నిత్యం సంగీతంలోనే బతకాలనేంత ఇష్టం !

అలియాభట్‌… ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో బాలీవుడ్‌ తెరకి పరిచయమైన అలియాభట్‌ సినిమా, సినిమాకు ఓ మెట్టు ఎక్కుతోంది. ఆలియా భట్‌ ఏ పాత్ర ఇచ్చిన అలవోకగా మెప్పించగల నటి. ఈమెను మనకు నటిగానే తెలుసు. ఆమెకు మరో కోణంలో ప్రత్యేకమైన అభిరుచి ఉంది. ఆలియా భట్‌కు సంగీతం అంటే ప్రాణమట. ఎంతలా అంటే సంగీతంలోనే నిత్యం బతకాలనేంతగా ఇష్టమట. ఈ విషయాన్ని ‘గల్లీబాయ్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్నప్పుడు ఆలియా వెల్లడించింది. ఆ వేడుకలో రెడ్‌ కార్పెట్‌పై మెరిసిన అనంతరం… నటిగా కాకుండా తనకు ఇష్టమైన రంగం గురించి వివరించింది. మ్యూజిక్‌ అంటే అమితమైన ఇష్టంతోనే ‘గల్లీబాయ్’ చిత్రంలో చేసేందుకు అంగీకరించానని, లేకపోతే ఈ చిత్రం సమయంలోనే మరో భారీ సినిమాలో చేసే అవకాశం వచ్చినా వదులుకున్నానని పేర్కొంది. ఇప్పుడంతా తనను నటిగా గుర్తించారని, ఆ వృత్తిని వదులుకోలేక… ఇష్టమైన సంగీతం తో ముందుకెళ్లేందుకు సమయం చాలక సతమతమవుతున్నానని వివరించింది. నటిని కాకపోతే తాను కచ్చితంగా సంగీత రంగంలో రాణించేదాన్ని అని తెలిపింది. అందుకే నిత్యం పాటలు వింటూనే ఉంటానని, కొత్త ట్యూన్స్‌ ఎక్కడ వినిపించినా వెంటనే వాటి సౌండ్‌ తన చెవుల్లో పడిపోయే వరకూ నిద్రపోనని అన్నది ఆలియా.
ఆ క్వాలిటీస్‌ తో నిర్మాతగా మారుతోంది !
అలియాభట్‌ తను ఎంచుకునే కథలు విమర్శకుల ప్రశంసలతోపాటు కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. నటిగా, గాయనిగా నిరూపించుకున్న ఆమె ఇప్పుడు నిర్మాతగా మారబోతోంది. పరిశ్రమలో అడుగుపెట్టిన ఏడేళ్లల్లో 15కు పైగా సినిమాల్లో నటించారు. తన ఎదుగుదలకు కారణం సినిమా మీదున్న ప్యాషన్‌, డెడికేషన్‌, స్టోరీ సెలెక్షన్‌ అని ఆమె తరచూ చెబుతుంటారు. తనలో ఉన్న ఈ క్వాలిటీస్‌ అన్నీ అలియాను నిర్మాతగా మార్చాయని సన్నిహితులు చెబుతున్నారు. అలియా తన నిర్మాణ సంస్థకు ‘ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్’ అనే పేరు పెట్టిందట. దీనితోపాటు ఓ కండిషన్‌ కూడా పెట్టారామె. తన బ్యానర్‌లో తను చూడగలిగే చిత్రాలను మాత్రమే ప్రొడ్యూస్‌ చేయాలనుకుంటుందట. ‘ఈ కండీషన్‌ మాత్రం తప్పకుండా అమలవుతుంది’ అని గట్టిగా చెబుతోంది అలియాభట్‌. ‘లవ్‌నెస్ట్‌’ పేరుతో తన లవర్ రణబీర్‌ కపూర్‌ పేరుతో ఉన్న అపార్ట్‌మెంట్‌ లో ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టనుందని సమాచారం.