సరదా సరదాగా….‘అల.. వైకుంఠ‌పుర‌ములో..’ చిత్ర సమీక్ష

సినీవినోదం రేటింగ్ : 3/5

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, గీతాఆర్ట్స్‌ పతాకాలపై త‌్రివిక్ర‌మ్‌ రచన దర్శకత్వం లో అల్లు అర‌వింద్, ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.

కధాంశం… బంటు (అల్లు అర్జున్‌), రాజ్‌ మనోహర్‌ (సుశాంత్‌)లు ఒకే ఆసుపత్రిలో ఒకే సమయానికి పుడతారు. అయితే, బంటు ఫ్యామిలీ మిడిల్‌ క్లాస్‌.. రాజ్‌ మనోహర్‌ది బాగా ఉన్నతమైన కుటుంబం. బంటు వాళ్ల నాన్న వాల్మీకి (మురళీ శర్మ) వీ ఏఆర్కే కంపెనీ అధినేత రామచంద్ర రావు (జయరామ్‌) దగ్గర పనిచేస్తుంటాడు. రామచంద్ర రావు, యశ్‌(టబు)ల కుమారుడే రాజ్‌ మనోహర్‌. అయితే మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కావడం, తండ్రి వాల్మీకి పెట్టే ఓ రకమైన టార్చర్‌తో ఇబ్బందులు పడతాడు. అయితే ఈ క్రమంలోనే అమూల్య (పూజా హెగ్డే)తో బంటుకు పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. కాగా అప్పలనాయడు (సముద్రఖని) తన కొడుకు పైడితల్లి కోసం వీఏఆర్కే కంపెనీలో షేర్స్‌ కావాలని గొడవపెట్టుకుంటాడు. ఈ తరుణంలో రామచంద్ర రావుపై హత్యాయత్నం జరుగుతుంది. అయితే రామచంద్రరావును కాపాడిన బంటుకు ఓ షాకింగ్‌ నిజం తెలుస్తుంది. దీంతో రామచంద్రరావును కాపాడేందుకు వైకుంఠపురములో అనే బంగ్లాలోకి దిగుతాడు. అయితే చివరకు ఏం జరిగింది? అప్పలనాయుడు కుటుంబం నుంచి వీఆర్కే కంపెనీని, రామచంద్రరావు కుటుంబాన్ని కాపాడాడా? ఈ కథలోకి కాశీ(హర్షవర్దన్‌), సీత (సునీల్‌), పెద్దాయన (సచిన్‌), శేఖర్‌ (నవదీప్‌), ఎస్పీ(రాజేంద్ర ప్రసాద్‌) నివేదా పేతురాజ్‌లు ఎందుకు వస్తారు ? ఆస్పత్రిలో బంటుకు తెలిసిన నిజం ఏమిటి? రామచంద్రరావు అంటే వాల్మీకి కి ఎందుకు పడదు? బంటు రాజు ఎలా అయ్యాడు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి ….

విశ్లేషణ… ‘అజ్ఞాతవాసి ‘ చేదు జ్ఞాపకాలతో త్రివిక్రమ్.. ‘ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఘన పరాజయంతో  అల్లు అర్జున్‌ కలిసి చేసిన సినిమా ఇది. ఇద్దరికీ పెద్ద విజయం అత్యవసరం. అయితే, చాలా ఏళ్ల క్రితం వచ్చిన ఎన్టీఆర్ ‘ఇంటిగుట్టు’ సినిమా ఆధారంగా ఈ సినిమా చేసారు. కథే కృత్రిమంగా అనిపించటంతో చెప్పుకోదగ్గ డెప్త్ కనిపించలేదు.డైలాగులు ఎంత బాగున్నాయో..సన్నివేశాల్లో అంత బలం కనబడదు. ఈ రోజుల్లో ఇలా పిల్లల మార్పిడి మీద కథతో త్రివిక్రమ్ వంటి టాలెంట్ ఉన్న దర్శకుడు సినిమా చెయ్యడం ఏంటో? త్రివిక్ర‌మ్ దీన్ని రిచ్‌గా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. కథలో ఎలాంటి కొత్త దనం లేనప్పటికీ త్రివిక్రమ్‌పై నమ్మకంతో సినిమాకు అంగీకరించిన బన్నికి హ్యాట్సాఫ్‌ చెప్పాలి. అతని నమ్మకాన్ని త్రివిక్రమ్‌ చాలావరకు నిలుపుకున్నాడు. కథనంలో మాత్రం ప్రేక్షకుడు కదలకుండా కూర్చోబెట్టాడు .త్రివిక్రమ్‌ మార్క్‌​ టేకింగ్‌.. అల్లు అర్జున్‌ కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌, డ్యాన్స్‌లు, పాటలు.. సింపుల్‌గా చెప్పాలంటే- సినిమా సరదాగా, సాఫీగా సాగుతూ వెళ్తుంది.సెకండాఫ్ లో అసలు విషయం ఏమీ లేకపోవటం లాగిన‌ట్లు అనిపిస్తుంది.సెకండ్ హాఫ్ లో ఇంట్లో వచ్చే సన్నివేశాలను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. అలాగే సినిమా ఓపెనింగ్ నే మంచి ఎమోషనల్ గా ఓపెన్ చేసిన దర్శకుడు.. దాన్ని కంటిన్యూ చేయలేదు. లవ్ స్టోరీ కూడా ఇంకా ఆసక్తికరంగా ఉంటే బాగుండేది. విలన్ కు హీరోకు మధ్య కాంప్లిక్ట్ సరిగ్గా లేకపోవటం ఒక మైనస్.సినిమా నిండా పెద్ద పెద్ద ఆర్టిస్టులు వున్నా కానీ వారి స్థాయికి న్యాయం చేయలేదనేది ఓ వెలితి.
 

నటీనటులు… అల్లు అర్జున్‌ మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుడిగా.. నిజం తెలిసిన‌ప్పుడు అల వైకుంఠ‌పుర‌ములో త‌న స‌మ‌స్య‌ల‌ను తీర్చుకుంటూ.. ఎలా ముందుకెళ్లాడ‌నే క్యారెక్ట‌ర్‌లో బ‌న్నీ చ‌క్క‌గా నటించాడు . తండ్రి సైకోయిజంతో సతమతమవుతూ, ఏం చేయలేని స్థితిలో ఉండే ఓ సామాన్య కొడుకుగా అల్లు అర్జున్‌ జీవించేశాడు.ఇక బ‌న్నీ డాన్సుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అమూల్య రోల్‌ లో పూజా హెగ్డే ని కేవలం గ్లామర్ కే ఉపయోగించుకున్నారు.. సుశాంత్, అత‌ని ల‌వ‌ర్‌గా నివేదా పేతురాజ్ చ‌క్క‌గా న‌టించారు. ముర‌ళీశ‌ర్మ చ‌క్క‌టి పాత్ర చేశారు. సంద‌ర్భానుసారం సముద్ర‌ఖ‌ని, అజ‌య్ విల‌నిజం బావుంది. జ‌యరాం నటన భావోద్వేగాల పరంగా హైలైట్‌గా నిలిచింది.ట‌బు, సచిన్‌ ఖేడేకర్‌, న‌వ‌దీప్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, సునీల్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, సముద్ర‌ఖ‌ని, అజ‌య్ వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. మరోసారి కలిసిరాని పాత్రలో సునీల్ కనిపించాడు.

 
సాంకేతికం… యాక్షన్ కొరియోగ్రఫీ కూడా డిఫరెంట్ గా చేసారు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌. ఈ సినిమాలో కొత్తగా, వైవిధ్యంగా, స్టైల్‌గా ఫైట్‌ చేశారు. కొన్ని ఫైట్‌ సీన్లయితే వావ్‌ అనిపించేలా ఉన్నాయి. వినోద్‌ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. సినిమాను చాలా రిచ్‌గా, హీరోహీరోయిన్లను అందంగా చూపించారు .
త‌మ‌న్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌. పాటలు సూపర్ హిట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూపర్.
‘రాములో రాముల‌’,సామ‌జ‌వ‌రగ‌మ‌న‌, ‘బుట్ట‌బొమ్మ’ సాంగ్స్ విన‌డానికే కాదు.. చూడ‌టానికి కూడా చక్కగా ఉన్నాయి… పాటలు సినిమాలో ఇరికిచ్చినట్లు కాకుండా సందర్బానుసారంగా వస్తాయి. ముఖ్యంగా ‘సామజవరగమన’ పాటని ఇంకాస్త బాగా తీస్తే బాగుండుననిపించింది.ఇక త్రివిక్రమ్‌ సినిమాల్లోని పాటల్లో సాహిత్యం ప్రత్యేకంగా ఉంటుంది.. పాటల రచయితలు తమ సాహిత్యంతో సినిమా స్థాయిని మరింత పెంచారు. ఎడిటింగ్‌పై మరింత దృష్టిపెట్టాల్సింది.నిర్మాతలు పెట్టిన ఖర్చు అడుగడుగునా కనిపించింది – రాజేష్