జాకీచాన్ తో చేసినా లక్కీ ఛాన్స్ రాలేదు !

అమైరా దస్తూర్… ఈ ముంబై ముద్దుగుమ్మ తెలుగు వారికి కూడా పరిచయమే. మొట్టమొదటి సినిమా బాలీవుడ్ లోనే చేసినా.. అమైరా చాలా మంది బీ-టౌన్ బేబ్స్ లాగే హైద్రాబాద్ ఫ్లైట్ ఎక్కింది. ఇక్కడకొచ్చి ‘‘మనసుకు నచ్చింది, రాజుగాడు’’ చిత్రాల్లో తళుక్కుమంది. సందీప్ కిషన్, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోస్ పక్కన మెరిసిపోయినా పరిశ్రమ చూపు ఆమెపై పడలేదు.
అసలు అమైరా బాలీవుడ్ ఎంట్రీ తరువాత తెలుగు కంటే ముందే తమిళానికి వెళ్లొచ్చింది. కోలీవుడ్‌లో కాలుమోపి ధనుష్ లాంటి హీరోతో ‘అనేగన్’ అనే సినిమా చేసింది. అది బాగానే ఆడినప్పటికీ అమైరాకి ప్రత్యేక గుర్తింపు ఏమీరాలేదు. పైగా అమైరా కూడా తమిళంలో కుదురుగా కూర్చోలేదు. ‘మిస్టర్ ఎక్స్’ అనే సినిమా కోసం బాలీవుడ్‌కు ఎగిరి వెళ్లిపోయింది. అక్కడ ముద్దుల స్టార్ ఇమ్రాన్ హష్మీతో ఆ చిత్రం చేసింది.అయినా.. ఫలితం శూన్యo !
తెలుగులో, తమిళంలో ఇప్పటి వరకూ అమైరా చేసిన సినిమాలేవీ చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్ పొందలేదు. పోనీ.. హిందీలో ఏమైనా ఆశాజనకంగా ఉందా అంటే.. అదీ లేదు. ముంబైలోనూ ఆఫర్లు తగ్గిపోతున్నాయి. ఇమ్రాన్ హష్మీతో సినిమా తరువాత ‘కాలాకాండీ’, ‘రాజ్మా చావల్’ లాంటి సినిమాలు చేసింది. అవేవీ వచ్చినట్టు కూడా జనం గుర్తించలేదు. ఈ లోపే జాకీచాన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ సరసన కూడా అమైరా ‘కుంగ్ ఫూ యోగా’ సినిమాలో నటించింది. దాని గురించి కూడా మాట్లాడుకోటానికి ఏం లేదు. ఇక ప్రస్తుతం ‘మెంటల్ హై క్యా’ అనే సినిమాలో నటిస్తోంది అమైరా. అది ఎంత వరకూ సక్సెస్ అవుతుందో తెలియదు. కాకపోతే, ఇలాంటి క్లిష్ట సమయంలోనే ఈ అమ్మడ్ని వెతుక్కుంటూ ఓ ఆఫర్ ఇష్టపడి వచ్చింది. సంగీత దర్శకుడి నుంచీ హీరో అయిన జీవీ ప్రకాశ్ నెక్ట్స్ మూవీలో అమైరా హీరోయిన్‌గా బుక్కైంది. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో సంచితా శెట్టి, సోనియా అగర్వాల్‌తో పాటూ అమైరా కనువిందు చేయనుంది. పైగా ఈ ముగ్గురు బ్యూటీస్‌తో జీవీ ప్రకాశ్ మూవీ త్రీడీలో తీస్తారట! ఈ తమిళ త్రీడీ ఆఫర్ తోనైనా… అమైరా అదృష్టం మారుతుందేమో చూడాలి