ఒకేసారి ఆరు సినిమాల విడుదల తేదీలతో సంచలనం!

అక్షయ్‌ కుమార్‌.. మన దేశంలోనే అత్యంత వేగంగా సినిమాలు చేసే స్టార్‌ హీరో. అంతేకాదు బాలీవుడ్‌లో ఖాన్‌ త్రయాన్ని పక్కకి నెట్టి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగానూ అక్షయ్‌ నిలిచాడు. గతేడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి.. వాటితో .. దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్లని రాబట్టి రికార్డ్‌ సృష్టించిన అక్షయ్ మరిన్ని సంచలనాలకు సిద్ధమవుతున్నాడు .ఇప్పుడు ఏకంగా ఒకేసారి ఆరు సినిమాల విడుదల తేదీలను ప్రకటించాడు.
 
అందులో ‘సూర్యవంశీ’ మార్చి 27న .. అలాగే ‘లక్ష్మీబాంబ్‌’ని మే 11న.. ‘పృథ్వీరాజ్‌’ని నవంబర్‌ 13న విడుదల చేయనున్నారు. ఇక వచ్చే ఏడాదిలో ‘బచ్చన్‌ పాండే’ని జనవరి 22న, ‘అట్రాంగి రే’ని ఫిబ్రవరి 12న, ‘బెల్‌ బాటమ్‌’ని ఏప్రిల్‌ 2న విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. వీటిలో ‘సూర్యవంశీ’ చిత్రం రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో రూపొందుతుంది. యాక్షన్‌ కామెడీగా తెరకెక్కే ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ కథానాయికగా, రణ్‌వీర్‌ సింగ్‌, అజయ్ దేవగన్‌ గెస్ట్‌లుగా కనిపించ నున్నారు. సౌత్‌లో విజయం సాధించిన ‘కాంచన’ని హిందీలో అక్షయ్ హీరోగా దర్శకుడు రాఘవ లారెన్స్‌ ‘లక్ష్మీబాంబ్‌’ పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. హర్రర్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. చౌహాన్‌ రాజ్యానికి చెందిన చక్రవర్తి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితం ఆధారంగా చంద్రప్రకాష్‌ ద్వివేది దర్శకత్వంలో ‘పృథ్వీరాజ్‌’ చిత్రం రూపొందుతుంది. పృథ్వీరాజ్‌ చౌహాన్‌గా అక్షయ్ నటిస్తున్న ఈ చిత్రంలో మనుషి చిల్లర్‌ కథానాయికగా, సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ‘బచ్చన్‌ పాండే’ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. దీనికి ఫర్హాద్‌ సమ్‌జీ దర్శకత్వం వహిస్తున్నారు.సాజిద్‌ నడియడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్‌ కథానాయికగా నటిస్తుంది. తాజాగా ప్రకటించిన ‘ఆట్రంగి రే’ చిత్రం అక్షయ్‌, ధనుష్‌, సారా అలీ ఖాన్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందనుంది. ఆనంద్‌ ఎల్‌. రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 1 నుంచి సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇక ‘బెల్‌ బాటమ్‌’ చిత్రం రాహుల్‌ దొలాకియ దర్శకత్వంలో రూపొందుతుంది.
 
నా చిత్రాలతో దేశానికి సహకరిస్తా !
“నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నా. అందుకే రాజకీయాల్లోకి అడుగు పెట్టను’ అంటున్నాడు అక్షయ్‌ కుమార్‌. అక్షయ్‌ని విలేకరులు రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా.. ‘నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక.. నాకు నటన అంటే ఇష్టం. నా చిత్రాలతో దేశానికి సహకరించాలనుకుంటున్నాను. అదే నా ఉద్యోగం కూడా” అని చెప్పుకొచ్చాడు.
 
జాతీయ ఆవార్డు ఫంక‌్షన్‌లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి అక్షయ్‌ చెబుతూ…”నా మొదటి జాతీయ ఆవార్డు కార్యక్రమంలో ఓ అమ్మాయి నాతో మాట్లాడుతూ.. తను నాకు వీరాభిమాని అని చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయి నా పక్క సీటులోనే కుర్చుని ఉంది. అవార్డు గెలుచుకున్నందుకు అభినందలు కూడా చెప్పింది. అలాగే మీరు ఎన్ని సినిమాలు చేశారు అని అడిగితే .. దానికి నేను 137 అని సమాధానం ఇచ్చాను. అదే ప్రశ్న తనని అడిగాను.. అది తన మొదటి చిత్రం అని చెప్పింది.(తను కూడా జాతీయ ఆవార్డును గెలుచుకుంది) ఇక మీరే ఊహించుకోండి. నాకు ఎంతటి అవమానం ఎదురై ఉంటుందో” అని చమత్కరించాడు.
 
2016లో అక్షయ్‌ నటించిన థ్రిల్లర్‌ చిత్రం ‘రుస్తుం’కు 2017లో జాతీయ ఆవార్డును గెలుచుకున్నాడు. అక్షయ్‌ కుమార్‌ గత రెండు సంవత్సరాల నుంచి వివిధ సామాజిక కార్యాక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే.