అడవి శేష్+రేణూ దేశాయ్‌=ఓ విభిన్నచిత్రం!

పవన్‌కళ్యాణ్ మాజీ సతీమణి, నటి రేణూ దేశాయ్ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే యోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె రెండు సినిమాలకు సైన్ చేసింది. ఇంతవరకూ ఎన్ని అవకాశాలొచ్చినా నటనపై పెద్దగా ఆసక్తి చూపని రేణూ దేశాయ్ ఇటీవలే మనసు మార్చుకుని మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవాలనే ఆలోచన చేస్తోంది. హీరోయిన్‌గా పవన్‌కళ్యాణ్‌తో కలిసి కేవలం రెండు సినిమాల్లోనే నటించింది ఆమె. అలాగే పవన్ నటించిన చాలా సినిమాలకు ఎడిటింగ్ ఫీల్డ్‌లో, కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన అనుభవం ఆమెకుంది.
యాక్టింగ్ కంటే టెక్నికల్ ఫీల్డ్‌లో ఉండడానికే తనకు ఎక్కువ ఆసక్తి అని గతంలో చాలాసార్లు రేణూ దేశాయ్ చెప్పింది. ‘ఇష్క్ వాలా లవ్’ అనే ఓ మరాఠీ చిత్రానికి డైరెక్షన్ కూడా చేసింది . ఇకపోతే తాజాగా రేణూ దేశాయ్ యాక్టింగ్‌పై ఆసక్తి చూపించడంతో పలు క్యారెక్టర్లు ఆమె కోసం సిద్ధమవుతున్నాయట. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో… ఆమె ఓ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపింది. అడవి శేష్‌తో కలిసి రేణూ దేశాయ్ దిగిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో సందడి చేస్తోంది.
మల్టీ టాలెంటెడ్ అడవి శేష్ ఇటీవల రేణూ దేశాయ్‌ని కలిశారట.ఓ స్టోరీ లైన్ వినిపించే క్రమంలోనే రేణూ దేశాయ్‌ని ఆయన కలిసుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘ఎవరు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అడివి శేష్ త్వరలోనే మరో విభిన్నమైన చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలిసింది. ఈ సరికొత్త కథలో రేణూ దేశాయ్‌ని భాగం చేయాలనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి అడవి శేష్ వెళ్లారని సమాచారం. ఈ సందర్భంగా రేణూ దేశాయ్‌తో పాటు ఆమె కుమారుడు అకీరానందన్ కూడా అడవి శేష్‌తో హుషారుగా ఫోటోలకు పోజిచ్చాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్ని అడవి శేష్ ట్విటర్‌లో షేర్‌ చేశారు…
‘హ్యాండ్సమ్‌ కుర్రాడు అకీరాతో ఈ రోజు ఉత్సాహంగా గడిచింది. అతడికి ‘ఎవరు’ సినిమా చాలా నచ్చింది. ఇద్దరం అలా సరదాగా సమయం గడిపాం, భోజనం చేశాం.. జీవితం గురించి సాధారణంగా మాట్లాడుకున్నాం. గంభీరమైన స్వరంతో 6.4 అడుగుల ఎత్తున్న వ్యక్తి అతడు. మా ఇద్దరిదీ ఎడమ చేతి వాటం కావడం సంతోషంగా ఉంది. మా ఇద్దరిలో చాలా విషయాలు కామన్‌గా ఉన్నాయి. చిట్టి ఆద్యకు కెమెరా అంటే కాస్త సిగ్గు. రేణూ దేశాయ్‌తో సంభాషించడం ఆనందంగా ఉంది. మీరు ఓ గొప్ప కవయిత్రి. మమ్మల్ని మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ప్రేమమాలినీ’ అని ఆయన పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.