భిన్నమైన పాత్రలు, వైవిధ్యమే నాకు ముఖ్యం !

‘వైవిధ్యమే నాకు అన్నింటి కంటే ముఖ్యం. విలక్షణమైన పాత్రలు చేసేందుకే ఇష్టపడతా’ అని అంటోంది అదితి రావు హైదరీ. ఆమె ‘చెలియా’, ‘లండన్‌ పారిస్‌ న్యూయార్క్‌’, ‘భూమి’, ‘పద్మావత్‌’ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె మణిరత్నం మల్టీస్టారర్‌ ‘నవాబ్‌’లో నటిస్తోంది. ఇందులో యాక్ట్‌ చేయడానికి గల కారణం ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకు అదితి స్పందిస్తూ….

‘నేను మొదట్నుంచి అన్ని రకాల, విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్నాను. ఒక వ్యక్తినో, ఇద్దరు వ్యక్తుల కోసమో సినిమా చేయను. సినిమాకు దర్శకుడు, చిత్ర బృందం ముఖ్యం. కథ, నా పాత్ర ఎలా ఉన్నాయనేది చూస్తాను. నా పాత్రలు, సినిమాలు సాధ్యమైనంత వరకు వైవిధ్యంగా, విలక్షణంగా ఉండాలనుకుంటాను. హాలీవుడ్‌లో జెన్నీఫర్‌ లారెన్స్‌, నటాలియా పోర్ట్‌మన్‌, బ్రాడ్‌ పిట్‌ వంటి నటులు అమేజింగ్‌ రోల్స్‌ చేస్తారు. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుని నేను ముందుకు సాగుతున్నా. అందుకే భిన్నమైన పాత్రలు పోషించేందుకు పెద్ద పీట వేస్తున్నా. వైవిధ్యమే నాకు ముఖ్యం’ అని తెలిపింది. ప్రస్తుతం ఆమె మణిరత్నం ‘నవాబ్‌’తోపాటు, ఇంద్రగంటి మోహనకృష్ణ ‘సమ్మోహనం’, సుదీర్ మిశ్రా ‘దాస్‌ దేవ్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

మణిరత్నం మల్టీస్టారర్‌ ‘నవాబ్‌’ లో …..

మణిరత్నం చిత్రంలో మరోసారి నటించడానికి నటి అదితిరావ్‌ హైదరి సిద్ధమయ్యింది. ఇంతకు ముందు మణరత్నం తెరకెక్కించిన ‘కాట్రువెలియిదే’ చిత్రంలో కార్తీకి జంటగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అయినా తన తాజా చిత్రం ‘నవాబ్‌’ లో అదితిరావ్‌ను మణిరత్నం తీసుకున్నారనేది తాజా సమాచారం. ఈ ప్రఖ్యాత దర్శకుడు తన తాజా చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. కథా చర్చల కోసమే చాలా కాలం తీసుకున్నారు. అంతే కాదు చిత్రంలో పలువురు స్టార్‌ హీరోలను నటింపజేస్తున్నారు. ఈ మల్టీస్టారర్‌ చిత్రంలో ఇప్పటికే విజయ్‌సేతుపతి, శింబు, ఫాహద్‌ ఫాజిల్, అరవిందస్వామి, జ్యోతిక, ఐశ్వర్యరాజేశ్‌లను ఎంపిక చేశారు.తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ అదితిరావ్‌ కూడా ఈ జాబితాలో చేరింది. ఇక సంగీత మాంత్రికుడు ఏఆర్‌.రెహ్మాన్‌ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రాన్ని లైకా సంస్థ ఫస్ట్‌కాపీ విధానంతో మణిరత్నం మద్రాస్ టాకీస్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణానికి సిద్ధమైంది.

ఇంద్రగంటి మోహనకృష్ణ ‘ సమ్మోహనం’

సుధీర్‌బాబు, అదితిరావ్ హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ‘సమ్మోహనం’ అనే పేరును ఖరారు చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. సమ్మోహనం అంటే మంత్రముగ్ధులను చేసే ఒక అందమైన ఆకర్షణ. ఈ సినిమాలో నాయకానాయికల మధ్యన సమ్మోహనకరమైన రొమాన్స్ ఉంటుంది. మిగతా పాత్రలు భిన్న ఆకర్షణలతో మెప్పిస్తాయి అన్నారు. మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. నేటి నుంచి మార్చి 3 వరకు నాలుగో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరుపుతాం. అనంతరం హిమాచల్‌ప్రదేశ్, ముంబయిలో చిత్రీకరణ జరుపుతాం. మే నెల మూడోవారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. వి.కె.నరేష్, తనికెళ్ల భరణి, పవిత్రలోకేష్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్‌సాగర్, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.