రామ్‌చరణ్‌ నిర్మించే సినిమాలో అఖిల్‌ హీరో ?

రామ్‌చరణ్‌, అఖిల్‌… రామ్‌చరణ్‌ని అఖిల్‌ ఆప్యాయంగా ‘పెద్దన్నయ్య’ అని పిలుస్తుంటారు.మంచి స్నేహితులు. స్నేహాన్ని మించిన బంధం ఇద్దరిదీ! ఇప్పుడీ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్‌ గుసగుస. అయితే… ఇక్కడ ఓ ట్విస్ట్‌ ఉంది. అదేంటంటే… సినిమాలో రామ్‌చరణ్‌ నటించడం లేదు. ఆయన నిర్మించే సినిమాలో అఖిల్‌ హీరోగా నటించనున్నారని సమాచారం.

రామ్‌చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అఖిల్‌ హీరోగా ఓ సినిమా చేయడానికి బోయపాటి శ్రీను సన్నాహాలు చేస్తున్నారట! అఖిల్‌, బోయపాటి మధ్య కథాచర్చలు జరిగాయని, ఇద్దరూ కలిసి సినిమా చేయాలనినిశ్చయించుకున్నారని పరిశ్రమ వర్గాల భోగట్టా. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

ప్రస్తుతం అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ సినిమా చేస్తున్నారు. ‘తొలిప్రేమ’ ఫేమ్‌ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త ఏడాదిలో జనవరి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘మిస్టర్‌ మజ్ను’ విడుదలైన తర్వాత బోయపాటి సినిమా కోసం ప్రిపేర్‌ అవుతారట! మార్చి 2019 నుంచి సినిమా సెట్స్‌ పైకి వెళుతుందట.ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై  చిరంజీవి తో రామ్‌చరణ్‌ భారీగా ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మిస్తున్నారు.