చేతినిండా పనిఉంటే ‘ఎక్స్‌ట్రా లగేజ్‌’ తో పని లేదు !

‘‘ఎప్పుడూ పనిలోనే భగవంతుడిని చూసుకుంటాను. నిద్ర లేచింది మొదలు చేయాల్సిన పని చేతినిండా ఉంటే అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది? దానికి మించిన తోడేం ఉంటుంది.. అందుకే నేనెప్పుడూ పని వెంట పరుగులు తీస్తుంటాను’’ అని చెప్పారు అమీ జాక్సన్‌. శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ సరసన ఆమె నాయికగా నటించిన ‘2.0’ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. మరోవైపు ఓ కన్నడ చిత్రం, మరో ఆంగ్ల చిత్రంతో బిజీగా ఉన్నారు అమీ జాక్సన్‌.

అమీ మాట్లాడుతూ ‘‘పని తక్కువైనప్పుడే మనసు ఇతర విషయాల మీదకు మళ్లుతుంది. సరదాగా ఒకరు తోడుంటే బావుంటుందనిపిస్తుంది. వాళ్లతో కబుర్లు చెప్పాలనిపిస్తుంది. మాటలు మాటలుగానే ఉండవు కదా, కొన్నిసార్లు ప్రేమలవుతాయి, ఇంకొన్నిసార్లు గొడవలూ అవుతాయి. ఆ ప్రేమను, బాధను మనసు మోయకతప్పదు. అది ఎక్స్‌ట్రా లగేజ్‌ అని నా భావన. ఇదంతా ఎక్కడ మొదలయిందని ఆలోచిస్తే చేతిలో ఉన్న పనిని పక్కన పెట్టిన సన్నివేశమో, అసలు పని అనేది లేని రోజో గుర్తుకొస్తాయి. పని ప్రాముఖ్యత అర్థమవుతుంది. అందుకే ఎప్పుడూ పనిలోనే భగవంతుడిని చూసుకుంటాను. ఇదే విషయాన్ని రజనీకాంత్‌గారు కూడా నాతో చాలా సార్లు అన్నారు. ‘మనిషి సెలబ్రిటీ కావచ్చు. కానీ సెలబ్రిటీ హోదా వచ్చాక తాను మనిషిని అనే సంగతిని ఎవరూ మర్చిపోకూడదు’ అని. రజనీసార్‌ నమ్మే సిద్ధాంతాన్ని నేను కూడా ఫాలో అవుతున్నాను’’ అని చెప్పారు అమీ జాక్సన్‌.