‘అమ్మ’పై నమ్మకం పోయింది, తిరిగి చేరే ప్రసక్తే లేదు !

‘అమ్మపై నమ్మకం పోయింది. ఎట్టిపరిస్థితుల్లో అందులో చేరబోం. న్యాయం జరుగుతుందన్న భరోసా లేదు. ఇంక అసోషియేషన్‌ను నమ్మే ప్రసక్తే లేదు’ అంటూ  15 మంది సీనియర్‌ నటీమణులు  ఓ ప్రకటనను విడుదల చేశారు. నటి భావన పై లైంగిక వేధింపులు..  ‘మళయాళం మూవీ ఆర్టిస్ట్స్‌'(అమ్మ-AMMA) నిర్ణయంపై రాజుకున్న వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించటం లేదు. అసోషియేషన్‌ నష్టనివారణ చర్యలపై హీరోయిన్లు మాత్రం శాంతించటం లేదు. ‘వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ తరపున 15 మంది సీనియర్‌ నటీమణులు తాము ఎట్టిపరిస్థితుల్లో తిరిగి అమ్మలో చేరబోమని స్పష్టం చేశారు.  ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. 
 
‘అమ్మపై నమ్మకం పోయింది. ఎట్టిపరిస్థితుల్లో అందులో చేరబోం. న్యాయం జరుగుతుందన్న భరోసా లేదు. ఇంక అసోషియేషన్‌ను నమ్మే ప్రసక్తే లేదు’ అంటూ.. వారంతా ప్రకటనలో పేర్కొన్నారు. నటి అక్కినేని అమలతోపాటు రంజనీ, సజిత మదంబిల్‌, కానీ కుస్రూతీ, శాంతి బాలచంద్రన్‌ తదితరులు అందులో ఉన్నారు. ‘ఇండస్ట్రీల్లో మహిళలను ఆటబొమ్మలుగా చూస్తున్నారని, అమ్మ వైఖరి అప్రజాస్వామ్యికంగా ఉంది. ఏకపక్ష నిర్ణయాలే అమలవుతున్నాయని, తమ తోటి నటి లైంగిక దాడి  కి గురైతే.. నిందితుడికి బాసటగా నిలిచే నిర్ణయం తీసుకుందని, సమాన వేతన చట్టం అమలు కావటంలేదని.. ఇలా ఎనిమిది  కారణాలతో కూడిన ఓ లేఖను డబ్ల్యూసీసీ అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు . మహిళల పట్ల వివక్షత పోయి.. సినిమా అంటే ప్రజలు ఓ మాధ్యమంగానే చూసే రోజులు రావాలని తాము కోరుకుంటున్నట్లు వారు లేఖలో తెలియజేశారు. 
ఆ నిర్ణయం సభ్యులంతా సమీక్షించి తీసుకుంది !
తీవ్ర దుమారం రేపిన అసోసియేషన్‌ ఆఫ్‌ మళయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) నిర్ణయంపై అధ్యక్షుడు మోహన్‌లాల్‌ ఎట్టకేలకు స్పందించారు. నటుడు దిలీప్‌ ఆ నిర్ణయం ఏకపక్షంగా తీసుకుంది కాదని ఆయన స్పష్టం చేశారు. లండన్‌లో ఉన్న ఆయన ఈమేరకు మీడియాకు శనివారం ఓ లేఖ రిలీజ్‌ చేశారు. 
 
‘అమ్మ’  మహిళా వ్యతిరేకి అన్న ఆరోపణలు సబబు కాదు. అసోషియేషన్‌లో ఏకీకృత విధానాలే అమలవుతుంటాయి. దిలీప్‌పై వేటు ఎత్తివేత నిర్ణయం నేనొక్కడినే తీసుకోలేదు. అది సభ్యులంతా సమీక్షించి తీసుకుంది. దీనివెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్నది నిజం కాదు’’ అంటూ ఓ పెద్ద వివరణతో కూడిన లేఖను మోహన్‌లాల్‌ విడుదల చేశారు. కాగా, అమ్మ అధ్యక్షుడిగా కొలువుదీరిన వెంటనే మోహన్‌లాల్‌ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ దుమారం రేపింది.
 
భావన ఉదంతం సమయంలో మోహన్‌లాల్‌ స్పందిస్తూ… ఇండస్ట్రీలో ఆడపడుచులంతా తన అక్కచెల్లెళ్లతో సమానమని, వారికి ద్రోహం జరిగితే చూస్తూ ఉపేక్షించబోనని వ్యాఖ్యానించారు. అంతేకాదు దిలీప్‌ అరెస్ట్‌ అయిన వెంటనే అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు.అయితే ఎనిమిది నెలల తర్వాత దిలీప్‌ బయటకు రావటం, తిరిగి సినిమాలు చేసుకుంటుండటంతో తిరిగి ఇప్పుడు నిషేధం ఎత్తేశారు. అయితే ఈ నిర్ణయం వెనుక కొందరు నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపించాయి. పైగా అమ్మ సభ్యుల సంభాషణతో కూడిన ఓ ఆడియో క్లిప్‌ వాట్సాప్‌ వైరల్‌ అయి దుమారం రేపింది. రాజీనామాల పేరుతో హీరోయిన్లు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నారంటూ ఆ క్లిప్‌లో ఉంది. దీంతో ‘వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌'(డబ్ల్యూసీసీ) అమ్మపై మండిపడింది.