‘టాప్‌ 100’ లో ఒకే ఒక్కడు ‘సూపర్‌ కుమార్‌’

ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది అత్యధిక ఆదాయం ఉన్న ‘టాప్‌ 100’లో అక్షయ్‌ కుమార్‌ ఉన్నారు. మన దేశం నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న ఒకే ఒక్క సెలబ్రిటీ అక్షయ్‌ . నిజానికి గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అక్షయ్‌ సంపాదన దాదాపు 130 కోట్లు తగ్గింది. 2018 జూన్‌ నుంచి 2019 మే వరకు అక్షయ్‌ సంపాదన 490 కోట్లు. 2019 జూన్‌ నుంచి 2020 మే వరకూ ఆయన సంపాదన 366 కోట్లు. ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ గత ఏడాది విడుదల చేసిన ‘టాప్‌ 100’ సంపాదనపరులలో అక్షయ్‌ది 33వ స్థానం అయితే ఈ ఏడాది 52వ స్థానంలో నిలిచారు.
అక్షయ్‌ ఎక్కువ సంపాదించడానికి కారణం.. ఏడాదికి మినిమమ్‌ మూడు నాలుగు సినిమాలు చేయడమే. వాటితో పాటు వాణిజ్య ప్రకటనలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది కరోనా కారణంగా సినిమాలు ఆగిపోయిన నేపథ్యంలో అక్షయ్‌ సంపాదన తగ్గింది. అయితే, అక్షయ్‌ సంపాదించిన 366 కోట్లలో ‘ది ఎండ్‌’ వెబ్‌ సిరీస్‌ పారితోషికం 75 కోట్లు అని ఫోర్బ్స్‌ పేర్కొంది. ‘కరోనా సేవా కార్యక్రమాలకు అత్యధిక విరాళం ఇచ్చిన భారతీయ ప్రముఖులలో అక్షయ్‌ ఒకరు’ అని కూడా కొనియాడింది. అక్షయ్‌ దాదాపు 35 కోట్లు విరాళంగా ఇచ్చారు. అందుకే ఈ మధ్య చాలామంది ఆయన్ను ‘సూపర్‌ కుమార్‌’ అన్నారు. ఇప్పుడు ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ విడుదల చేసిన ‘టాప్‌ 100’లో స్థానం సాధించిన ఒకే ఒక్క భారతీయుడు అక్షయ్‌ కాబట్టి ‘సూపర్‌ కుమార్‌’ అనవచ్చు .
అగ్రస్ధానంలో కాస్మెటిక్‌ ప్రపంచ రారాణి కైలీ జెన్నర్‌!
జూన్‌ 2019 నుంచి మే 2020 వరకూ దాదాపు రూ .366 కోట్ల సంపాదనతో బాలీవుడ్‌ ఖిలాడీ ప్రపంచంలోనే అత్యంత రాబడి కలిగిన టాప్‌ 100 సెలబ్రిటీల సరసన చేరారు. కాస్మెటిక్‌ ప్రపంచ రారాణి కైలీ జెన్నర్‌ రూ 4453 కోట్ల ఆర్జనతో అగ్రస్ధానంలో నిలిచిన ఈ జాబితాలో అక్షయ్‌ కుమార్‌కు 52వ స్దానం లభించింది. అయితే ఈ ఏడాది బాలీవుడ్‌ సూపర్‌స్టార్ ‌అక్షయ్‌ సంపదపై కరోనా వైరస్‌ ప్రభావం పడిందని ఫోర్బ్స్‌ నివేదిక వెల్లడించింది. అమెజాన్‌ ప్రైమ్‌తో అక్షయ్‌ కుమార్‌ డిజిటల్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇచ్చారని .. అక్షయ్‌తో అమెజాన్‌ ప్రైమ్‌ డిజిటల్‌ సిరీస్‌ కోసం 75 కోట్లతో ఒప్పందం చేసుకుందని ఈ నివేదిక పేర్కొంది. ఇక ‘బెల్‌ బాటమ్’‌, ‘బచ్చన్‌ పాండే’ వంటి రానున్న సినిమాల కోసం 100 కోట్ల దాకా వసూలు చేశారని నివేదిక వెల్లడించింది.  ఫోర్బ్స్‌ టాప్‌ 10 అత్యధిక రాబడి కలిగిన సెలబ్రిటీల జాబితాలో వరుసగా కైలీ జెన్నర్‌, కన్యే వెస్ట్‌, రోజర్‌ ఫెదరర్‌, క్రిస్టియనో రొనాల్డో, లియోనెల్‌ మెస్పీ, టేలర్‌ పెర్రీ, నేమార్‌, హోవర్డ్‌ స్టెమ్‌, లెబ్రాన్‌ జేమ్స్‌, డ్వానే జాన్సన్‌లు చోటు సంపాదించారు.