అఖిల్‌ ‘హలో!’తో నటుడిగా మరో మెట్టు ఎక్కుతాడు !

‘‘ అఖిల్‌ ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కుతాడు’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘హలో!’ ప్రి రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కల్యాణి కథానాయిక. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు. అక్కినేని నాగార్జున నిర్మించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
 
చిరంజీవి మాట్లాడుతూ….
‘‘తరతరాలుగా అందరి నోళ్లలో నానుతున్న మాట ‘హలో’. ఆ మాటకీ అక్కినేని కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు ‘హలో హలో…’ అంటూ పాడారు. నాగార్జున, అమల ‘హలో గురూ…’ అని పాడుకొన్నారు. ‘హలోబ్రదర్‌’ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు అఖిల్‌ కూడా ‘హలో’ అంటూ పలకరిస్తున్నాడు. చరిత్రలో నిలిచిపోయేలా ‘మనం’ చిత్రాన్ని తీసిన విక్రమ్‌, అదే స్థాయిలో ‘హలో’ ప్రేమకథని తెరకెక్కించాడు.అక్కినేని కుటుంబంతో నాకెంతో అవినాభావ సంబంధం ఉంది. ముందుగా ‘హలో’ టైటిల్‌ ఈ సినిమాకి పెట్టినందుకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఈ సినిమాకి ప్రచారం అవసరం లేదు. ఫోన్‌ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్లంతా పలికేది ‘హలో’నే. నేను సినిమా చూశా. విడుదల కాకముందే సినిమాని చూడటం ఓ పరీక్షలాంటిది. బాగుంటుందా, ఉండదా? చూశాక ఏం చెప్పాలి? అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. కానీ ఈ సినిమా చాలా బాగుంది. ఒక అద్భుతమైన ప్రేమకథ. ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఇలాంటి ఓ సినిమా తీసినందుకు విక్రమ్‌కి అభినందనలు చెబుతున్నా. యువతరాన్నే అలరించే అంశాలే కాకుండా, అద్భుతమైన సెంటిమెంట్‌ కూడా ఉంది’’ అన్నారు.
 
విక్రమ్‌ కె.కుమార్‌ మాట్లాడుతూ ‘‘సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ అవకాశమిచ్చిన నిర్మాత నాగార్జునకి కృతజ్ఞతలు. నా చిత్రబృందం, అన్నపూర్ణబృందం అందించిన సహకారం మరిచిపోలేం’’ అన్నారు.
 
కల్యాణి మాట్లాడుతూ ‘‘చాలా ప్రేమకథలు చూస్తుంటారు. మా సినిమా కూడా అలాంటి ఓ ప్రేమకథ. ప్రతి ఒక్కరి కథలు గుర్తు తెచ్చుకొంటార’’న్నారు.
 
సమంత మాట్లాడుతూ ‘‘ఈ సినిమా టీజర్‌, ట్రైలర్లు చూస్తే నాకు నిజమైన అఖిల్‌ కనిపిస్తున్నారు. ఇదే నాకు తెలిసిన అఖిల్‌. తను అదృష్టవంతుడు. నాన్న అందం, నాన్న స్టైల్‌, అమ్మ గ్రేస్‌ తనలో కనిపిస్తుంది. విక్రమ్‌ నాకు బాగా ఇష్టమైన దర్శకుడు. ఒక అభిమానిగా ఈ సినిమా చూడాలని ఎదురు చూస్తున్నా. కల్యాణి చాలా అందంగా ఉంది. అనూప్‌ రూబెన్స్‌ మేజిక్‌ చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌కి మరో పెద్ద విజయం వస్తుందని పూర్తిగా నమ్ముతున్నా’’ అన్నారు.
 
నాగచైతన్య మాట్లాడుతూ ‘‘ప్రతి తరానికి స్ఫూర్తి చిరంజీవి. ఆయన వేడుకకి రావడం ఆనందంగా ఉంది. అఖిల్‌ డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తాడు. కానీ అందమైన ఫీల్‌గుడ్‌ సినిమాలో తనని చూడాలని ఉండేది. హలో సినిమాలో తనని చూశాక సంతోషంగా ఇంటికెళ్లా. ఈ సినిమా చూశాక నటుడిగా అఖిల్‌ ఏంటో తెలుస్తుంది. డిసెంబరు 22 తరువాత అందరూ ఒకే స్టైల్‌లో హలో చెబుతారు. అది అఖిల్‌ చెప్పిన స్టైల్‌లో’’ అన్నారు.
 
నాగార్జున మాట్లాడుతూ ‘‘చిరంజీవి ఇంటికెళ్లి మీరు అఖిల్‌ని ఆశీర్వదించాలనగానే ‘ఎప్పుడైనా, ఎక్కడికి రావాలో చెప్పండి’ అన్నారు. సినిమా చూశాకే వేడుకకి రండి అని చెప్పా. చిరంజీవి ఆశీర్వాదాలు ఎప్పుడూ మాకున్నాయి. వయసులో అంతరం ఉన్నా నాకూ చిరంజీవికీ మధ్య మంచి స్నేహం కుదిరింది. అలా రామ్‌చరణ్‌కీ, అఖిల్‌కీ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. అన్నయ్య, తమ్ముడు అని ఆ ఇద్దరూ పిలుచుకొంటుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎంత ఆడుతుందనేది ఏమీ చెప్పలేను. అఖిల్‌ పాడటం, ఆడటం చూస్తుంటే కడుపు నిండుతోంది. కథానాయిక కల్యాణికి మంచి భవిష్యత్తు ఉంది. విక్రమ్‌ కె.కుమార్‌తో మా కుటుంబానికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘మనం’ తర్వాత మరో మంచి చిత్రాన్ని అందించార’’న్నారు.
 
అమల మాట్లాడుతూ ‘‘చాలా ఆనందంగా ఉంది. డిసెంబరు 22 కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్‌, సుమంత్‌, లిజీ, అనూప్‌రూబెన్స్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది. అఖిల్‌ వేదికపై డ్యాన్సులు చేయడంతో పాటు పాట పాడి అభిమానుల్ని అలరించారు.