తెరపై అజయ్ దేవ్‌గణ్ రాందేవ్ బాబా జీవిత చరిత్ర

పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన జీవిత కథలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు . ఇటీవలి కాలంలో బయోపిక్‌లు ఎక్కువైపోతున్నాయి. మొన్నటికి మొన్న ధోని బయోపిక్ వస్తే.. అది పోయిన కొన్ని నెలలకే సచిన్ బయోపిక్ వచ్చేసింది. ఇటు ఆ జాబితాలోకి బాబాలు కూడా చేరిపోతున్నారు. యోగాసనాలతో, ఇండియన్ బ్రాండ్ అంటూ “పతంజలి ఆయుర్వేద” వ్యాపార సామ్రాజ్యాధినేతగా బాబా రాందేవ్ దాదాపు అందరికీ సుపరిచితులే. ఇప్పుడు ఆయన బయోపిక్‌కు రంగం సిద్ధమవుతోంది.
ప్రస్తుతం అజయ్ దేవ్‌గణ్ ‘గోల్‌మాల్ ఎగైన్’ అనే సినిమాలో నటిస్తున్నారు.”శివాయ్‌”గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ఫ్లాప్ మూటగట్టుకున్న అజయ్ దేవ్‌గణ్ రాందేవ్ పాత్ర పోషించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇదివరకే బుల్లితెరపై రాందేవ్ జీవితాన్ని హిందీ బుల్లితెర ప్రముఖుడు విక్రాంత్ మాసేతో తీయాలని చూసినా.. అది ఆచరణకు నోచుకోలేదు. దీంతో అజయ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ‘‘అజయ్ దేవ్‌గణ్ రాందేవ్ బాబా జీవిత చరిత్రను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు. దీనిపై చర్చలు సాగుతున్నాయి. అజయ్ తీద్దామనుకున్న ‘బ్యాటిల్ ఆఫ్ సర్గారి’ అనే సినిమాలో ఎలాంటి పురోగతి లేనందున రాందేవ్ బయోపిక్‌కు సిద్ధమవుతున్నారు’’ అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.