అనితర సాధ్యమైన కృషికి ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’

అమితాబ్‌ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమా గురించి చెప్పడం కష్టం. హిందీ సహా అనేక భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలకు గానూ ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డు దక్కడంతో అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది. అలుపెరుగని నటుడిగా ఆయన కృషి అనితర సాధ్యమని పొగుడుతున్నారు. నటుడుగా… నిర్మాతగా, టెలివిజన్‌ హోస్ట్‌గా, అప్పుడప్పుడు నేపథ్యగాయకుడిగా అమితాబ్‌ బహుముఖ ప్రతిభ చూపారు.
‘జంజీర్‌’, ‘దీవార్‌’, షోలో’ వంటి చిత్రాలతో ఆయన ‘యాంగ్రి యంగ్‌మన్‌’గా 1970 దశకంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ ఏర్పరచుకొన్నారు. ‘డాన్‌’, ‘కూలీ’, ‘అగ్నిపథ్‌’, ‘సర్కార్‌’, ‘బ్లాక్‌’, ‘పా’ వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో నటించారు. ‘అగ్నిపథ్‌’, ‘బ్లాక్‌’, ‘పా’, ‘పీకూ’ చిత్రాలకు జాతీయ అవార్డులు లభించాయి. అమితాబ్‌ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అమితాబ్‌ హుషారుగా ఉంటూ 76 ఏళ్ల వయసులో కూడా నటిస్తూనే ఉన్నారు. అమితాబ్‌ తండ్రి హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌ ప్రముఖ కవి కూడా. భార్య జయాబచ్చన్‌, కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్యారాయ్‌ బాలీవుడ్‌లో నటీనటులు.
 
‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్‌’, ‘పద్మ విభూషణ్‌’…
భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులు మూడింటినీ అమితాబ్‌ అందుకున్నారు . 1984లో ‘పద్మశ్రీ’, 2001లో ‘పద్మభూషణ్‌’, 2015లో ‘పద్మ విభూషణ్‌’ లభించాయి.అత్యున్నత పౌర పురస్కారమైన ‘నైట్‌ ఆఫ్‌ ది లీజియన్‌ ఆఫ్‌ హానర్‌’తో ఫ్రాన్స్‌ ప్రభుత్వం గౌరవించింది. ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు… అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
‘ఫెయిల్డ్‌ న్యూ కమర్‌’ అనేవారు
పవిత్ర నదుల సంగమస్థానం అలహాబాద్‌లో అమితాబ్‌ బచ్చన్‌ పుట్టారు. తండ్రి హరివంశ్‌ రాయ్‌ అమితాబ్‌ను ‘ఇంక్విలాబ్‌’ అని అమితాబ్‌ను ముద్దుగా పిలిచేవారు. ఆ పేరును అమితాబ్‌గా హరివంశ్‌ రాయ్‌ తన సహచర కవి సుమిత్రానందన్‌ సలహాతో మార్చారు. హరివంశ్‌ రాయ్‌ కలంపేరు ‘బచ్చన్‌’ అమితాబ్‌ ఇంటిపేరుగా మారింది. తల్లి తేజీ బచ్చన్‌కు నటన మీద ఉన్న ఆసక్తి ప్రభావం అమితాబ్‌ మీద పనిచేసింది.తొలి సారి 1969లో మృణాల్‌ సేన్‌ నిర్మించిన ‘భువన్‌ షోమ్‌’ సినిమాకు గళాన్ని అందించారు.
పన్నెండు ఫ్లాప్‌ ల తర్వాత చేసిన ‘జంజీర్‌’ సినిమాతో అమితాబ్‌ ‘యాంగ్రి యంగ్‌మ్యాన్‌ గా గుర్తుంపు పొందారు. ‘జంజీర్‌’లో అమితాబ్‌ బచ్చన్‌ నటించడానికి రచయితలు సలీం-జావేద్‌ సహకరించారు. ‘ఆనంద్‌’ లో సపోర్టింగ్‌ రోల్‌, ‘బాంబే టు గోవా’లో హీరో ..ఈ చిత్రాల విజయాన్ని పక్కనపెడితే, ప్రారంభంలో అమితాబ్‌ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌లే. అందుకే ఆయన్ని ‘ఫెయిల్డ్‌ న్యూ కమర్‌’ అనేవారు.
అమితాబ్‌ నటించిన ‘జంజీర్‌’, యాదోంకీ బారాత్‌’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు తెలుగులో రీమేక్‌ అయ్యాయి. వీటన్నింటిలో ఎన్టీఆర్‌ హీరోగా నటించడం విశేషం.
బాలీవుడ్‌ మాస్టర్‌ పీస్‌గా చెప్పుకునే…యశ్‌ చోప్రా దర్శకత్వంలో గుల్షన్‌ రాయ్‌ నిర్మించిన ’దీవార్‌’లో అమితాబ్‌ అద్భుతంగా నటించారు. ఇందులో ఆయన పాత్ర అండర్‌ వరల్డ్‌ డాన్‌ హాజీ మస్తాన్‌లా రచయితలు సలీం-జావేద్‌ రూపుదిద్దారు.
‘కూలీ’చిత్రాన్నిఅమితాబ్‌కు పునర్జన్మనిచ్చిన చిత్రంగా పేర్కొనవచ్చు. బెంగుళూరు యూనివర్సీటీలో 1982లో అమితాబ్‌, పునీత్‌ ఇస్సార్‌పై తెరకెక్కిస్తున్న పోరాట సన్నివేశ చిత్రీకరణలో జరిగిన ప్రమాదం కారణంగా అమితాబ్‌ తీవ్రం గా గాయపడ్డారు.ఆయన బయటపడటానికి చాలాకాలం పట్టింది.
హాలీవుడ్‌ లో 2013 లో ‘ది గ్రేట్‌ గట్స్‌ బై’ అనే చిత్రం లో నటించారు. అమితాబ్‌ బచ్చన్‌ మైనపు బొమ్మలు లండన్‌, న్యూయార్క్‌, హాంగ్‌ కాంగ్‌, బ్యాంకాక్‌, వాషింగ్టన్‌, ఢిల్లీ నగరాలలోని ‘మేడం టుస్సాడ్‌’ మ్యూజియంలలో ఉన్నాయి.