రిలీజ్‌కి ముందే ఆన్‌లైన్‌లో అక్షయ్ “టాయిలెట్”

తాజాగా బాలీవుడ్ బడా మూవీ ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ రెండో భాగం పూర్తిగా ఆన్‌లైన్‌ లో బయటకు వచ్చేసింది.ఇటీవలి కాలంలో అన్నీ భాషల సినీ ఇండస్ట్రీలను వణికిస్తోన్న ప్రధాన సమస్య ఆన్‌లైన్‌ లీకేజీ. కొన్ని చిత్రాలు విడుదలైన రెండో రోజు అంతర్జాలంలో ప్రత్యక్షమవుతుంటే, మరికొన్ని చిత్రాలు విడుదల కాకుండానే ఆన్‌లైన్‌ లో దర్శనమిచ్చేస్తున్నాయి.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్న ఈ మూవీ ముందే ఆన్‌లైన్‌ లీకవడం చిత్ర బృందానికి కలవరపాటుకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ పథకాన్ని ప్రమోట్ చేస్తూ ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ మూవీ తెరకెక్కిన విషయం విదితమే. కాగా, ఈ మూవీ సెకండ్ పార్ట్ ఆన్‌లైన్‌ లో  లీకైన విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌ రెమో డిసౌజా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అక్షయ్ కుమార్, భూమి పద్నేకర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇంట్లో మరుగుదొడ్డి ఆవశ్యకతని ఓ ప్రేమ కథను ముడిపెడుతూ చూపించారు. ఇంట్లో మరుగుదొడ్డి లేని కుటుంబాల్లో మహిళలు ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నారనే విషయాన్ని దర్శకుడు నారాయణ్‌ సింగ్‌ వివరించే ప్రయత్నం చేశారు. కానీ విడుదలకు ముందే సినిమా  ఇలా ఆన్‌లైన్‌ లో ప్రత్యక్షమవ్వడంతో చిత్ర బృందాన్ని షాక్ కు గురిచేసినట్లైంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా చిత్ర పరిశ్రమను లీకేజీ సమస్య మాత్రం వదలడం లేదని ఈ ఘటనతో మరోమారు రుజువైంది.