యువ రచయితలకు అమిర్‌,షారుఖ్‌ల ఆహ్వానం!

షారుఖ్‌ ఖాన్‌ తాజాగా యువ కథా రచయితలకు తీపి కబురు చెప్పాడు. లాక్‌డౌన్‌ దృష్టిలో పెట్టుకుని కథలు రాసి పంపించొచ్చని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.హారర్‌ స్టోరీలు కావాలంటూ యువ రచయితలకు షారుఖ్‌ ఖాన్‌ పిలుపు ఇచ్చారు. షారుఖ్‌ ఖాన్‌ ‘జీరో’ చిత్రం అపజయం తర్వాత హీరోగా సినిమాల్లో నటించడం లేదు. నచ్చిన కథ దొరకడం లేదని చెబుతున్నారు. గత ఏడాది ఆయన తన ప్రొడక్షన్‌ హౌస్‌ ‘రెడ్‌ చిల్లీస్‌’ నుంచి ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌’ అనే చిత్రాన్ని నిర్మించి దాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. తాజాగా ఓటీటీపై తన రెండో చిత్రం ‘బేతాళ్‌’ విడుదల చేయబోతున్నారు. ఈనెల 24న ఈ హారర్‌ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ నుంచి విడుదల కాబోతుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరికీ ఖాళీ సమయం ఉంటుంది. క్రియేటివ్‌ ఆలోచనలతో.. హాస్యాన్ని,. భయాన్ని కల్పించే కథలు ఉంటే పంపాలంటూ యువతను కోరారు. దానికి కొన్ని నిబంధనలు పెట్టారు. ఇంట్లోనే చిత్రీకరించేలా ఉండాలి. అవి బాగా భయం తెప్పించే కథలు అయి ఉండాలి. భౌతిక దూరం పాటిస్తూ ఇద్దరు ముగ్గురు చిత్రీకరణలో పాల్గొనే అవకాశం ఉండేలా కథను సిద్ధం చేయాలి. అటువంటి వీడియో ఏదైనా చేసి ఉంటే ఈనెల 18లోపే పంపాలి. ఇలా వచ్చిన వాటిని గ్రాహాం, వినీత్‌ కుమార్‌, ఆహానా కుమార్‌ గౌరవ్‌ వర్మతో ఏర్పడిన జ్యూరీ కమిటీ ముగ్గురు విజేతలను ప్రకటిస్తుంది. వారితో షారుఖ్‌ వీడియో కాన్షరెన్స్‌ ద్వారా ఇంట్రాక్ట్‌ అవుతారు.
 
‘సినీస్తాన్‌ ఇండియాస్‌ స్టోరీ టెల్లర్‌ కాంటెస్ట్‌’
అమిర్‌ ఖాన్‌ యువ రచయితలు తమ కథలను పంపితే అందులో విజేతలను ఎంపిక చేస్తామని ప్రకటించారు. చిత్రసీమకు కొత్త కథలు రావాలని అప్పుడే మరింత సృజనాత్మకంగా సినిమాలు రూపొందించొచ్చనని అమిర్‌ ఖాన్‌ పేర్కొంటూ 2017లో పోటీలకు తెరలేపారు. దీన్ని ‘సినీస్తాన్‌ ఇండియాస్‌ స్టోరీ టెల్లర్‌ కాంటెస్ట్‌’ పేరుతో ప్రారంభించారు.ఆయనకు వేల సంఖ్యలో కథలు వచ్చి పడ్డాయి. ఆ కథలను పరిశీలించి ఐదు ఉత్తమమైనవాటిని ఎంపిక చేసేందుకు ప్రత్యేక జ్యూరీ ఏర్పాటు చేశారు.
 
ఆ పోటీల్లో భాగంగా రెండో ఎడిషన్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. విజేతలకు రూ.50 లక్షలు బహుమతిని కూడా ప్రకటించారు. ఈ ఎడిషన్‌కు వేల సంఖ్యలో కథలు పోటీ పడ్డాయి. అమిర్‌ఖాన్‌, అనుజమ్‌ రజబలి, జుహి చతుర్వేది, రాజ్‌కుమార్‌ హిరానీతో కూడిన జ్యూరీ కమిటీ ఐదుగురు విజేతలను తేల్చింది . ఈ విజేతలను లాక్‌డౌన్‌ అనంతరం ప్రత్యేక వేదికపై సన్మానించి అభినందించనున్నారు అమిర్‌ ఖాన్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపే కథలు రాయగలిగే వాళ్లకు చిత్రసీమలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అటువంటి ప్రయత్నం యువ రచయితలు చేస్తే బాగుంటుందని అన్నారు.