నా జీవితాన్ని తెరకెక్కిస్తే చూడాలనుంది !

ఐశ్వర్యరాయ్… “నా జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలని నాకూ ఉంది.నా బయోపిక్‌ను వాస్తవానికి దగ్గరగా తెరకెక్కిస్తే చూడాలని ఉంది” అని అంటోంది ఐశ్వర్యరాయ్ . సాధారణ కుటుంబంలో జన్మించిన ఐశ్వర్యరాయ్ మోడలింగ్‌లోకి అడుగుపెట్టి ప్రపంచ సుందరి గా వెలుగొందింది. ఆ తర్వాత చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగింది.
‘మీ బయోపిక్‌ను తెరపై ఎప్పుడైనా చూసుకోవాలనిపించిందా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు ఐశ్వర్య స్పందిస్తూ.. “గతంలోనూ ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. నా జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలని నాకూ ఉంది. మిగతా వారితో పోల్చితే నా జీవితం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. దాన్ని అలాగే తెరపైకి ఎక్కిస్తే గొప్ప కథ అవుతుంది. ఆ కథ తెరపై ఎలా వస్తుందో చూడాలని ఉంది” అని ఐష్‌ తన మనసు లోని మాటను వెల్లడించింది. ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం ‘గులాబ్‌ జమూన్‌’ చిత్రంలో తన భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి నటిస్తోంది.
ఆమె అందం వెనుక ప్లాస్టిక్ ప్రభావం
ఐశ్వర్యారాయ్ అందచందాల గురించి ఎంతై నా చెప్పవచ్చు. ఈ మాజీ విశ్వసుందరి తన అందంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే “ఐష్ అందం సహజసిద్ధమైనది కాదని… ఆమెది ప్లాస్టిక్ అందమ”నే వాదన కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉంది. విశ్వసుందరి కాకముందే ఐశ్వర్యారాయ్ తన ముఖంలో కొన్ని మార్పులు చేయించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించిందని.. అప్పట్లో మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయంపై బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
ఈ విషయాన్ని ఐష్‌ను అడిగితే ..ఆమె ప్రతిసారి దాటవేస్తూ వచ్చేది. తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానన్న దాంట్లో నిజం ఉందని కానీ,లేదని కానీ ఆమె చెప్పలేదు. తాజాగా మరోసారి ఐశ్వర్య ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దీనిపై స్పందిస్తూ… “ఇరవై ఏళ్ల క్రితం ఇదే ప్రశ్న అడిగినప్పుడు, ఇప్పుడు ఒకే సమాధానం చెబుతున్నాను. అందం కాపాడుకోవడానికి ప్రతి మహిళ ఏదో చేస్తుంటుంది. ఆహార నియమాల నుంచి ప్రతీది పాటిస్తాం”అని పేర్కొంది ఐశ్వర్యారాయ్. అయితే, ఐష్ నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని అంత అందగత్తెగా మారినా అభిమానులు ఆమెను ఆరాధ్య దేవతగానే భావిస్తారు.