రొటీన్ కధతో….. ‘డిజే దువ్వాడ జగన్నాధం’ చిత్ర సమీక్ష

DJ Duvvada Jagannadham Movie Latest Photos HD Stills Allu Arjun Pooja Hegde
                                               సినీవినోదం రేటింగ్ : 2.5/5
 
శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్ పై హ‌రీశ్ శంక‌ర్‌ క‌థ, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం లో దిల్‌రాజు , శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు .
దువ్వాడ జగన్నాథమ్ (అల్లు అర్జున్).. విజయవాడ అగ్రహారంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కుర్రాడు. బ్రాహ్మణ ఆచారాలు వ్యవహారాలు పాటిస్తూనే..జగన్నాథమ్, అన్యాయాన్ని చూస్తే మాత్రం సహించలేడు. జగన్నాథమ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని తండ్రి(తనికెళ్ల భరణి), అతడి మెడలో రుద్రాక్ష వేస్తాడు. ఆ రుద్రాక్ష మెడలో ఉండగా ఎవరి మీద చెయ్యి వేయవద్దని ఒట్టు పెడతాడు. అందుకే తన కంటికి ఏ అన్యాయం కనిపించినా.. ఆ కొద్ది సేపు రుద్రాక్ష పక్కన పెట్టి తన పని కానిచ్చేస్తాడు. అర్జునుడిలా అసుర సంహారం చేస్తున్న జగన్నాథానికి కృష్ణుడిలా పురుషోత్తం (మురళీ శర్మ) కలుస్తాడు . అతనితో కలిసి అన్యాయం చేసినవాళ్ల పనిపడుతుంటారు. ఎవరికీ తెలియకుండా అన్యాయం అంతు చూసే జగన్నాథమ్, బయటి ప్రపంచానికి అన్నపూర్ణ క్యాటరింగ్స్ నడుపుతుంటాడు.
తన ఫ్రెండ్ విఘ్నేశ్వర శాస్త్రి (వెన్నెల కిశోర్) పెళ్లికి క్యాటరింగ్ చేయడానికి వెళ్లిన జగన్నాథానికి, పూజ (పూజ హెగ్డే) పరిచయం అవుతుంది. ఆమె అందం, అల్లరి నచ్చిన జగన్నాథమ్ ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ పెళ్లి వేడుక నుంచి తన కూతుర్ని చూసొస్తానని వెళ్లిన జగన్నాథమ్ బాబాయ్ ( చంద్రమోహన్) చనిపోతాడు. తాను పాతికేళ్లుగా దాచుకున్న డబ్బును అగ్రో డైమండ్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో స్థలం కోసం కట్టిన చంద్రమోహన్ మోసపోయానని తెలుసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు.బాబాయ్ చావుతో జగన్నాథమ్ రగిలిపోతాడు. తనను ఎత్తుకొని పెంచిన బాబాయ్ చావుకు కారణమైన వాళ్లను ఎలాగైన బయటికి లాగాలని నిర్ణయించుకుంటాడు. ఆ కంపెనీ ఎండి స్టీఫెన్ ప్ర‌కాష్‌(శ‌త్రు)ను ప‌ట్టుకుంటాడు. కానీ స్టీఫెన్ ప్ర‌కాష్ వెనుక ఉండి రొయ్య‌ల నాయుడు(రావు ర‌మేష్) ఈ నాట‌కం ఆడిస్తున్నాడ‌ని తెలియ‌దు.అలాగే డిజె అంటే ఎవ‌రో కూడా రొయ్య‌ల‌నాయుడుకి తెలియ‌దు. స్టీఫెన్ ప్రకాష్ అస‌లు గుట్టు ఎక్క‌డ చెప్పేస్తాడోన‌ని రొయ్య‌ల నాయుడు భ‌య‌ప‌డి డిజెను చంపేయాల‌నుకుంటాడు. రొయ్య‌ల నాయుడుకి జ‌గ‌న్నాథ‌మ్‌, డిజె ఒక‌టే అనే నిజం ఎలా తెలుస్తుంది? చివ‌ర‌కు డిజెగా జ‌గ‌న్నాథ‌మ్ ప్ర‌జ‌ల‌కు ఎలా న్యాయం చేశాడు? త‌న ప్రేయ‌సిని ఎలా ద‌క్కించుకున్నాడు అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…
 
మనం చాలా సార్లు చూసిన రొటీన్ కధతోనే ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ చేసాడు . సినిమాలో అస‌లు పాయింట్… “హీరో అన్యాయాల‌పై తిర‌గ‌బ‌డ‌తాడు..మరోవైపు ఎవ‌రికీ తెలియ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బ్రాహ్మ‌ణ వేష‌ధార‌ణ‌లో వంట‌వాడిగా ఉంటాడు”… ఈ విష‌యం ప్రారంభంలోనే తెలిసిపోతుంది. ద‌ర్శ‌కుడు అస‌లు పాయింట్‌ను ముందుగానే రివీల్ చెయ్యడంతో తర్వాత ఏం జరుగుతుంది? అనేది సులభంగా ఊహించేయవచ్చు. దాంతో సన్నివేశాల్లో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. ఆ తరువాత  సినిమా  కొన్ని సన్నివేశాలు మినహా చాలా వరకు చప్పగా సాగింది. అలాగే మొదటి అర్థ భాగంలో మంచి వినోదాన్ని ఇస్తూ సరదాగా కనిపించిన జగన్నాథం పాత్ర రెండవ భాగం లో పెద్దగా అనిపించకపోవడంతో ఎంటర్టైన్మెంట్  మిస్సయింది.
 
ఇక హీరో హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ , హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్, హీరో ఎలివేష‌న్ స‌న్నివేశాలు మిన‌హా సినిమా అంతా రివెంజ్ ఫార్ములాలో సాగుతుంది. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ హీరోలోని రెండు షేడ్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. క‌థ పాత‌దే అయినా, ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాను బాగానే నడిపించిన దర్శకుడు క్లైమాక్స్ విషయంలో నిరాశపరిచాడు. యాక్షన్ మూడ్ లో సాగుతున్న సినిమా క్లైమాక్స్ వచ్చే సరికి పూర్తిగా కామెడీ టర్న్ తీసుకోవటం ఇబ్బంది పెడుతుంది. కామెడీ ఆకట్టుకున్నా.. క్లైమాక్స్ లో ఉండాల్సిన ఇంటెన్సిటీ మాత్రం మిస్ అయ్యింది.
ఒక‌వైపు మాస్‌గా అన్యాయాల‌పై తిర‌గ‌డ‌బ‌డే డీజే, మ‌రోవైపు కుటుంబం కోసం తాప‌త్ర‌య‌ప‌డే జ‌గ‌న్నాథ శాస్త్రిగా అల్లు అర్జున్ రెండు షేడ్స్‌లో బాగా న‌టించాడు. ముఖ్యంగా బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా అల్లు అర్జున్ వేష‌ధార‌ణ‌, సంభాషణలు పలికిన తీరు, హావ‌భావాలు చ‌క్క‌గా ప‌లికించాడు. ఇక ఫైట్స్‌, డ్యాన్సులు ఎలానూ బాగా చేసాడు .పూజా హెగ్డే ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్స్ , స్విమ్ సూట్‌లో పూజా లుక్ స‌హా పాట‌ల్లో పూజా హెగ్డే గ్లామ‌ర్ యూత్‌ను ఆక‌ట్టుకుంటుంది. పూజా హెగ్డే బ‌న్నితో పోటీ ప‌డుతూ డ్యాన్సులు చేసింది. రొయ్య‌ల నాయుడు గా రావు గోపాల‌రావును త‌ల‌పిస్తూ రావు ర‌మేష్ చేసిన విల‌నిజం ఆక‌ట్టుకుంటుంది. రావు ర‌మేష్ త‌న‌యుడిగా సుబ్బరాజు న‌ట‌న కూడా కామెడిగా సాగుతుంది. ఇక త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, శ‌త్రు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్ బాగా చేసారు .
 
ద‌ర్శ‌కుడు  హరీష్ శంకర్ అందించిన డైలాగ్స్ పేలాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది . టైటిల్ సాంగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఐనాక బోస్‌ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంది. చోటా కె. ప్ర‌సాద్‌ ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి – ధరణి