దిలీప్‌ భార్య, నటి కావ్య‌ సూచిస్తేనే అఘాయిత్యం !

మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి షాకింగ్‌ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నటిపై ఈ అఘాయిత్యానికి పాల్పడమని మలయాళ నటుడు దిలీప్‌ భార్య, నటి కావ్య‌ తమకు సూచనలు ఇచ్చారని ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని బయటపెట్టాడు. ముందు నుంచి తను చెబుతున్న ‘మేడమ్‌’ ఆమెనని పోలీసులతో పేర్కొన్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

బుధవారం పల్సర్‌ సునిని పోలీసులు ఎర్నాకులం సెషన్స్‌ కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా పల్సర్‌ మాట్లాడుతూ.. ‘కావ్య. ఈ పేరు నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను. నేనొక దొంగని’ అన్నాడు. ఇది వరకు జరిపిన విచారణలో పల్సర్‌ సుని చాలా సార్లు కావ్య పేరును ప్రస్తావించాడు. ఈ నేపథ్యంలోనే నటిపై చిత్రీకరించిన ఫొటోలు, వీడియోలకు సంబంధించిన మెమొరీ కార్డు ఆమె వద్ద ఉందని పోలీసులు అనుమానించారు. జులైలో ఆమె కార్యాలయంపై దాడులు జరిపారు.

మంగళవారం కేరళ హైకోర్టు దిలీప్‌ బెయిల్‌ దరఖాస్తును తిరస్కరించింది. ఆధారాలు ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో బెయిల్‌ మంజూరుకు నిరాకరించింది. ఫిబ్రవరిలో కొచ్చిలో నటి కారును పల్సర్‌ సుని, అతడి అనుచరులు అడ్డగించి, ఆమెను అపహరించారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, సెల్‌ఫోన్లో చిత్రీకరించారు.

నటి ఫిర్యాదు మేరకు పోలీసులు పల్సర్‌ సునితోపాటు ఆరుగురిని అరెస్టు చేశారు. దీని వెనుక నటుడు దిలీప్‌ ఉన్నాడని పల్సర్‌ సుని విచారణలో చెప్పాడు. ఈ మేరకు పోలీసులు దిలీప్‌ను అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు. దిలీప్‌ మాజీ భార్య మంజూ వారియర్‌, బాధిత నటి మంచి స్నేహితులు. పాత గొడవల నేపథ్యంలో దిలీప్‌ ఈ పని చేయించారని ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి.