ఇమేజ్ దెబ్బ తింటుందని ఆమె భయం!

ప్రయోగాత్మక, మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచి, అగ్ర హీరోలకు దీటుగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న అగ్రకథానాయిక అనుష్క. తన వైభవం వెండి తెరకే పరిమితం కావాలనే ఉద్దేశంతో.. ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌ కోసం వచ్చిన భారీ ఆఫర్‌ని ఆమె తిరస్కరించింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ పలు భాషల్లో నిర్మించబోయే ఓ వెబ్‌ సిరీస్‌ కోసం అనుష్కను సంప్రదించింది. అలాగే, ఈ వెబ్‌ సిరీస్‌లో నటించినందుకు భారీ మొత్తంలో పారితోషికాన్ని ఇచ్చేందుకు కూడా నెట్‌ఫ్లిక్స్‌ సిద్ధమైంది. అయితే వెబ్‌ సిరీస్‌లో నటించడానికి ఆసక్తి లేదని, సినిమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నానని అనుష్క తెలిపినట్టు సమాచారం. నిజానికి తనకు దక్షిణాదిలో ఉన్న అగ్ర కధానాయిక ఇమేజ్ వెబ్ సిరీస్ లో చేస్తే దెబ్బ తింటుందనే భయంతోనే ఆమె అంగీకరించలేదని తెలుస్తోంది.
 
అనుష్క నటించిన ‘నిశ్శబ్ధం’ తెలుగుతోపాటు మరికొన్ని భాషల్లోనూ విడుదలకు సిద్ధంగా ఉన్నా.. లాక్‌డౌన్‌ వల్ల థియేటర్లు మూతపడటంతో వాయిదా పడింది. ఈ సినిమా ఓటీటీ లో రిలీజ్‌ అవ్వబోతోందనే వార్తలు వినిపించాయి. అయితే చిత్ర బృందం ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లలోనే విడుదల చేస్తామని ఖరాఖండిగా తెలిపింది. ఇదిలా ఉంటే, పాపులర్‌ తమిళ నటుడు విజయ్ సేతుపతికి జోడిగా ఓ ద్విభాషా చిత్రంలో అనుష్క నటించబోతోంది. కె.ఎల్‌.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం కథ మొత్తం అనుష్క చుట్టూనే తిరుగుతుంది. ఆమె పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందట. గతంలో దర్శకుడు కె.ఎల్‌.విజయ్ దర్శకత్వంలో ‘నాన్న’ చిత్రంలో అనుష్క నటించింది . కమల్‌హాసన్‌, గౌతమ్‌మీనన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రాఘవన్‌’ చిత్రం అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ విశేష విజయం సాధించింది. ఈ చిత్ర సీక్వెల్‌లో కమల్‌హాసన్‌ సరసన అనుష్క నటించనున్నట్టు తెలుస్తోంది. అలాగే గోపీచంద్‌, తేజ కాంబోలో తెరకెక్కబోయే ‘అలువేలు మంగ వేంకటరమణ’ సినిమాలోనూ అనుష్క నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
 
ఆ విషయంలో తగ్గే సమస్య లేదు!
అనుష్క ప్రస్తుతం ఎంపిక చేసిన ‌చిత్రాలనే చేస్తోంది. అనుష్క నటించిన తాజా చిత్రం ‘సైలెన్స్‌’ త్వరలో విడుదలకు సిద్ధం అవు తోంది.. కాగా ఇప్పుడు ఓతమిళ చిత్రంలో అవకాశం అనుష్కను వెతుక్కుంటూ వచ్చింది. దాన్ని ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు జంటగా అనుష్క నటించడానికి రూ.3 కోట్లు డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. అయితే, అంత మొత్తాన్ని ఇవ్వడానికి దర్శక నిర్మాతలు నిరాకరించడంతో బేరసారాలు జరిగాయట. తాను బహుభాషా నటినని..పలు భాషల్లో ఆదరణ ఉంటుంది కనుక, తన పారితోషికం విషయంలో తగ్గే సమస్య లేదని అనుష్క కరాఖండిగా చెప్పిందట. ఈ చిత్రంలో చేస్తున్న విజయ్‌ సేతుపతి కి 10 కోట్లు పారితోషికం ఇస్తున్నప్పుడు.. తనకు 3 కోట్లు ఇవ్వడం సముచితం అని అనుష్క చెప్పినట్లు తెలిసింది. చేసేదిలేక చిత్ర దర్శక నిర్మాతలు అనుష్క డిమాండ్‌ కి అంగీకరించక తప్పలేదని తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ లాక్‌ డౌన్‌ ముగిసిన తర్వాత సెట్‌ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.