ప్ర‌భాస్‌, దీపిక వైజ‌యంతి చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌

వైజ‌యంతీ మూవీస్ 50 సంవ‌త్స‌రాలలో ప‌లు విజయవంతమైన చిత్రాల‌ను నిర్మించింది.ఇటీవల సావిత్రి జీవితం ఆధారంగా నిర్మించిన చిత్రం ‘మ‌హాన‌టి’ ప‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాల‌ను అందుకుంది. ఇప్పుడు  వైజయంతీ మూవీస్ యూనివ‌ర్స‌ల్ అప్పీల్ తో చేస్తున్న బ‌హుభాషా చిత్రంలో ఒక కీల‌క పాత్ర ‘లివింగ్ లెజెండ్’ అమితాబ్ బ‌చ్చ‌న్‌ తో చేయించడం విశేషం.

అశ్వినీద‌త్ మాట్లాడుతూ…”అమితాబ్ బ‌చ్చ‌న్‌ ఇన్నాళ్ల త‌ర్వాత మా బ్యాన‌ర్ వైజ‌యంతీ మూవీస్  ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో భాగం అవుతున్నారు.‌ భార‌తీయ సినిమా గ్రేటెస్ట్ ఐకాన్ అమితాబ్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం నిజంగా నాకు ల‌భించిన‌ అద్భుత‌మైన‌, అత్యంత సంతృప్తిక‌ర క్ష‌ణం” అని అన్నారు.
వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమా ప‌తాకాల‌పై నిర్మించిన ప‌లు సినిమాలలో కీల‌క‌పాత్ర పోషిస్తూన్న స‌హ నిర్మాత‌లు స్వ‌ప్నా ద‌త్‌, ప్రియాంకా ద‌త్ ఈ చిర‌స్మ‌ర‌ణీయ సంద‌ర్భంలో త‌మ అనిర్వ‌చ‌నీయ‌మైన ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్‌ ‌లో త‌న ఆనందాన్ని పంచుకుంటూ…”ఎట్ట‌కేల‌కు ఒక క‌ల నిజమ‌వుతోంది.. లెజండ‌రీ అమితాబ్ బ‌చ్చ‌న్ సార్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంటున్నాను.. #NamaskaramBigB” అని పోస్ట్ చేశారు.
ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ…” అమితాబ్ బ‌చ్చ‌న్ సార్ మా చిత్రంలో చెయ్యడం  నాకు ల‌భించిన అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయ‌న‌ది పూర్తి స్థాయి పాత్ర‌. ఆయ‌న అయితేనే ఆ పాత్ర‌కు న్యాయం జ‌రుగుతుంది” అని ఉద్వేగం తో చెప్పారు.