ఆ సినిమాతో ‘రాజీ’ లేని ‘కలెక్షన్ స్టార్’గా మారింది !

 ‘రాజీ’తో అలియా స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు, ‘బాలీవుడ్ కలెక్షన్ స్టార్’ అని రుజువు చేసింది. మహేష్‌భట్ కూతురిగా సినీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ గుర్తింపు తెచ్చుకొని అనతి కాలంలోనే స్టార్ రేంజ్‌కి ఎదిగింది అలియాభట్. అలియా ప్రధాన పాత్రలో ఈ మధ్యే వచ్చిన ‘రాజీ’తో  ఇప్పటి వరకు ఈ అమ్మడిపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా మారిపోయాయి. బాలీవుడ్ బడా దర్శక నిర్మాతలకు అలియా ఇప్పుడు నమ్మదగిన స్టార్ అయిపోయింది. దీంతో అలియాతో భారీ బడ్జెట్‌లో సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారు.
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో వెండి తెర ప్రవేశం చేసింది అలియా. ఈ చిత్రంలో వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకులు. అయితే ఈ చిత్రం అలియాకు ఆశించినంత ప్రయోజనాన్ని ఇవ్వలేదు. వెండి తెరపై కనిపించడం కోసం 13 కిలోల బరువు తగ్గినప్పటికీ ‘స్టార్ కిడ్’ అనే ఎక్కువ మంది ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే గడిచిన సంవత్సరాల్లో అలియా ఆ లెక్కల్ని మార్చేసింది. తన నటనతోనే కాకుండా, తన ఎంచుకునే పాత్రలతో ప్రేక్షకులతో ‘భళా’ అనిపించుకుంది.
 ‘హైవే’, ‘హంప్టీ షర్మన్ కి దుల్హనియా’, ‘బద్రినాథ్ కి దుల్హనియా’, ‘డియర్ జిందగీ’, ‘టూ స్టేట్స్’, ‘ఉడ్తా పంజాబ్’ లాంటి చిత్రాలతో బాక్సాఫీస్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ముఖ్యంగా అలియా ప్రధానపాత్ర లో వచ్చిన ‘కపూర్ అండ్ సన్స్’ చిత్రం మరింత స్టార్‌డమ్ తీసుకువచ్చింది. గ్లామర్‌, డీ-గ్లామర్‌లతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోతూ సినీ పరిశ్రమలో సత్తా చాటుతూ దర్శకుల నమ్మకంతో పాటు నిర్మాతలకు కాసులు కురిపించే తారగా ఎదిగింది

 

కపూర్‌ ఫ్యామిలీ మొత్తం అలియాకు ఫిదా !
రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రి, సీనియర్‌ నటుడు రిషీ కపూర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ రణ్‌బీర్‌ – అలియా అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. ….‘ఎంతో ప్రతిభావంతులైన భట్‌ కుటుంబ సభ్యులందరితో కలిసి పనిచేశాను. మహేష్‌ భట్‌, ముఖేష్‌ భట్‌, రాబిన్‌, పూర్ణిమా, సోనీ, ఇమ్రాన్‌ హష్మీ, అలియా భట్‌ మీ అందరికీ కృతఙ్ఞతలంటూ’ …. ఆయన ట్వీట్‌ చేశారు.

కపూర్‌ అండ్‌ సన్స్‌ సినిమాలో రిషి కపూర్‌తో కలిసి నటించిన అలియా…. ‘మనం మరోసారి కలిసి నటిస్తామని నేను ఆశిస్తున్నాను. కుదిరితే ఈసారి అందరం కలిసి..’  అంటూ ట్వీట్‌ చేశారు. అయితే బ్రహ్మాస్త్ర సినిమాలో నటించిన సమయంలో రణ్‌బీర్‌ కపూర్‌- అలియా భట్‌ ప్రేమలో పడ్డారని వదంతులు ప్రచారం అయ్యాయి. సోనమ్‌ కపూర్‌ పెళ్లికి వీరిద్దరూ జంటగా హాజరవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. పలు సందర్భాల్లో రణ్‌బీర్‌ తల్లి నీతూ కపూర్‌ కూడా అలియాపై తనకు ఉన్న ఇష్టాన్ని తెలపడం.. ఇప్పుడు రిషీ కపూర్‌ కూడా భట్‌ ఫ్యామిలీని పొగడడం చూస్తుంటే.. ఈ కపూర్‌ ఫ్యామిలీ మొత్తం అలియాకు ఫిదా అయ్యారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.