ఫైటింగ్‌ శిక్షణ కోసం చైనా

రిస్క్‌ తీసుకునే విషయంలో హీరోలతో హీరోయిన్లు పోటీపడుతున్నారు. ‘బాహుబలి–2’ చిత్రం కోసం ప్రభాస్, రానాలతో పాటు ఆ చిత్ర కథానాయకి అనుష్క చాలా కసరత్తులు చేశారు. ఇక ఇటీవల ‘సంఘమిత్ర’  కోసం అంటూ నటి శ్రుతీహాసన్‌ లండన్‌కు వెళ్లి కత్తిసాము లాంటి విలు విద్యల్లో శిక్షణ పొందిన విషయం తెలిసిందే.అయితే ఆ చిత్రం నుంచి ఆమె అనూహ్యంగా వైదొలిగారు. కాగా శివకార్తికేయన్‌తో నటించడానికి నటి సమంత కరాటే విద్య ఓ పట్టు పట్టినట్లు ఫొటోలు మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

తాజాగా నటి ఎమీజాక్సన్‌ యాక్షన్‌ హీరోయిన్‌గా అవతారమెత్తనున్నారు. అందుకోసం ఫైటింగ్‌లో శిక్షణ పొందడానికి చైనా వెళ్లనున్నారట. రజనీకాంత్‌తో ‘2.ఓ’ చిత్రంలో నటించిన ఎమీ ఆ చిత్ర విడుదల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కొత్తగా అవకాశాలేమీ చేతిలో లేవు. హిందీ చిత్రం క్వీన్‌ రీమేక్‌లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా, ఆ విషయం గురించి క్లారిటీ లేదు.ఇలాంటి పరిస్థితుల్లో ఎమీకి ఆంగ్ల చిత్రంలో నటించే అవకాశం వచ్చిందట. బ్రిటీష్‌ దర్శకుడు ఆండ్రూ మోరహన్‌ దర్శకత్వంలో ఇప్పటికే ఎమీ ‘బుకీమెన్‌’ అనే చిత్రంలో నటించారు. తాజాగా అదే దర్శకుడు ఈ అమ్మడికి మరో అవకాశం కల్పించారట. ఇది ఫుల్‌లెంగ్త్‌ యాక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందట. దాంతో ఎమీకి ఫైటింగ్‌లో శిక్షణ పొందమని దర్శకుడు సూచించారట.అందుకు అంగీకరించిన ఎమీ మూడు నెలల పాటు చైనాలో ఫైటింగ్‌లో శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే చైనాకు ఎగిరిపోనుందట.