బాలీవుడ్‌ ‘మెగాస్టార్‌’, లేడీ ‘సూపర్‌ స్టార్‌’ కలిస్తే …

ఒకరు బాలీవుడ్‌ మెగాస్టార్‌, మరొకరు లేడీ సూపర్‌ స్టార్‌…. అమితాబ్‌ బచ్చన్‌, కంగనా రనౌత్‌.
ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ఆ సినిమాపై అంచనాలకు ఆకాశమే హద్దు అవుతుంది. పైగా వీరిద్దరూ కలిసి
ఓ ప్రాజెక్ట్‌ను అంగీకరించారంటే కచ్చితంగా అదొక వైవిధ్యమైన చిత్రమై ఉండాల్సిందే.
అదే కోవలో తాజాగా ఈ ఇద్దరు కలిసి ఓ బయోపిక్‌లో నటించబోతున్నారు. ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగ మహిళ ‘అరుణిమ సింగ్‌ జీవితం’ ఆధారంగా దర్శకుడు ఆర్‌.బాల్కీ ఓ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు. ఇందులో అరుణిమ పాత్రలో కంగనా నటించనుండగా, ఆమెకు మెంటర్‌గా అమితాబ్‌ బచ్చన్‌ నటించనున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే… కంగనా, రాజ్‌కుమార్‌రావ్‌ కలిసి మరోసారి నటిస్తున్నారు. శైలేష్‌ ఆర్‌ సింగ్‌, ఏక్తా కపూర్‌ నిర్మించబోతున్న సైకలాజికల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో ఈ ఇద్దరూ జోడీ కట్టబోతున్నారు. గతంలో వీరిద్దరు కలిసి ‘క్వీన్‌’ చిత్రంలో నటించిన విషయం విదితమే. ఈ తాజా చిత్రానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వం వహించనుండటం విశేషం. అన్నీ కుదిరితే ఈ చిత్రం మార్చిలో పట్టాలెక్కనుందట. కంగనా ప్రస్తుతం ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రంలో నటిస్తోంది. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.