ఇండియన్ సినిమాలకు టాటా బైబై !

ఈ ఆధునిక యుగంలో ప్రపంచం  చాలా చిన్నదైపోయింది. రేపన్నది  ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఉత్తరాదికి చెందిన నటి శ్రియ రష్యాకు చెందిన యువకుడిని పెళ్లాడింది. ఇలా ఎవరి జీవితం ఎవరితో ముడిపడుతుందో తెలియదు. నటి ఎమీజాక్సన్‌ విషయాన్నే తీసుకుంటే… ఎక్కడో కెనడాకు చెందిన ఈ అమ్మడు దర్శకుడు విజయ్‌ దృష్టిలో పడడం, ‘మదరాసుపట్టణం’ చిత్రంతో కోలీవుడ్‌లో హీరోయిన్‌ పరిచయం అవడం అన్నది ఆమే ఊహించి ఉండదు. కోలీవుడ్‌ నుంచి టాలీవుడ్, బాలీవుడ్‌కు వెళ్లిన ఎమీజాక్సన్‌ తమిళంలోనే ఎక్కువ చిత్రాలను చేసింది.

స్టార్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో నటించే అవకాశాలను రెండుసార్లు దక్కించుకున్న అతి తక్కువ మంది నటీమణుల్లో ఎమీ ఒక్కరు. ‘ఐ’ చిత్రంలో విక్రమ్‌ సరసన నటించి అందాల ప్రదర్శన చేసిన ఎమీ ప్రస్తుతం రజనీకాంత్‌తో జత కట్టిన ‘2.ఓ’ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇందులో రోబోగా అదరగొట్టనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం విడుదలనంతరం తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఈ భామ ఆ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తుండడం, కొత్త అవకాశాలు రాకపోవడం వంటివి నిరాశపరిచాయనే చెప్పాలి. అయితే ఆంగ్ల సీరియల్‌లో నటిస్తున్న ఎమీ తాజాగా తన అభిమానులకు షాక్‌ ఇచ్చే నిర్ణయాన్నే తీసుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. భారతీయ సినిమాలకు ఇక టాటా అని, తాను ఆఫ్రికన్‌ దేశంలోని మొరాకోలో సెటిల్‌ అవ్వబోతున్నానని ఎమీ చెప్పిందట. ఆ మాట నిజం అయితే ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురికాక మానరు