పాత ప్రేమికుడే… ‘Mr మజ్ను’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 2.25/5

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో  బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కధలోకి వెళ్తే…
విక్ర‌మ్ కృష్ణ అలియాస్ విక్కీ అలియాస్ కృష్ణ‌ (అఖిల్‌) యుఎస్‌లో ఎం.ఎస్‌.చ‌దువుతుంటాడు. అత‌న్ని చూడ‌గానే ప్ర‌తి అమ్మాయి ఇష్ట‌ప‌డుతుంది. వాళ్లు అత‌ని జీవితంలోకి వ‌చ్చినా, వెళ్లినా అత‌నికి పెద్ద ప‌ట్టింపు ఉండ‌దు. త‌న‌కు రాముడిలాంటి భ‌ర్త రావాల‌నుకుంటుంది నిక్కి (నిధి). ఆమెకు విక్కీ తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ఇద్దరూ ఒకేసారి ఇండియాకు వ‌స్తారు. కాబోయే చుట్టాల‌ని వాళ్ల‌కి ఎయిర్‌పోర్టులోనే తెలుస్తుంది. నిక్కి అన్న (రాజా)కు, విక్కీ చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటారు. అలా విక్కీ, నిక్కీ బంధువుల‌వుతారు. నిక్కీకి ఆడ‌ప‌డుచు లాంఛ‌నాలు పెట్ట‌డానికి విక్కీ తండ్రి కొంచెం డ‌బ్బులిచ్చి విక్కీని ద‌గ్గ‌రుండి చూసుకోమంటాడు. అలా విక్కీ, నిక్కీ మ‌ధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అత‌నంటే ఆమెకు ఇష్టం క‌లుగుతుంది. రెండు నెల‌ల్లో అది ప్రేమ‌గా మారుతుందేమోన‌ని టెస్ట్ చేయ‌డం మొద‌లుపెడ‌తారు. వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారిందా? ఆ ప్రేమ పెళ్లి పీట‌ల వ‌ర‌కు వెళ్లిందా? వెళ్లక‌పోతే వారి ప్రేమ‌కు వ‌చ్చిన అవాంత‌రాలేంటి? వాటికి ఎవరు కారణం? ఈ అంశాలు సినిమాలో చూడాల్సిందే….
విశ్లేషణ…
‘తొలిప్రేమ’ తో మంచి హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అఖిల్‌ కోసం రొటీన్‌ లవ్‌ స్టోరినే తీసుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ ప్రయత్నంలో వెంకీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్మెంట్‌, ఎమోషనల్‌ సీన్స్‌తో బాగానే నడిపించినా.. సెకండ్‌ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సీన్స్ లోనూ కొత్త‌ద‌నం లేదు.కథనం కూడా  ఇబ్బంది పెడుతుంది.ముఖ్యంగా క్లైమాక్స్‌ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. `మిస్ట‌ర్ మ‌జ్ను`ని చూస్తున్నంత సేపు `తొలిప్రేమ‌`లో స‌న్నివేశాలే గుర్తుకొస్తాయి. అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య వ‌చ్చిన విభేదాలు ప్రధానంగా చూపడమే రెండు సినిమాల్లోనూ కనిపిస్తుంది.సీన్స్ కాస్త గ్రిప్పింగ్‌గా,  కొత్త‌గా రాసుకుని ఉండాల్సింది.మాటల రచయితగా మాత్రం వెంకీ తన మార్క్‌ చూపించాడు. చాలా డైలాగ్స్‌ గుర్తుండిపోయేలా ఉన్నాయి.
నటవర్గం…
ప్లే బాయ్ విక్కీ పాత్రలో అఖిల్ చక్కని నటనను కనబరిచాడు.  సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. అటు డ్యాన్సుల్లోనూ, ఇటు ఫైట్ల‌లోనూ, కొన్ని డైలాగులు చెప్ప‌డంలోనూ ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్ విషయంలో అఖిల్ కష్టపడ్డాడు. హీరో హీరోయిన్ల మధ్య సీన్లు, వారి మధ్య కెమిస్ట్రీ బాగానే అలరిస్తుంది. అలాగే రావు రమేష్ తో ఆస్తికి సంబంధించిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా అఖిల్ నటన చాలా బాగుంది.ఇక అఖిల్ సరసన కథానాయకిగా నిఖిత పాత్రలో నిధి అగర్వాల్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో, ప్రేమ సన్నివేశాల్లో ఆమె బాగా నటించింది.సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకోగా… సుబ్బరాజు, ప్రియదర్శి, హైపర్‌ ఆది కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారు.
సాంకేతికంగా…
సంగీత దర్శకుడు ఎస్ తమన్ అందించిన పాటలు అంతంత మాత్రమే . సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ , అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. జార్జ్‌ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్‌ ప్లస్‌ పాయింట్. హీరో హీరోయిన్లతో పాటు లండన్‌ అందాలను కూడా చాలా బాగా చూపించాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి – రాజేష్