ఈమెకూ రాజకీయాలంటే చాలా ఇష్టమట !

కోలీవుడ్, టాలీవుడ్‌ ప్రముఖులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. రాజకీయాలకు, చిత్ర పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాజాగా తమిళ రాజకీయాలు ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్, ‘విశ్వనటుడు’ కమలహాసన్‌ల చుట్టూ తిరుగుతున్నాయి. వీరి రాజకీయ రంగప్రవేశం త్వరలోనే ఉంటుందని వారి అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మన సీనియర్‌ కథానాయికల రాజకీయం తక్కువేం కాదు. ఇప్పటికే రోజా, నగ్మా, కుష్బు వంటి నటీమణులు రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. వారి వరుసలో కొత్తగా అంజలి చేరే అవకాశాలు కనిపిస్తున్నట్లు సోషల్‌ మీడియాల్లో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది.

అంజలి  కోలీవుడ్‌, టాలీవుడ్‌లోనూ సంచలన నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. పినతల్లితో విభేదం, నటుడు జైతో ప్రేమాయణంలోనూ కలకలం సృష్టించిన అంజలి ఈ మధ్య అనూహ్యంగా దేశ రాజధానిలో పార్లమెంట్‌ను విజిట్‌ చేసొచ్చారు. దీంతో అంజలి రాజకీయంపై మీడియా దృష్టి పెట్టింది. అందుకు తగ్గట్టుగానే ఈ అచ్చ తెలుగు అందాల ఆడపడుచు ఇటీవల ఒక భేటీలో… ‘తనకు రాజకీయాలంటే చాలా ఇష్టం అని, నిత్యం వాటిని గమనిస్తుంటాన’ని పేర్కొన్నారు. మీడియాకు ఆమాట  చాలు కదా! అంజలి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయనున్నారని, అక్కడ ప్రముఖ రాజకీయ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం వైరల్‌ అవుతోంది. కాగా ఈ భామ నటించిన ‘బెలూన్‌’ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.