ధైర్యంగా అక్షయ్‌కుమార్‌ తొలి అడుగు !

అక్షయ్ కుమార్ ధైర్యం గా ఓ నిర్ణయం తీసుకున్నాడు.ప్రయోగాలు చేసే నటుల్లో ముందు వరుసలో ఉంటాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. లాక్ డౌన్ అమలవడంతో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడింది. కరోనా టైంలో ధైర్యంగా ముందుకొచ్చి ‘పోస్ట్ లాక్ డౌన్’ పేరుతో తీసిన ప్రకటన షూటింగ్ లో అక్షయ్ కుమార్ నటించాడు. కరోనాతో భయపడుతున్న వారికి యాడ్ ద్వారా అవగాహన కల్పించి శభాష్ అనిపించుకున్నాడు అక్షయ్.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా షూటింగ్స్ అంతంత మాత్రమే కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో అక్షయ్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తన కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఆగస్టులో తన కొత్తప్రాజెక్టు ‘బెల్ బాటమ్’ చిత్రాన్ని షురూ చేస్తున్నాడు. 80వ దశకం బ్యాక్ డ్రాప్ లో వాస్తవ కథాంశంతో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రానుంది.
 
లండన్‌లో ‘బెల్‌బాటమ్‌’ షూటింగ్
లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రభుత్వం షరతులతో కూడిన చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చినా వైరస్‌ ఉధృతి దృష్ట్యా అగ్రహీరోలు సెట్స్‌లో అడుగుపెట్టడానికి సుముఖంగా లేరు. ఇక విదేశీషూటింగ్‌లు అంటే ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ నుంచి అక్షయ్‌కుమార్‌ తొలి అడుగు వేయబోతున్నాడు. తన ‘బెల్‌బాటమ్‌’ షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించబోతున్నాడు. లండన్‌లో ఈ సినిమాను చిత్రీకరించబోతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత విదేశాల్లో షూటింగ్‌ జరుపుకోబోతున్న తొలి బాలీవుడ్‌ సినిమా ఇదే కావడం గమనార్హం. 1980 బ్యాక్‌డ్రాప్‌లో యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్షయ్‌కుమార్‌కు జోడీగా వాణీకపూర్‌ నటిస్తున్నది. హ్యుమా ఖురేషీ, లారాదత్తా కీలక పాత్రల్ని పోషించనున్నారు. రంజిత్‌ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం 2021 ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకురానున్నది.
 
‘హెలికాప్టర్ లో నాసిక్’ వివాదం
అక్షయ్ కుమార్ హెలికాప్డర్ పై నాసిక్ లో రిసార్టుకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఓ వైపు లాక్ డౌన్ కొనసాగుతుండగా..అక్షయ్ కుమార్ ఇటీవలే హెలికాప్టర్ లో నాసిక్ లోని రిసార్ట్స్ కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై అక్షయ్ అధికారి ప్రతినిధి స్పందించలేదు. ప్రత్యేక అనుమతి తీసుకుని నాసిక్ లో ఓ డాక్టర్ ను చూసేందుకు అక్షయ్ వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి భుజ్ బల్ మాట్లాడుతూ..”అక్షయ్ కుమార్ నాసిక్ కు వెళ్లినట్టు ఇవాళ పత్రికల్లో చదివాను. అక్షయ్ ఎక్కడికి వెళ్లాడు.. ఎలా వెళ్లొచ్చాడో నాకు తెలియదు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్షయ్ కు అనుమతివ్వడంపై మాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకుని, దర్యాప్తు చేయిస్తా”మని అన్నారు.