సగంలోనే దారి తప్పాడు ….. ‘నా పేరు సూర్య’ చిత్ర సమీక్ష

                                 సినీవినోదం రేటింగ్ : 2.5 / 5
 శ్రీ రామ‌ల‌క్ష్మి సినీ క్రియేష‌న్స్‌ పతాకం పై వ‌క్కంతం వంశీ రచన దర్శకత్వం లో ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు
సూర్య (అల్లు అర్జున్‌) నిజాయ‌తీ గ‌ల సైనికుడు. దేశం కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికి కూడా వెనుకాడ‌డు. ఎదుటివారు చిన్న త‌ప్పు చేశార‌ని తెలిసినా త‌ట్టుకోలేడు. హెడ్ క్వార్ట‌ర్స్ నుంచి బోర్డ‌ర్‌కి వెళ్లాల‌నేదే సూర్యలక్ష్యం. అందుకోసం క‌ష్ట‌ప‌డుతుంటాడు. కానీ సైనిక నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఒక‌సారి ఓ ఉగ్ర‌వాదిని కాల్చి చంపేస్తాడు. అదే అద‌నుగా తీసుకున్న క‌ల్న‌ల్ (బోమ‌న్ ఇరాని) అత‌న్ని ఆర్మీ నుంచి బ‌య‌టికి పంపించేస్తాడు. అందుకు అంగీక‌రించ‌ని సూర్య త‌న గాడ్ ఫాద‌ర్ (రావు ర‌మేశ్‌)ను సంప్ర‌దిస్తాడు. అంద‌రూ క‌లిసి వైజాగ్‌లో ఉన్న ర‌ఘురామ‌కృష్ణంరాజు (అర్జున్‌) అనే సైక్రియాట్రిస్ట్ ద‌గ్గ‌రకు వెళ్లి ఓ స‌ర్టిఫికెట్ తీసుకుని ర‌మ్మ‌ని చెబుతారు. దాంతో వైజాగ్‌కి వ‌స్తాడు సూర్య. అక్కడ వ‌ర్ష (అను ఇమ్మాన్యుయేల్‌) తార‌స‌ప‌డుతుంది. ఆమెతో సూర్య ప్రేమ‌లో ప‌డ‌తాడు. అతి కోపంతో తిరిగే సూర్య 21 రోజుల్లోనే మారాడా? అత‌న్ని ర‌ఘురామ‌కృష్ణంరాజు ఎలా మార్చాడా? అత‌నికి, సూర్య‌కి ఉన్న సంబంధం ఏంటి? సూర్య త‌న గోల్‌ని రీచ్ అయ్యాడా? అనేది సినిమాలో చూడాలి …..
రచయితగా ‘రేసు గుర్రం, టెంపర్’ వంటి చిత్రాలతో తానేంటో నిరూపించుకున్న వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి ప్రయత్నంలో బలమైన కథను రాసుకున్న దర్శకుడు వక్కంతం వంశీ.. దానిని తెరపై మాత్రం అంత ఆసక్తికరంగా మలచలేకపోయాడు. పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో కొత్తగా కనిపించిన అల్లు అర్జున్, మంచి యాక్షన్ కంటెంట్, దేశభక్తితో కూడిన సందేశం ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలతో ఇంటర్వెల్ వరకు సినిమాను బాగానే నడిపి…. సెకండాఫ్లో మాత్రం ట్రాక్ మార్చి నెమ్మదైన కథనంతో, బలహీనమైన సన్నివేశాలతో చప్పబడిపోయి బోర్ కొట్టించారు. ఇంటర్వెల్ సమయానికి హీరో తనని తాను మార్చుకుని, చివరికి తన లక్ష్యమైన ఇండియా సరిహద్దులకి ఎలా చేరుకుంటాడో చూడాలి… అనే ఆసక్తి క్రియేట్ చేసిన దర్శకుడు ప్రేక్షకుడు ఇంప్రెస్ అయ్యే విధంగా దాన్ని నడపలేకపోవడంతో ద్వితీయార్థం దెబ్బతింది. ప్రేమకథను కూడా అంత ఆసక్తికరంగా మలచలేదు. ప్రతినాయకుడి పాత్రలో బలం లేకపోవడం, హీరోయిన్ పాత్ర కథలో పెద్దగా ఇన్వాల్వ్ కాకపోవడం, కామెడీ, రొమాన్స్, మంచి పాటలు వంటి కమర్షియల్ అంశాలు లేకపోవడం ద్వితీయార్థాన్ని సాదా సీదాగా మిగిల్చేశాయి. ప్రీ క్లైమాక్స్‌ వచ్చే సరికి హీరో, విలన్‌ క్యారెక్టర్స్‌ మొత్తం నీరుగారిపోయాయి.క్లైమాక్స్‌ విషయంలోనూ ప్రేక్షకుడికి అసంతృప్తే మిగిలింది.
అల్లు అర్జున్‌ గతంలో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించాడు. యాంగ్రీ యంగ్‌మెన్‌గా మంచి నటన కనబరిచాడు. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని యువకుడిగా.. అదే సమయంలో దేశం కోసం ప్రాణమిచ్చే దేశ భక్తుడి షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లోనూ,రొమాంటిక్‌ సీన్స్‌ లోనూ తన మార్క్‌ చూపించాడు. బన్నీ స్టైలిష్‌ డాన్స్‌ మూమెంట్స్‌ సినిమాకు హైలెట్‌ గా నిలిచాయి. ఇక హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ పాత్ర గ్లామర్‌, పాటలకు మాత్రమే పరిమితం. ఆమె పాత్రలో పెర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్‌ లేదు. ఇక సీనియర్‌ హీరో అర్జున్‌ సైకాలజీ ప్రొఫెసర్‌గా బాగా సరిపోయారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో, ఇంటర్వెల్‌ ముందు బన్నితో చేసే డిస్కషన్ సీన్స్‌లో అర్జున్‌ తనదైన అనుభవం తో చక్కగా నటించారు. ఇక హీరో శరత్‌కుమార్‌ విలనిజాన్ని ప్రారంభంలో చూపినట్లు చివరి వరకు మెయిన్‌టెయిన్‌ చేయలేకపోయారు. సెకండాఫ్‌లో ముస్తఫా అనే రిటైర్డ్‌ మిలటరీ సైనికుడి పాత్రలో సాయికుమార్‌ నటన బావుంది. ఇక నదియా, వెన్నెలకిశోర్‌, హరీశ్‌ ఉత్తమన్‌, బోమన్‌ ఇరానీ, రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళి, అన్వర్‌ అనే కుర్రాడి పాత్రలో నటించిన లగడపాటి శ్రీధర్‌ తనయుడు అందరూ బాగా నటించారు.
వ‌క్కంతం వంశీ రాసిన డైలాగ్స్‌ బాగున్నాయి. సినిమాకి ప్లస్ అయ్యాయి . రాజీవ్ రవి సినిమాటోగ్రఫి సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్‌. ఆర్మీ సీన్స్‌ తో పాటు ఇతర సన్నివేశాలను అద్భుతంగా కెమెరాలో బంధించాడు . ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌చాలా బావున్నాయి. స్టార్టింగ్‌లో పోలీస్‌ స్టేషన్‌లో వచ్చే ఫైట్‌, ఇంటర్వెల్‌ ఫైట్‌, ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ అన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. విశాల్‌ శేఖర్‌ మ్యూజిక్‌లో మూడు సాంగ్స్‌ బాగున్నాయి… ‘ఐ యామ్‌ లవర్‌ ఆల్‌సో’…’ఇరగ ఇరగ సాంగ్స్‌’లో బన్ని స్టెప్పులు ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది – రవళి