ఖాన్‌ ధన్యవాదాలు
అక్షయ్‌ కుమార్‌కు ఆమీర్‌ ఖాన్‌ ధన్యవాదాలు తెలిపాడు. అక్షయ్‌ ఎదుటి వారికి సాయం చేయడంలో ముందుంటారన్న విషయం విదితమే. అంతేగాక తన తోటి నటులకు కూడా అవకాశం చిక్కినప్పుడల్లా తనవంతు సాయం చేస్తుంటాడు. ఆమీర్‌ కోరిక మేరకు అక్కీ తన ‘బచ్చన్‌ పాండే’ సినిమా విడుదల తేదీని వాయిదా వేశాడట. విషయం ఏంటంటే.. అమీర్‌ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ ను ఈ ఏడాది క్రిస్మస్‌కు డిసెంబర్‌ 25న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. అదేవిధంగా అక్షయ్‌ కుమార్‌ ‘బచ్చన్‌ పాండే’ను కూడా అదే రోజున విడుదల చేయాలని దర్శకుడు సాజిద్ నాడియాద్వాలా, అక్షయ్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో వారి సినిమా విడుదల తేదీని మార్చు కోవాలని ఆమీర్‌, అక్షయ్‌ను కోరడంతో ‘బచ్చన్‌ పాండే’ రిలిజ్‌ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.