సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూటర్‌గా కూడా …

బాలీవుడ్‌లో ఒక పక్క హీరోగా, మరో పక్క ప్రొడక్షన్‌ రంగంలోనూ రాణిస్తూ ఉంటారు. అటువంటి వారిలో షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌ వంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ప్రియాంక చోప్రా కూడా చేరింది. తన ప్రొడక్షన్‌లో ప్రాంతీయ భాషా చిత్రాలను నిర్మిస్తోంది. వీరంతా నిర్మాణం వరకే ఉన్నారు. ఇప్పుడు అమీర్‌ ఖాన్‌ కాస్తా ఓ అడుగు ముందుకేసి పంపిణీ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఇతను హీరో మాత్రమే కాదు, టీవీ వ్యాఖ్యాతగానూ నిరూపించుకున్నాడు. ‘సత్యమేవ జయతే’ కార్యక్రమం ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఎన్నో సామాజిక సమస్యలను చూపించడానికి ఇది వేదికైంది.

ఇప్పుడు తన సినిమాలను తానే నిర్మిస్తూ, వాటికి డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న ‘సీక్రెట్‌ సూపర్ స్టార్’ కు ఆయన కూడా పంపిణీ దారుడే. ఈ సినిమా అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే రూపొందుతోంది. డిస్నీకి సంబంధించి పంపిణీ బాధ్యతలు చూసే ప్రకాష్‌ జోషి గత వారం తప్పుకున్నాడు. దీంతో ఆ బాధ్యతలు అమీర్‌ చూసేందుకు సిద్ధమయ్యాడు. దీని కోసం తన అనుకూల బృందాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డాడు. ‘సీక్రెట్‌ సూపర్ స్టార్’ ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో జైరా వాసిమ్‌ సింగర్‌ కావాలనే యువతి పాత్రలో కనిపించబోతుంది. ఈమెకు సాయపడే వ్యక్తిగా అమీర్‌ చేస్తున్నాడు.