ఆరోపణలు చేసేటప్పుడు.. మన మెదళ్లను వాడాలి!

అక్షయ్ కుమార్‌ నటించిన ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలయ్యింది. కొద్దిరోజులకే  రూ.100కోట్లు కలెక్ట్‌ చేసిందని బాక్సాఫీస్‌ రికార్డులు చెబుతున్నాయి. ఇదంతా అబద్ధమనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఎక్కువైంది.
 
‘బాక్సాఫీస్‌ విశ్లేషకులు చెప్పేవన్నీ నిజమేనా?’ అని అక్షయ్ కుమార్‌ను కొందరు అడిగారు… “ఈ విషయంలో ఎవ్వరూ తప్పుడు రిపోర్టు ఇవ్వరని అక్షయ్ బదులిచ్చారు. ‘హౌస్‌ఫుల్‌ 4’ రాబట్టిన వసూళ్ల నంబర్లపై ట్విట్టర్‌లో ఫేక్‌ అని రావడంపై మీరు బాధపడ్డారా? అన్న ప్రశ్నకు అక్షయ్ మాట్లాడుతూ… ‘నేను బాధపడతానా? చాలా మంది చాలా విధాలుగా అనడం నేను వింటున్నా. కానీ వాటిపై నేను ఏవిధంగానూ స్పందించడం లేదు. ‘మీ పని మీరు చేసుకోండి’ అని నేను నా పద్ధతిలో చెప్పాను” అని అన్నారు.
 
‘బాక్సాఫీసు రిపోర్టు అంత నిర్ధిష్టంగా ఉంటుందా?’ అని ఓ విశ్లేషకుడు అక్షయ్ ని అడిగారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ…’ఇది ఒక్క హౌస్‌ఫుల్‌ 4 సినిమాకు మాత్రమే సంబంధించినది కాదు. మొత్తం ఇండిస్టీది. బాక్సాఫీస్‌ రిపోర్టులు చాలా కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది చిత్రసీమ విశ్వసనీయతకు సంబంధించినది కాబట్టి’ అని అన్నారు.
 
‘నిజంగా బాక్సాఫీస్‌ రిపోర్టులో తేడా వస్తే’..అన్నదానికి అక్షయ్ బదులిస్తూ.. ‘అందులో పెద్ద తేడా ఏమీ లేదు. నేనైతే ఏం చేస్తాను?.. ‘థియేటర్ల యజమానులతో మాట్లాడుతారా?’ అనే ప్రశ్నను అదేపనిగా నన్ను అడుగుతారు. ‘బాక్సాఫీస్‌ రిపోర్టులు నేను రాయను కదా!’ అని బదులిస్తాను. ‘వాళ్లు రాస్తున్నారు. అలా రిపోర్టులు రాసే నేను చెయ్యను కదా! మీడియా ముందుకు ఏదైతే వస్తుందో.. దానిపై నేను స్పందిస్తాను అంతే. అందులో కొత్తదనమే ఉండదు. సినిమా నిర్మాణంలో ఉండే ‘ఫ్యాక్స్‌ స్టార్‌ స్టూడియో’ కి విశ్వసనీయత ఉంది. ఇదొక కార్పొరేట్‌ కంపెనీ. మిలియన్ల డాలర్లలో వ్యాపారం జరుగుతుంది. దాన్ని వాళ్ళు తమ సొంత ట్విట్టర్‌ పేజీల్లో రాసుకుంటారు. అంతేగానీ ఎవ్వరూ తప్పుడు నివేదికలు ఇవ్వరు. అందుకని ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు..మన మెదళ్లను వాడాలి.” అని అన్నారు అక్షయ్.
 
సాయం చేయడంలో ముందుంటాడు
అక్షయ్ కుమార్‌ కేవలం ‘రీల్‌ హీరోనే కాదు.. రియల్‌ హీరో కూడా’ అంటూ అతడి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మనీష్‌ పాల్‌ రూపొందించిన ‘మూవీ మస్తీ’ అనే కొత్త షోకి అక్షయ్అతిధిగా వెళ్లాడు. ఈ షోలో అలీ ఆస్గర్‌తో పాటు మరో వ్యక్తి కలిసి స్కిట్‌ చేశారు. ఇందులో భాగంగా వాళ్లు.. ఓ రోప్‌ సహాయంతో కిందకు జారుతూ వచ్చి.. కింద ఉన్న నీటి తోట్టిలో నిలబడాలి. అయితే, స్కిట్‌ చేస్తున్న సమయంలో అలీ ఆస్గర్‌తో పాటు పట్టీలో ఉన్న మరో వ్యక్తి స్పృహ కోల్పోయి.. వెనక్కి పడబోతుంటే.. పక్కనే ఉన్న అలీ గుర్తించి అతడిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఊహించని పరిణామంతో కంగుతిన్న షో సిబ్బంది స్టేజ్‌పైకి పరుగెత్తుకు వస్తే.. వారితో పాటు అక్షయ్‌ కూడా స్టేజీ పైకి పరుగెత్తాడు. వెంటనే నీటి తొట్టి పైకెక్కి ఆ వ్యక్తిని తన కాళ్లపై పడుకోబెట్టుకొని.. కిందకు దించడంలో సహాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండటంతో… ‘అక్షయ్‌ అద్భుతమైన నటుడు.. దాన ధర్మాలు చేస్తాడు. జవాన్లను ఆదుకుంటాడు. అలాగే అందరికీ సాయం చేయడంలో ముందుంటాడు’ .. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అక్షయ్ 2008లో వచ్చిన ‘ఖత్రోన్‌ కే ఖిలాడి’ అనే ‘ఫియర్‌ ఫ్యాక్టర్‌’ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.