ఆ ప్రేమే నన్ను నడిపిస్తుందనుకుంటా !

అలియా భట్‌… ‘సినిమాపై నాకున్న ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది. వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో పనిచేస్తాను’ అని అంటోంది అలియా భట్‌. గతేడాది ‘రాజీ’ చిత్రంలో నటించి మంచి విజయాన్ని, తన నటనకు మంచి ప్రశంసలనూ అందుకుంది. అలాగే ‘వెల్‌కమ్‌ టూ న్యూయార్క్‌’, ‘జీరో’ చిత్రాల్లో గెస్ట్‌ పాత్రల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘కళంక్‌’ చిత్రంలోని తన పార్ట్‌ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 2018 ఛాలెంజింగ్‌గా సాగిందంటూ అలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది…
”కళంక్‌’ చిత్రీకరణతోపాటు, 2018 కూడా పూర్తయ్యింది. ఇది నా లైఫ్‌లో అత్యంత సవాలుతో కూడిన ఫేజ్‌. ఏడాదంతా పని..పని..పని అంటూ బిజీగా గడిపాను. ఒకానొక సమయంలో ఇలా చేసుకుంటూ పోతే ఎక్కువ రోజులు పనిచేయలేనని అర్థమైంది. కానీ సినిమాపై ఉన్న ప్రేమే నన్ను ఇలా నడిపిస్తుందనుకుంటున్నా. ప్రతి సారి నాలో ఎనర్జీ, ఉత్సాహం వచ్చింది. ఈ ఏడాది నేను చాలా నేర్చుకున్నా. వచ్చే ఏడాది ‘హాలీడే టైమ్‌’ అని భావించడం లేదు. ఇప్పుడే నా కెరీర్‌ ఆరంభమైంది. మరింత ఉత్సాహంతో, మరింత ఎనర్జీతో పనిచేస్తా’ అని పేర్కొంది. అలియా పెట్టిన ఈ పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రస్తుతం ‘కళంక్‌’తోపాటు‘గల్లీబాయ్’, ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాల్లో అలియా నటిస్తోంది.
అదేదో ఘనకార్యానికి నిదర్శనం కాదు !
రిలేషన్‌షిప్‌ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే.. అంతేతప్ప అదేదో ఘనకార్యానికి నిదర్శనం కాదని అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌. గత కొంతకాలంగా చాక్‌లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో ఈ అమ్మడు రిలేషన్‌లో ఉన్నారంటూ బీ-టౌన్‌లో వార్తలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా డిన్నర్‌ డేట్లు, ఫ్యామిలీ గెట్‌ టుగెదర్‌లతో భట్‌, కపూర్‌ కుటుంబాలు చేస్తున్న హంగామా ఇటువంటి వార్తలను నిజం చేస్తోంది కూడా. అయితే ఇంతవరకు ఈ విషయం గురించి అలియా భట్‌ మాత్రం స్పందించలేదు.
 
ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అలియా భట్‌…. ‘ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉండటం అనేది నా జీవితంలో ఒక ముఖ్యమైన అంశం మాత్రమే. అంతేతప్ప ఇలాంటి వాటి వల్ల నేనేదో సాధించినట్టైతే కాదు. అయితే ఒకరితో అనుబంధంలో ఉండటం మాత్రం ఎంతో అందంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన విషయాలను ఓ మూలన జాగ్రత్తగా దాచి ఉంచాలనుకుంటున్నాను. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం నాకంతగా ఇష్టం ఉండదు. ఒకవేళ నా జీవితంలో నాకెంతో ప్రియమైన ఓ పెంపుడు పిల్లి ఉంటే దానిని నేను రక్షించుకోవాలి గానీ దాని గురించి కూడా సోషల్‌ మీడియాలో చర్చించాలా’ అంటూ వ్యాఖ్యానించారు.
 
ఇదిలా ఉండగా… అలియా అంటే ప్రత్యేక అభిమానం కనబరిచే నీతూ కపూర్‌(రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి) నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ… సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటో ‘రాలియా’ అభిమానులను ఆకట్టుకుంటోంది. రణ్‌బీర్‌ కుటుంబంతో కలిసి అలియా న్యూఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఈ ఫొటోకు లక్షల్లో లైకులు వస్తున్నాయి.