ఆ తండ్రీ బిడ్డల స్ఫూర్తితోనే అమీర్ ‘దంగల్’

గీతా ఫొగట్‌.. భారత మహిళా రెజ్లింగ్‌ సంచలనం. ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొట్టమొదటి మహిళా రెజ్లర్‌. తండ్రి పట్టుదలకు తన ఏకాగ్రతను జోడించి… 2010లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణాన్ని గెలుచుకుంది. భారత మహిళా రెజ్లింగ్‌లో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఆ తండ్రీ బిడ్డల స్ఫూర్తితోనే ఇప్పుడు సినిమా రాబోతోంది. అది.. ‘దంగల్‌’! నితేష్‌ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్‌ తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సందర్భంగా గీత విజయప్రస్థానం గురించి పరిచయం…

2010.. న్యూఢిల్లీ కామన్‌వెల్త్‌ గేమ్స్‌. మహిళా రెజ్లింగ్‌ పోటీల్లో ఓ హర్యానా అమ్మాయి తలపడింది. ఆ హౌరాహౌరీ పోరులో ప్రత్యర్థులను మట్టికరిపించి స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. ఆమే గీత! ఆరేళ్ల కిందట స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న గీత.. ఆ తరువాత మహిళల రెజ్లింగ్‌ను పాపులర్‌ చేసింది. ఎంతోమంది ఈ స్పోర్ట్స్‌వైపు వచ్చేందుకు బాటలు వేసింది. హర్యానాలోని బిశ్వాని జిల్లాలో పుట్టిన గీత తండ్రి మహవీర్‌… రెజ్లర్‌! తాను ఛాంపియన్‌ కాలేదు. కానీ కూతుళ్లకు ట్రైనింగ్‌ ఇచ్చేంత అవగాహన ఉంది. అందుకే తన కలను తన కూతుళ్ల ద్వారా నెరవేర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవు… బురదగుంటలనే రెజ్లింగ్‌ సర్కిల్‌ చేసి.. ట్రైనింగ్‌ ఇచ్చాడు. కూతుళ్లు విజయం సాధించినప్పుడల్లా వాళ్లకన్నా ఎక్కువగా పొంగిపోయాడు. తండ్రి ప్యాషన్‌ను తమదిగా చేసుకున్నారు పిల్లలు. వాళ్లలో పెద్దది గీత. తానెప్పుడూ రెజ్లర్‌ కావాలని కోరుకోలేదు. తనకు 12 ఏళ్ల వయసప్పుడు రెజ్లింగ్‌ నేర్చుకోమని ప్రోత్సహించాడు తండ్రి. ఆ నేర్చుకోవడంలో ఉన్న ఆనందం.. ఒక్కసారి అనుభవంలోకి వచ్చాక ఇంక రెజ్లింగ్‌ను వదిలిపెట్టలేదు గీత. ఆ తరువాత గీత బాటలోనే చెల్లెళ్లు బబిత, రీతూ, వినేష్‌, ప్రియాంక, సంగీత నడిచారు. వినేష్‌, ప్రియాంకలు మహవీర్‌ సోదరుని పిల్లలు… తండ్రి హత్యకు గురవ్వడంతో వారిని దత్తత తీసుకుని తనే సాకుతున్నాడు. ఆడపిల్లలని ఏనాడూ నిరాదరణ చూపలేదు. మగవాళ్లకు దీటుగా ఉండాలనే పురుషుల ఆధిపత్య క్రీడ అయిన రెజ్లింగ్‌కి ప్రోత్సహించాడు.

కట్టుబాట్లను ధిక్కరించి…

సంప్రదాయాలకు కట్టుబాట్లకు అత్యంత విలువ ఇచ్చే హర్యానా రాష్ట్రం నుంచి ఆడపిల్లలు అట్లాంటి స్పోర్ట్స్‌లో చాంపియన్‌గా నిలవడం అంత సులభంగా జరిగిపోలేదు. రెజ్లింగ్‌ నేర్చుకునే తొలినాళ్లలో ప్రత్యర్థులంతా మగపిల్లలే. వాళ్లతో తలపడటం సాధారణ విషయం కాదు. అందుకే ఎంతో ఓర్పుతో ఫిజికల్‌ వర్క్‌, పుషప్స్‌ చేసేది గీత. రెజ్లింగ్‌ను కూతుళ్ల కెరీర్‌గా మార్చినందుకు మహవీర్‌సింగ్‌ను చాలా మంది విమర్శించారు. జుట్టు కత్తిరించుకుని, షార్ట్స్‌ వేసుకుని ఉన్న ఫొగట్‌ సిస్టర్స్‌ను చూసి ”మిమ్మల్నెవరు పెళ్లి చేసుకుంటారు” అని ఎగతాళి చేశారు. అది మగవాళ్ల క్రీడేనంటూ పరిమితులు విధించే పని చేశారు. కానీ.. కూతుళ్లు సాధించబోయేదాన్ని ముందే ఊహించిన మహవీర్‌ వాటిని పట్టించుకోలేదు. ‘పెళ్లే జీవితం కాదు… దానికన్నా సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి’ అన్నాడు. తండ్రి నమ్మకాన్ని చూసిన గీతలో గెలవాలన్న ఆకాంక్ష పెరిగింది. అయితే కొన్నిసార్లు తండ్రి కోప్పడేవాడు.. కఠినంగా ఉండేవాడు. అతనలా ఉండకపోతే ఇప్పుడు ఈ సక్సెస్‌ సాధ్యమయ్యేది కాదు.

నాన్న ప్రోద్బలంతోనే…

‘మా నాన్న ప్రోద్బలంతోనే ఈ స్పోర్ట్స్‌లోకి వచ్చినా.. ఈ కెరీర్‌ ఎందుకు ఎంచుకున్నామా? అని బాధపడింది మాత్రం లేదు’ అంటుంది గీత. అందుకే ఇప్పటికీ గెలిచిన ప్రతిసారీ తండ్రి ప్రశంసకోసం ఎదురుచూస్తుంది. ‘నా కెరీర్‌ను మా నాన్నే మలిచారు. రెజ్లింగ్‌ కాకుండా సాధారణ చదువులు చదివి ఉంటే… ఈ పాటికి పెళ్లైపోయి, సమాజంలో నా వయసు ఆడపిల్లలు ఎలా ఉన్నారో అలాగే ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నా రాష్ట్రంలోని అమ్మాయిలకు ఎంతో కొంత చేయగలుగుతున్నా. తన జీవితాన్ని, కెరీర్‌ను తనే మలుచుకునే స్వేచ్ఛ ఉన్ననాడే అమ్మాయిలు సంతోషంగా ఉండగలుగుతారు. ఏ బట్టలు ధరించాలి, ఎలా ఉండాలనే ఆంక్షలు పెట్టకుండా అవి వారికే వదిలేయాలి. ప్రత్యేకించి అమ్మాయిలకు విద్య ముఖ్యం… అది గుర్తించి ప్రోత్సహించిననాడే సమాజ ప్రగతి. అమ్మాయిల పట్ల ఈవ్‌టీజింగ్‌, అత్యాచారాలు, హత్యలు లాంటి వార్తలు విన్నప్పుడు బాధ కలుగుతుంది. మన దేశంలో మహిళలకు సరైన రక్షణ లేకపోవడం విచారం కలిగిస్తుంది’ అంటుంది గీత.

స్ఫూర్తినివ్వాలని…

పురుషాధిపత్యం ఉన్న ఓ క్రీడలో తన కూతుళ్లను ప్రోత్సహించి… విజేతలుగా నిలిపిన అసలు విజేత మహవీర్‌. అందుకే ఆయన కథనే సినిమాగా తీయబోతున్నారు డైరెక్టర్‌ నితేష్‌ తివారీ. ఈ సినిమాలో తండ్రి పాత్రను ఆమిర్‌ఖాన్‌ పోషిస్తున్నారు. ‘ఆమిర్‌ఖాన్‌లాంటి పెద్దస్టార్‌ మా నాన్న పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది. సినిమా పూర్తిగా మా నాన్న పడ్డ శ్రమ, మా అక్కాచెల్లెళ్ల గురించే. ఈ తరం అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నా’ అంటోంది గీత. గీత ప్రస్తుతం రియో ఒలింపిక్స్‌కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నది. గీత చెల్లెళ్లు బబిత, వినేష్‌ 2014లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణపతకాలను గెలుచుకున్నారు. మిగిలిన ముగ్గురు జూనియర్‌ లెవల్‌(అండర్‌-15)లో తలపడుతున్నారు.