అలీ హీరోగా న‌టించిన ‘లాయ‌ర్ విశ్వ‌నాథ్‌’ టీజర్ విడుద‌ల‌ !

అలీ క‌థానాయ‌కుడిగా న‌టించిన 53వ చిత్రం ‘లాయ‌ర్ విశ్వ‌నాథ్‌’. ర‌వికుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ మూకాంబిక ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  బాల నాగేశ్వ‌ర రావు వ‌ర‌ద ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. వ‌ర‌ద నాగేశ్వ‌ర‌రావు, సూర్య వంత‌రం, ఎం.ఎన్‌.వి.సుధాక‌ర్ నిర్మాత‌లు. ఈ చిత్రం టీజర్‌ను ప్ర‌ముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుద‌ల చేశారు.
“నాకు ఎనిమిది ఏళ్ల వ‌య‌సు ఉన్నప్పుడు నేను పరిశ్రమలోకి అడుగు పెట్టాను. ఇప్పుడు దాదాపు అదే వయసులో నా కూతురు కూడా ఈ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం హ్యాపీగా ఉంది..అని  అలీ మాట్లాడుతూ అన్నారు . “మన దేశంలో ప్రస్తుతం నడుస్తున్న ఒక కొత్త పాయింట్ తీసుకుని ‌ మంచి సినిమాని తెరకెక్కించారు దర్శకుడు బాల నాగేశ్వరరావు. ఫిబ్ర‌వ‌రి 26 న విడుదల అవుతున్న సినిమా చూసి  కొత్త వారిని ప్రోత్సహించాలి” అని అన్నారు.
అలీ కూతురు జుబెరియా మాట్లాడుతూ – “ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అంకుల్ కి చాలా థాంక్స్.  ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేశారు. నా మొదటి సినిమాగా ఈ మూవీ ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతుంది” అన్నారు.
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ – ‘‘అలీ గారి లాంటి ఒక గొప్ప నటుడు ఇలాంటి ఒక మంచి సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఉన్న ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
దర్శక నిర్మాత బాల నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ – ‘‘నేను ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ గా పని చేయలేదు. ఫ‌స్ట్ టైం ఈ సినిమాతోనే మెగాఫోన్ పట్టుకోవడం జరిగింది. అలీ గారిని కలిసి ఈ కథ చెప్పగానే ఆయన ఇచ్చిన ప్రోత్సాహం  వల్లే నేను ఈ రోజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాను. ఆయనతో పాటు వారి కూతురు కూడా ఈ సినిమాలో నటించడం గొప్ప విషయం. జుబేరియా చాలా బాగా న‌టించింది.  లాయర్ విశ్వనాథ్ ఒక బలమైన కథతో తెరకెక్కించిన చిత్రం. శుభలేఖ సుధాకర్, జయలలిత, గిరి లాంటి ఎంతో మంది సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో యాక్ట్ చేయడం జరిగింది.  మాటలు, పాటలు చాలా బాగా కుదిరాయి. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.