ఏం ధరించాలో ఆదేశించే హక్కు ఎవరికీ లేదు !

 “తను ఏం ధరించాలో తన ఇష్టమని.. ఇలాంటివే ధరించాలని ఆదేశించే హక్కు ఎవరికీ లేద”ని అనసూయ మరోమారు చెప్పింది. యాంకర్ అనసూయ వస్త్రధారణపై గతంలో కూడా పలుమార్లు కొందరు నెటిజన్ల నుంచి విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. అనసూయ మరీ ఎక్కువగా స్కిన్ షో చేస్తోందని, ఆమె పొట్టి బట్టలు వేసుకుని సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామనుకుంటోందని సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఆమె వివరణ ఇచ్చుకున్నప్పటికీ కొందరు మాత్రం అలాంటి కామెంట్స్ చేయడం మానుకోవడం లేదు….  ‘‘నీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అనసూయా.. ఎందుకలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు.. మేం ఫ్యామిలీతో కలిసి ప్రోగ్రామ్స్ చూడక్కర్లేదా!’’ అని తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.  ఆ  నెటిజన్ చేసిన కామెంట్ అనసూయకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఆ పోస్ట్‌పై అనసూయ ఘాటుగా స్పందించింది….
“తన ప్రోగ్రాం చూడటం నచ్చనప్పుడు చానల్ మార్చుకునే ఆప్షన్ ఉందని, కుటుంబ విలువల పట్ల అంత ప్రేమ ఉన్న మీకు.. మీ భావాలను ఎదుటి వారి మీద రుద్దకూడదన్న సంగతి తెలియదా? అని ఆమె ప్రశ్నించింది. ఎదుటి వారు ఎలాంటి వస్త్రాలు ధరించాలో వేరే వ్యక్తులు నిర్ణయించాల్సిన అవసరం లేదని అనసూయ బదులిచ్చింది. అంతగా ఇబ్బందిగా అనిపిస్తే మీ ఫ్యామిలీ కూడా ప్రోగ్రాం చూడటం మానేయండంటూ సమాధానమిచ్చింది. తానొక మహిళనని, తల్లినని, భార్యనని.. అలాంటి తన గురించి మాట్లాడే స్వేచ్ఛ నీకెవరిచ్చారంటూ నెటిజన్‌కు కౌంటరిచ్చింది. ఎక్స్‌పోజింగే లైంగిక దాడులకు కారణమైతే చిన్న పిల్లలపై, 65 ఏళ్ల ముసలి వారిపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని ఆమె ప్రశ్నించింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం తమ పని అని, తన పరిధులు తెలుసని ఆమె చెప్పింది. తను ఏం ధరించాలో తన ఇష్టమని.. ఇలాంటివే ధరించాలని ఆదేశించే హక్కు ఎవరికీ లేదని అనసూయ చెప్పింది. మారాల్సింది వస్త్రధారణ కాదని, ఆలోచనా విధానం అని అనసూయ గట్టిగానే బదులిచ్చింది.