ఆ విధంగా చాలా కోరికలు తీరాయి !

“ఆ విధంగా చాలా కోరికలు తీరాయి”… అని అంటోంది అలియాభట్‌ . ప్రేమజంట రణభీర్‌కపూర్‌, అలియాభట్‌ తాము బలంగా నమ్మే సెంటిమెంట్స్‌ గురించి ఇటీవల చెప్పుకొచ్చారు. ఓ సోషల్‌మీడియా వేదికపై సోనమ్‌కపూర్‌ అడిగిన ప్రశ్నలకు రణభీర్‌కపూర్‌, అలియాభట్‌ ఇలా చెప్పారు… “ఎనిమిది సంఖ్యను తన జీవితంలో ఎంతో సెంటిమెంట్‌గా భావిస్తానని, ఆ సంఖ్య రూపం తనలో పాజిటివ్‌ ఎనర్జీని కలిగిస్తుంద”ని అన్నాడు రణభీర్‌కపూర్‌.
తన సెంటిమెంట్స్‌ గురించి అలియాభట్‌ చెబుతూ…‘నాకేదైనా మంచి జరగాలనుకుంటే…దానికిసంబంధించిన సన్నివేశాల్ని అద్దంలో అభినయించి చూసుకుంటూ…కోరుకున్నది నా చెంత ఉన్నట్లు ఊహించుకుంటూ నటిస్తాను. ఆ విధంగా చాలా కోరికలు తీరాయి’ అని చెప్పింది. రణభీర్‌కపూర్‌, అలియాభట్‌ ‘లక్కీ ఛార్మ్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసిన వీడియోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
 
తెలుగువారి మనస్సులు గెలుచుకోవాలని
ఆలియా‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ పాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. పాత్ర విషయం పక్కన పెడితే భాషే ఆమెని ఇబ్బందిపెడుతోందట. భాష తెలియకుండా భావం పలికించడం కష్టం కనుక… తెలుగు నేర్చుకోవడానికి తీవ్రం గా ప్రయత్నిస్తోందట. తక్కువ సమయంలో తెలుగు నేర్చుకోవడం కష్టంగానే ఉంది కానీ, ఇష్టంతో చేస్తోంది. తన మొదటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనస్సు గెలుచుకోవాలంటే భాష వస్తే మంచిదని అనుకుంటోంది. అనుకోవడమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా పెడుతోంది. తెలుగులో పదేళ్లకు పైగా సినిమాలు చేస్తూ.. స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్న వారికీ తెలుగు రాదు. కానీ తొలి చిత్రంతోనే తెలుగువారి మనస్సులు గెలుచుకోవాలని తాపత్రయపడుతున్న ఆలియాని అభినందించాలి.
 
మాఫియా డాన్‌ గంగూబాయిగా
అలియాభట్‌ సంజయ్ లీలాభన్సాలీ ‘ఇన్‌షాల్లా’లో కథానాయికగా ఎంపికైన విషయం విదితమే. ఈ ప్రాజెక్ట్‌ నుంచి సల్మాన్‌ తప్పుకున్నారు. అయితే ‘ఇన్‌షాల్లా’లో అలియా కూడా నటించడం లేదట. పూర్తిగా మరో స్టార్‌ కాస్టింగ్‌తో ఈ సినిమా ఉంటుందట. ఈ నేపథ్యంలో మరో భన్సాలీ సినిమాలో అలియా హీరోయిన్‌గా నటించబోతుందట. ముంబయి డాన్‌గా పాపులర్‌ అయిన ‘మాఫియా క్వీన్‌’ గంగూబాయి జీవితం ఆధారంగా రూపొందించే ‘గంగూబాయి’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ని అలియా పోషించనున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రాని అనుకున్నా… ఆమె ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీకావడం తో ఆ స్థానంలో అలియాని ఫైనల్‌ చేశారు. ముంబయి రెడ్‌లైట్‌ ఏరియా కామాటి పురాలో వేశ్యగృహాలు నడుపుతూ ‘లేడీ మాఫియా డాన్‌’గా వెలిగిన గంగూబాయి జీవిత కధతో తెరకెక్కించనున్నారు…ఎస్‌ హుసేన్‌ జైదియాల్త్‌ రాసిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబాయి’ అనే బుక్‌ ఆధారంగా ఈ సినిమాచేస్తున్నారు. ప్రస్తుతం అలియా తెలుగులో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో నటిస్తుంది. అలాగే హిందీలో ‘తఖ్త్,’బ్రహ్మస్త్ర’,’సడక్‌ 2’లో బిజీగా ఉంది. ‘ఐఫా’ వేడుకలో ‘రాజీ’ చిత్రానికిగానూ ఉత్తమ నటిగా అవార్డునందుకుంది.