సినిమా విశ్వజనీన మాధ్యమం! -అమితాబ్‌

“సినిమా థియేటర్‌లో చీకటిలో కూర్చున్నప్పుడు.. మన పక్కనున్నవాడిది ఏ కులం, ఏ రంగు, ఏ మతం అన్న విషయాలను అడగం. మనం చూసిన సినిమానే వాళ్లూ చూస్తారు. పాటలు వచ్చినప్పుడు ఆనందిస్తాం.. జోక్స్‌ వస్తే నవ్వుతాం.. ఏడుపొచ్చినప్పుడు ఏడుస్తాం. ఇవన్నీ మన పక్కన కూర్చున్న వాళ్లు.. మనం ఒకేలా చేస్తాం. సినిమా అనేది విశ్వజనీనమైన మాధ్యమం.. ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపే సత్తా దీనికి మాత్రమే ఉంద”ని అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. గోవాలో ప్రారంభమైన 50వ ‘ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా'(ఐఎఫ్‌ఎఫ్‌ఐ) వేడుకల్లో రెండో రోజు గురువారం అమితాబ్‌ మాట్లాడారు…
 
“ఆధునిక పోకడ వల్ల విచ్ఛిన్నమవుతున్న రంగాల్లో సినిమా కూడా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘సినిమా ఒక్కటే విశ్వజనీనమైన మాధ్యమం అని భావిస్తున్నా. ఆ విషయంలో భాష, ఇతర సామాజిక, ఆధునిక కారకాల కంటే ఇదే ఉత్తమం అని అనుకుంటున్నా. కులం, మతం, రంగు పేరుతో వ్యవస్థను విచ్చిన్నం చేస్తున్నారు. వాళ్లందరినీ ఒకే సంఘంగా మారుస్తాం. మా సృజనాత్మకతతో ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా ఉంచుతాం. ఆ తరహా చిత్రాలు రూపొందుతూనే ఉంటాయని ఆశ పడుతున్నా’ అని అన్నారు
 
గోవాతో అమితాబ్‌ అనుబంధం
‘గోవా నా సొంతిల్లు లాంటిది. నా మొదటి చిత్రం ఇక్కడే చిత్రీకరణ జరిపాం. అప్పటి నుంచీ ఇక్కడ చేస్తూనే ఉన్నా. షూటింగ్‌ సమయాల్లో.. పనుల నిమిత్తం ఇక్కడకొచ్చినప్పుడు అద్భుతమైన ఆతిథ్యం కూడా పొందాను’ అని చెప్పారు.50వ ఐఎఫ్‌ఎఫ్‌ఐ వేడుకల సందర్భంగా సినిమా ప్రేమికులు, ఉత్సాహవంతులకు ప్రపంచ సినిమాను చూసే అవకాశం కల్పించినందుకు గాను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
‘ సినిమా పరిశ్రమలో నా ప్రయాణానికి 50 ఏళ్లు. నా కెరీర్‌ను 1969 ప్రారంభించా. ‘ఐఎఫ్‌ఎఫ్‌ఐ’కి కూడా 50 ఏళ్లు. మా కోసం ఇటువంటి అద్భుతమైన వేడుక నిర్వహించినందుకు అభినందనలు. ప్రపంచ సినిమాల్లో సృజనాత్మకతను ఈ వేడుకల ద్వారా చూసే అవకాశం లభిస్తుంది. ఈ ఉత్సవాలకు ఏటా ప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది’ అని అన్నారు.