ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా ….’గూఢచారి’ చిత్ర సమీక్ష

                                           సినీ వినోదం రేటింగ్ : 3/5

అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విస్ట డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు శ‌శి కిర‌ణ్ తిక్క‌ దర్శకత్వం లో అభిషేక్ నామ, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు
 
కధలోకి వెళ్తే…
 ‘రా’ విభాగంలో ప‌నిచేసే స‌త్య‌(ప్ర‌కాశ్‌రాజ్‌) దేశం కోసం ఓ ఆప‌రేష‌న్ చేస్తుండ‌గా.. ప్ర‌త్య‌ర్థుల కాల్పుల్లో స‌త్య స్నేహితుడు ర‌ఘువీర్ చ‌నిపోతాడు. ర‌ఘువీర్ కొడుకు గోపి(అడివి శేష్‌)ని సంర‌క్షించే బాధ్య‌త‌ను స‌త్య తీసుకుని అత‌డి పేరుని అర్జున్‌గా మార్చేస్తాడు. ఉద్యోగం మానేసి ఎవ‌రికీ క‌న‌ప‌డ‌కుండా అజ్ఞాతంలో ఉంటారు. పెరిగి పెద్ద‌యిన అర్జున్ దేశం కోసం ఏదైనా చేయాల‌నే ఆలోచ‌న‌తో తండ్రిని ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని ‘రా’ విభాగం కోసం అప్లై చేస్తాడు. 174 సార్లు అప్లై చేసిన త‌ర్వాత 175వ సారి ‘రా’ విభాగంలోకి అర్జున్ సెల‌క్ట్ అవుతాడు. దేశ ర‌క్ష‌ణ కోసం స‌రిహ‌ద్దులు దాటి ప‌నిచేసే ‘రా’ లో త్రినేత్ర  విభాగంలో అర్జున్ జాయిన్ అవుతాడు. అదే స‌మ‌యంలో సైకాల‌జిస్ట్ స‌మీర(శోభితా దూళిపాళ‌)తో ఏర్ప‌డ్డ పరిచ‌యం ప్రేమ‌గా మారుతుంది. అయితే టెర్ర‌రిస్టు నాయ‌కుడు రాణా ఓ ప్లాన్ వేసి ‘రా’ విభాగానికి చెందిన పెద్ద ఆఫీస‌ర్స్‌ను చంపేసి ఆ నేరం అర్జున్‌పై మోపుతాడు. త‌నపై ప‌డ్డ నింద‌ను అర్జున్ ఎలా తొల‌గించుకున్నాడు. ఈ ప్ర‌యాణంలో అర్జున్‌కి తెలిసిన నిజాలేంటి? ఈ క్ర‌మంలో దేశం కోసం అర్జున్ ఏం చేశాడు?తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
 
విశ్లేషణ …
ఈ చిత్రానికి కథ మరియు స్క్రీన్ ప్లే రచయితగానే కాకుండా హీరోగా కూడా అడివి శేష్ నటించాడు . బాండ్ కాన్సెప్ట్‌తో కథను తయారు చేసుకున్న అడివి శేష్‌.. మనం కూడా బాండ్ సినిమాలను తెరకెక్కించగలమనేలా ఈ చిత్రం చేశాడు. దాన్ని పక్కాగా వెండితెర మీద ఆవిష్కరించటంలో దర్శకుడు శశి కిరణ్ విజయం సాధించాడు.అడివి శేష్, శ‌శికిర‌ణ్ తిక్క అండ్ టీం ఫ‌స్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వ‌ర‌కు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్ష‌కుల‌కు క‌ట్టి పడేశారు. క‌థ‌లో ట్విస్టులు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, క్లైమాక్స్ ఇలా అన్నీ.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి.బడ్జెట్ విషయంలో ఎక్కడా కాప్రమైజ్ అవ్వకుండా మంచి సాంకేతిక విలువలతో వివిధ ఎక్కువ లొకేషన్స్ లో సినిమాను చేసిన ఈ గూఢచారి చిత్రబృందాన్ని అభినందించి తీరాలి.
 
నటినటులు…
అడివి శేష్ తన గత సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొత్త లుక్స్ తో చాలా స్టైలిష్ గా ఫ్రెష్ గా కనిపించాడు. యాక్షన్, రొమాన్స్‌, కామెడీ, ఎమోషన్స్‌ ఇలా అన్ని వేరియేషన్స్‌ సెటిల్డ్ గా చాల చక్కగా నటించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ‘మిస్ ఇండియా’ తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ పాత్ర ఫ‌స్టాఫ్‌కే ప‌రిమిత‌మైనా చ‌క్క‌గా ఉంది . గ్లామర్ తో పాటు నటిగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది
త్రినేత్ర అనే సీక్రెట్ ఏజెన్సీకి పని చేసే మిస్టీరియస్ ఏజెంట్ నదియా ఖురేషీ పాత్రలో సుప్రియా యార్లగడ్డ మంచి పాత్ర‌లో తన నటనతో మెప్పించింది. నెగెటివ్‌ షేడ్స్‌ చాలా బాగా చూపించింది. జగ‌పతిబాబు పాత్ర‌ను రివీల్ చేసిన తీరు.. ఆ పాత్ర‌ను డిజైన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. మరోసారి ప్రతినాయక పాత్రలో మెప్పించాడు. ఇక  వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు, ఇతర ముఖ్యమైన పాత్రల్లో  ప్రకాష్ రాజ్, అనిష్ కురువిల్ల, మధు శాలిని కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
 
సాంకేతిక నిపుణులు…
సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల పాటలు కొన్ని బాగున్నాయి. మంచి నేప‌థ్య సంగీతంతో స‌న్నివేశాల‌కు బలం చేకూర్చారు. అలాగే శ‌నీల్ డియో కెమెరా వర్క్‌తో ప్ర‌తి స‌న్నివేశం చాలా రిచ్‌గా ఉంది. ఎక్కువ లొకేషన్స్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అందంగా తీర్చి దిద్దారు.విఎఫ్ఎక్స్ టీమ్ పని తనం బాగుంది. సన్నివేశాలకు అనుగుణంగా విఎఫ్ఎక్స్ వర్క్ ను వాడుకున్న విధానం ఆకట్టుకుంది. అబ్బూరి రవి రాసిన మాటలు పేలాయి. ఎడిటింగ్, ఆర్ట్‌ ఇలా అన్నీబాగున్నాయి -ధరణి